కరోనా థర్డ్ వేవ్.. చిన్నారులపైనే ఎక్కువ ప్రభావం

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. అమెరికాలో అయితే పరిస్థితి దారుణంగా తయారైంది. ఆ దేశంలో రోజుకు దాదాపు 10 లక్షల కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈసారి బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నారని అమెరికా సీడీసీ వెల్లడించింది. ముఖ్యంగా బాధితుల్లో ఐదేళ్లు లోపు చిన్నారులు ఉన్నారని తెలిపింది. ఇటీవలి కాలంలో కరోనా బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్న ఐదేళ్ల లోపు చిన్నారుల సంఖ్య పెరుగుతోందంటూ అమెరికా సీడీసీ డేటాను విడుదల చేసింది. 14 రాష్ట్రాల్లోని 250 ఆసుపత్రుల్లోని పేషెంట్ల ఆధారంగా ఈ వివరాలను వెల్లడించింది.

Read Also: బీ అలర్ట్ : రెండు వారాల్లో గరిష్ఠ స్థాయికి ఒమిక్రాన్‌!

కరోనా కేసులు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు ఎక్కువ మంది పిల్లలు ఆసుపత్రి పాలవుతున్న సందర్భం ఇదేనని సీడీసీ చీఫ్ డాక్టర్ రోచెల్ వాలెన్ స్కీ వెల్లడించారు. ఆసుపత్రుల్లో చేరుతున్న చిన్నారుల్లో 50 శాతం మంది 12 నుంచి 18 ఏళ్ల మధ్యవారని తెలిపారు. 5 నుంచి 11 ఏళ్ల మధ్య వారు 16 శాతం మంది ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం వీరందరికీ పూర్తిగా వ్యాక్సినేషన్ జరిగిందని.. అయినా కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగించే విషయమని సీడీసీ చీఫ్ అభిప్రాయపడ్డారు. మరోవైపు అమెరికాలో ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసుల్లో 95 శాతం ఒమిక్రాన్ వేరియంట్‌వే ఉంటున్నాయని అధికారులు చెప్తున్నారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే భారత్‌లో కరోనా థర్డ్‌ వేవ్‌లో వైరస్ మహమ్మారి చిన్నారులపై కూడా అధికంగా ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.

Related Articles

Latest Articles