తెలంగాణ ఎక్సైజ్ శాఖలో ప్రమోషన్ల వివాదం !

అయినవాళ్లకు ఆకుల్లో కానివారికి కంచాల్లో అన్నట్టుంది తెలంగాణ ఎక్సైజ్ శాఖ తీరు. ఐదేళ్ల త‌ర్వాత డిపార్ట్‌మెంట్‌లో అంద‌రికీ ప్రమోషన్లు ఇచ్చి కేవలం ఏడుగురికే ర‌హ‌స్యంగా కీల‌క‌ పోస్టింగ్‌లు ఇవ్వడం ఆ శాఖలో క‌ల‌క‌లం రేపుతోంది. అదనపు బాధ్యతల పేరుతో కొందరు ఐదేసీ పోస్టులను పర్యవే క్షించడం.. 6 నెలలుగా ఎంతోమందిని పెండింగ్‌లో పెట్టడం వివాదం అవుతోంది. ఇంత‌కీ తెలంగాణ ఎక్సైజ్ శాఖ‌లో ఏం జ‌రుగుతోంది?

ఎక్సైజ్‌శాఖలో పదోన్నతులు వచ్చినా పాతచోటే పని!

ఈ ఏడాది జ‌న‌వ‌రిలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ‌లో ప్రమోషన్లు ఇచ్చారు. ఏటా పదోన్నతులు ఇవ్వాల్సి ఉండ‌గా ఐదేళ్ల త‌ర్వాత తొలిసారిగా మోక్షం దక్కింది. ఆల‌స్యంగానైనా ప్రమోషన్‌ వ‌చ్చింద‌న్న సంతోషం వారికి ఎంతో కాలం నిల‌వ‌లేదు. ఆరునెల‌లు గ‌డిచిపోయినా మరోచోట పోస్టింగ్ ఇవ్వలేదు. ప్రమోషన్‌ వ‌చ్చినా పాతచోటే విధుల్లో కొన‌సాగుతున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఎక్సైజ్‌ శాఖ‌కు స్పెష‌ల్ సెక్రటరీగా ఉండ‌టం కొస‌మెరుపు.

read also : తెలకపల్లి రవి : కేంద్రం కదలదు, రాష్ట్రాలు వదలవు!

పదోన్నతి పొందిన 65 మందిలో ఏడుగురికే కొత్తచోట పోస్టింగ్‌
మే 1న రహస్యంగా జీవో జారీ.. జూన్‌ 6న బయటకొచ్చిన జీవో

ఎక్సైజ్ శాఖ‌లో అన్నిస్థాయిల్లో ఉన్నవారికి ప‌దోన్నతి వ‌చ్చింది. అసిస్టెంట్ ఎక్సైజ్ సూప‌రింటెండెంట్‌గా ఉన్న 38మంది సూపరింటెండెంట్లు అయ్యారు. నలుగురు అసిస్టెంట్ క‌మిష‌నర్లకు డిప్యూటీ కమిషనర్లగా, 20 మంది సూపరింటెండెంట్లకు అసిస్టెంట్ క‌మిష‌న‌ర్లుగా ప్రమోషన్‌ ఇచ్చారు. అయితే మొత్తం 65 మంది అధికారుల్లో కేవ‌లం ఏడుగురికి మాత్రమే పదోన్నతులకు తగ్గట్టుగా కొత్త పోస్టింగ్‌లు ఇవ్వడమే ఇప్పుడు వివాదంగా మారింది. ఇదంతా చాలా ర‌హ‌స్యంగా చేశారట. దీనికి సంబంధించిన జీవో మే 1న విడుద‌లైతే జూన్ ఆరోతేదీన బ‌య‌టికి వ‌చ్చింది.

టీజీవోలో ఉన్న నలుగురికి కీలక బాధ్యతలు?
భారీగా చేతులు మారినట్టు ఆరోపణలు?

ఎక్సైజ్ శాఖ‌లో విచిత్రాల‌కు కొదువ‌లేదన్నది డిపార్ట్‌మెంట్‌లో వినిపించే మాట. గెజిటెడ్ ఆఫీస‌ర్స్ అసోసియేష‌న్‌లో ప‌నిచేస్తున్న న‌లుగురికి ప్రమోషన్‌ త‌ర్వాత కీల‌క‌మైన బాధ్యతలు అప్పగించారు. స‌త్యనారాయణ‌, ర‌వీంద‌ర్‌రావు, అరుణ్‌కుమార్, చంద్రయ్యలు ఆ సంఘంలో క్రియాశీల‌కంగా ఉన్నారు. వీళ్లకు మాత్రమే పోస్టింగ్‌లు ఇచ్చి మిగిలిన వారిని గాలికి వ‌దిలేయ‌డం వెన‌క ఏం జ‌రిగింద‌నేది ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. ఈ త‌తంగం వెన‌క భారీగా చేతులు మారిన‌ట్టు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తున్నాయి.

రంగారెడ్డి జిల్లా డీసీ డేవిడ్‌ రవికాంత్‌ ఐదుచోట్ల ఇంఛార్జ్‌!
ఏసీ, డీసీ పోస్టులకు ఇంఛార్జ్‌గా ఉన్న అంజన్‌రావు!
మెదక్‌ డీసీ శాస్త్రికి సైతం అదనపు బాధ్యతలు

ఒక అధికారికి మరో ఐదారుచోట్ల ఇంఛార్జ్‌గా బాధ్యతలు అప్పగించడం కూడా కలకలం రేగుతోంది. రంగారెడ్డిలో డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న డేవిడ్‌ రవికాంత్‌.. ఎక్కడో ఉన్న ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లోని అసిస్టెంట్‌, డిప్యూటీ కమిషనర్ల పదవులకు ఇంఛార్జ్‌గా ఉన్నారు. ఆయన చేతిలో ఐదుపోస్టులు ఉన్నాయి. రంగారెడ్డిజిల్లా ఎన్స్‌ఫోర్స్‌మెంట్‌లో ఉన్న అంజన్‌రావు సైతం నల్లగొండ, ఖమ్మం ఏసీ, డీసీ పోస్టులకు ఇంఛార్జ్‌గా ఉన్నారట. మెదక్‌ డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న శాస్త్రి.. కరీంనగర్‌లోని ఏసీ, డీసీ పోస్టులను అదనంగా పర్యవేక్షిస్తున్నారు.

ఏపీ నుంచి వచ్చిన ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లు రెండేళ్లుగా ఖాళీ!
వాణిజ్య పన్నుల శాఖలోనూ 6 నెలలుగా అధికారులు ఖాళీ!
ఎస్‌ఐలుగా రిక్రూటైన 2,717 మందికి 6 నెలలుగా పోస్టింగ్‌లు లేవు!
ఎస్‌ఐలుగా రిక్రూటైన 77 మందికి జీతాలు లేవు

కొందరికి భారీగా అదనపు బాధ్యతలు అప్పగించడం.. మరికొందరికి పనిలేకుండా ఖాళీగా పెట్టడమే అనుమానాలు రేకెత్తిస్తోందట. విభజన చట్టం ప్రకారం ఏపీకి వెళ్లిన ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లు తెలంగాణకు తిరిగొచ్చారు. రెండేళ్లుగా పోస్టింగ్‌ లేకుండా వాళ్లు జీతాలు తీసుకుంటున్నారు. కమర్షియల్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లోనూ పదోన్నతలు ఇచ్చి పోస్టింగ్‌లు ఇవ్వలేదు. గ్రూప్‌ టు ద్వారా ఎంపికైన వాణిజ్య పన్నుల అధికారులు ఆరు నెలలుగా ఖాళీగా ఉన్నారు. SIలుగా రిక్రూట్‌ అయిన 2 వేల 7 వందల 17 మందికి సైతం ఆరు నెలలుగా ఇదే పరిస్థితి. వీరిలో 77 మందికి జీతాలే రావడం లేదట. ప్రస్తుతం అధికారవర్గాల్లో ఈ అంశాలపై రకరకాలుగా చర్చ జరుగుతోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-