షార్‌లో కరోనా టెర్రర్.. 12మందికి పాజిటివ్

కరోనా తన ప్రతాపం చూపుతోంది. మళ్ళీ ఎవరినీ వదలడం లేదు. నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని షార్ లో కరోనా థర్డ్ వేవ్ దడ పుట్టిస్తోంది. ఒకే రోజు ఇద్దరు వైద్యులతో సహా 12 మంది ఉద్యోగులకు పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఒమిక్రాన్ అనుమానంతో వీరి నమూనాలను ల్యాబ్ కు పంపారు. శ్రీహరి కోటలోని షార్ లో కరోనా మూడో వేవ్ మొదలైంది. కొత్త సంవత్సర వేడుకల కోసం పలువురు ఉద్యోగులు, సొంతూళ్ళకు వెళ్లి వచ్చారు. ఇలా వచ్చిన వారు మళ్లీ ఉద్యోగ విధుల్లోకి రావాలంటే పరీక్షలను షార్ అధికారులు తప్పనిసరి చేశారు. ఉద్యోగులందరికీ పరీక్షలు నిర్వహించగా 12 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేశారు.

సూళ్లూరుపేటలోని ఉద్యోగుల కాలనీల్లో పరీక్షలను ముమ్మరం చేశారు. ముందస్తు అనుమతి తోనే ఇతర ప్రాంతాలకు వెళ్లాలని..వచ్చిన తర్వాత తప్పనిసరిగా హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ పరీక్షలు చేయించుకోవాలని అధికారులు ఆదేశించారు. తర్వాతే విధులకు హాజరు కావాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. బయో మెట్రిక్ స్థానంలో అటెండెన్స్ రిజిస్టర్లు వాడాలని వివిధ విభాగాల అధికారులను ఆదేశించారు షార్ ఉన్నతాధికారులు. కరోనా కేసులు పెరుగుతున్నందున ఈ నెల చివరి వారంలో జరగాల్సిన రీ శాట్ ప్రయోగం వాయిదా పడే అవకాశముందని భావిస్తున్నారు.

Related Articles

Latest Articles