కరోనా కథ ముగియ లేదు..!

దేశ ప్రజలను కరోనా భయాలు ఇంకా వీడలేదు. కేసులు తగ్గుతున్నాయి. కానీ ఆందోళన ఏ మాత్రం తగ్గలేదు. థర్డ్ వేవ్‌ సమయం సమీపిస్తుండటమే ఆ భయాలకు, అందోళనకు కారనం. ఇది అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన తరుణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్స్‌పర్ట్స్‌ చెప్పేదాని ప్రకారం అక్టోబర్-డిసెంబర్‌ మధ్యలో మూడో ముప్పు ఉంటుంది. అయితే ఈ రకం కరోనా వైరస్‌ తొలి రెండింటి కన్నా తక్కువ ప్రమాదకరమని అంటున్నారు. ఇది కాస్త ఊరట కలిగించే విషయం. థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మిజోరాం, ఝార్ఖండ్, గోవా, హర్యానా, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలను ఐసీఎమ్‌ఆర్‌ హెచ్చరించింది. మరో రెండు నెలల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు ..ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది.

కొన్ని రాష్ట్రాలు మినహాయిస్తే దేశంలోని చాలా ప్రాంతాల్లో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఇక ఈ నెల నుంచి కేసుల్లో క్రమంగా పెరుగుదల కనిపించవచ్చు. జనవరి-ఏప్రిల్‌ మధ్య అది తీవ్రస్థాయికి చేరొచ్చని కొన్ని అధ్యయనాలు అంటుండగా. అక్టోబర్‌-డిసెంబర్‌ మధ్య ఉంటుందని మరికొందరు శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

మూడో ముప్పు వేళ ప్రజలు ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ప్రయాణాలు తగ్గించుకుంటే మంచిదని సలహాయిస్తున్నారు. పర్యాటకుల సంఖ్య అకస్మాత్తుగా పెరగడం, సామాజిక-రాజకీయ-మతపరమైన కార్యక్రమాలలో ఎక్కువ మంది ఒక చోట చేరటం థర్డ్‌ వేవ్‌కు దారితీయొచ్చు. ఇటీవల పర్యాటకుల తాకిడి పెరిగిన తర్వాత హిమాచల్‌ ప్రదేశ్‌లోని మనాలి, పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌ ప్రాంతాల్లో కొవిడ్‌ కేసులు పెరగటాన్ని గమనించాలి.

‘జర్నల్‌ ఆఫ్‌ ట్రావెల్‌ మెడిసిన్‌’ అనే అధ్యయన పత్రంలో శాస్త్రవేత్తలు థర్డ్‌ వేవ్‌కు సంబంధించి పలు సూచనలు చేశారు శాస్త్రవేత్తలు. రాష్ట్రా స్థాయిల్లో ఆంక్షల కొనసాగింపే ముప్పును తప్పించుకునే మార్గం అంటున్నారు. ఉదాసీనంగా వ్యవహరిస్తే థర్డ్‌ వేవ్‌ ప్రమాదం దానంతటదే పెరుగుతుందని హెచ్చరించారు. రాష్ట్రాలకు పర్యాటకుల తాకిడి లేకుండా చూడాలి.ముఖ్యంగా సెలవు రోజుల్లో పర్యాటకుల రద్దీ లేకుండా చూసుకోవాలి. లేదంటే కరోనా వ్యాప్తి పెరిగిపోతుంది. రెస్టారెంట్లు,హోటళ్లలో దగ్గర దగ్గరగా కూర్చొని గంటలు గంటలు ముచ్చట్లు పెట్టటం మానుకోవాలి.

మరోవైపు, దేశానికి థర్డ్ వేవ్‌ ప్రమాదం పొంచి ఉన్న వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా విజ్ఞప్తి చేవారు. ఇక ఇప్పటి నుంచి వచ్చే నెలలన్నీ పండగల సీజనే. అందువల్ల ఇది మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. కనీసం మరో రెండు నెలలు బాధ్యతెరిగి మసలుకుంటే కోవిడ్‌ తీవ్రత తగ్గుముఖం పడుతుంది. లేదంటే సెకండ్‌ అనుభవాలే పునరావృతమవుతాయి.

మరోవైపు, కరోనా విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా హెచ్చరికలు చేసింది. కరోనా కథ ముగిసిందని అనుకోవద్దంది. గత వారం 31 లక్షల మందికి కరోనా సోకగా, 54 వేల మంది చనిపోయారని తెలిపింది. ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. కొన్ని చోట్ల ఐసీయూలు, ఆసుపత్రులు నిండిపోతున్నాయి. ప్రజలు చనిపోతున్నారు. కానీ కొందరు మాత్రం కరోనా ముగిసిందని నటిస్తూ, తిరుగుతున్నారని ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేయటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

కరోనా కష్టకాలం మొదలై దాదాపు రెండేళ్లవుతోంది. ఈ రెండేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా 50 లక్షల మంది దానికి బలయ్యారు. కరోనా టీకా తీసుకోని వారే ఎక్కువగా మృత్యువాత పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటోంది. ఇదిలావుంటే, భారత్‌లో ఇప్పటి వరకు దాదాపు 50 శాతం మందికి కనీసం ఒక డోస్‌ అయినా పడింది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చురుకుగా సాగుతోంది.

మరోవైపు, దేశంలో రోజు వారి కరోనా కేసులు 20వేల దిగువకు చేరాయి. మంగళవారం 18 వేల 833 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఇది కాస్త ఊరటనిచ్చే ఆంశం. ఏదేమైనా రాబోయే రోజుల్లో బాధ్యతగా వ్యవహరించకపోతే మరో మారు మూల్యం చెల్లించుకోక తప్పదు!!

-Advertisement-కరోనా కథ ముగియ లేదు..!

Related Articles

Latest Articles