లక్ష్మీ పార్వతీ.. ఇలా మాట్లాడేది మీరేనా..??

ఆంధ్రా అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు.. దూకుడుగా మాట్లాడుతుంటారు. అది పార్టీ వ్యూహమైనా సరే.. వ్యక్తిగత ఆవేశమైనా సరే.. తమ పార్టీని ఎవరైనా విమర్శిస్తే వాళ్లు చూస్తూ ఊరుకోరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా.. ఆ పార్టీ నాయకులు అలాగే ప్రవర్తించారు కూడా. ఇందులో ముఖ్యంగా.. కొడాలినాని, అనిల్ కుమార్ యాదవ్, రోజా వంటి నేతలు.. ఈ దూకుడును ముందుకు తీసుకుపోయారు. ఈ లిస్ట్ లో.. తాజాగా.. అత్యంత నెమ్మదస్తురాలిగా మాట్లాడే… లక్ష్మీపార్వతి సైతం చేరిపోయారు.

ఎన్టీఆర్ సతీమణిగా రాజకీయాల్లోకి పరోక్షంగా ప్రవేశించి.. టీడీపీ చంద్రబాబు చేతుల్లోకి వెళ్లిన తదనంతరం.. చాలా కాలానికి ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు. అప్పటినుంచి.. చిన్న చిన్న విమర్శలు మినహా.. పెద్దగా దూకుడు ప్రదర్శించింది లేదు. మహా అయితే.. చంద్రబాబుపై విమర్శలు చేస్తూ తన పార్టీ అధిష్టానానికి దగ్గరగా మెలిగారు తప్ప.. జనాలు నివ్వెరపోయేంతగా విమర్శలు చేసిందైతే లేదు. అలాంటి లక్ష్మీపార్వతి.. ఇప్పుడు రూట్ మారుస్తున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వాయిస్ పెంచుతున్నారు. తెలుగు – సంస్కృత భాషలకు ఉమ్మడిగా అకాడమీని ఏర్పాటు చేయడంపై.. జగన్ ప్రభుత్వాన్ని తప్పుబడుతున్న ఆ ఇద్దరిపై.. లక్ష్మీపార్వతి విరుచుకుపడ్డారు. ఆమె విమర్శల తీరు చూసి.. బాగా మారిపోయారే.. అని చాలా మంది అభిప్రాయపడేలా దూకుడు చూపారు.

నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. చదువుకు సంబంధించిన విషయాలపై విమర్శలు చేశారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దంటూ.. పచ్చిగా తిట్టేశారు. సంస్కారం లేకుండా మాట్లాడవద్దంటూ ఆగ్రహించారు. అంతే కాదు.. తాట తీస్తామని అనూహ్య వ్యాఖ్యలు చేశారు. జగన్ కనుసైగ చేస్తే చాలు.. లోకేశ్ ను ఏం చేసేందుకైనా సిద్ధమని అనేశారు. ఇదంతా చూస్తూ ఉంటే.. మాట్లాడేది లక్ష్మీపార్వతా.. లేక మరెవరైనా నేతనా.. అని కొందరు అనుమానపడ్డారు కూడా. కానీ.. ఇంతటి మార్పును, ఇంతటి దూకుడును ఆమె ఎందుకు ప్రదర్శిస్తున్నారన్నదే.. కొందరికి అర్థం కాకుండా ఉంది. మంత్రి పదవి ఆశిస్తున్నారా.. లేదంటే ఎమ్మెల్సీగానో.. మరేదైనా ఉన్నత స్థానాన్నో ఆశిస్తున్నారా.. అన్న అనుమానాలు, అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి కారణం అన్నది ఏదైనా సరే.. లక్ష్మీపార్వతిలో స్పష్టమైన మార్పైతే కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల దూకుడును.. ఆమె ముందుకు తీసుకుపోతున్నారన్నది.. లోకేష్ పై చేసిన విమర్శలతో స్పష్టమవుతోంది.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-