“మా”లో మంటలు ఇప్పట్లో ఆరవా?

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్- “మా”… కొన్ని రోజులుగా తెలుగు న్యూస్‌ చానళ్ల నిండా దీని గురించే. ఈ అసోసియేషన్‌ స్థాపించి దాదాపు పాతికేళ్లవుతోంది. కానీ ఎన్నడూ ఇంతలా అది జనం నోళ్లలో నానలేదు. గతంలో ఎన్నికలు గప్‌ చుప్‌గా జరిగేవి. ప్రచారం కూడా అంతే సైలెంట్‌గా చేసుకునేవారు. సభ్యులు నచ్చిన వారికి ఓటేసి వెళ్లిపోయేవారు..మర్నాడు పేపర్లో వచ్చేదాకా ..ఎవరు గెలిచారో ఎవరు ఓడారో కూడా తెలిసేది కాదు. కానీ ఇటీవల మా ఎన్నికల తీరు మారింది. విమర్శలు..ప్రతి విమర్శలు హద్దులు దాటుతూ వస్తున్నాయి. ఇప్పుడు జరిగిన మా ఎన్నికలు ఆ హద్దులన్నిటిని చెరిపేసింది. ఓ సాధారణ రాజకీయ ఎన్నికలరు తలపించింది.

తాజా “మా” ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీడిన బహు భాషా నటుడు ప్రకాశ్‌ రాజ్‌ ఓడిపోయాడు. మంచు మోహన్‌ బాబు కుమారుడు విష్ణు చేతిలో ఆయన ఘోర పరాజయం పాలయ్యారు. ఆరువందల పైచిలుకు సభ్యలు ఓటేసిన ఈ ఎన్నికల్లో ప్రకాశ్‌ రాజ్‌పై వందకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచాడు విష్ణు. మరి ఇంత భారీ తేడాతో ప్రకాశ్‌ రాజ్‌ ఓడిపోవటానికి అనేక కారణాలు కనిపిస్తాయి. వాటిలో ప్రధానమైనది స్థానికత అంశం. దాంతో పాటు ఈ ఎన్నికల్లో తొలిసారి రాజకీయ పార్టీలకు అవకాశం ఏర్పడింది. దేశద్రోహి..తుకుడే తుకుడే అనే పదాలు వినిపించాయి.

ఈ సారి “మా” ఎన్నికల్లో సభ్యులను ప్రలోభ పెట్టారని, డబ్బులు పంచారనీ..మందు పార్టీలు ఇచ్చారని ఇలా రకరకాల వార్తలు వినిపించాయి. ఎదైతేనేమీ ఈ సారి మా ఎన్నికలు వివిధ కారణాలతో రెండు తెలుగ రాష్ట్రాల ప్రజల దృష్టిని మునుపెన్నడూ లేనంతగా ఆకర్షించాయి. అయితే అది ఎన్నికలతోనే అయిపోలేదు. ఎలక్షన్‌ ముగిసి.. విజేతలను కూడా ప్రకటించారు. అయినా “మా”లో రేగిన అలజడి ఇంకా అలాగే ఉంది. అంతేకాదు, ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చెప్పలేని పరిస్థితి.

ఇక ఈ ఎన్నికల్లో ప్రకాష్‌ రాజ్‌ ఒక నాన్‌ -లోకల్‌. పోటీలో దిగే వరకూ ఆయనతో పాటు ఎవరికీ దీని గురించిన ఆలోచనే లేదు. హటాత్తుగా తెరమీదకు వచ్చింది..ఫలితం ఆయన ఓటమి. ప్రకాశ్‌ ఓడారు అనటం కన్నా ఓడించారు అంటే బాగుంటుందేమో. ఆయన ఎంత గొప్ప నటుడైనా కావచ్చు…జాతీయ స్థాయి నటుడు అయితే కావచ్చు..ఎన్ని భాషల్లో అయినా నటించ వచ్చు..కానీ మా ఎన్నికల్లో మాత్రం ఆయనకు స్థానం లేదనే విషయాన్ని అసోసియేషన్‌ సభ్యులు క్లియర్‌గా చెప్పారు. విషయం ఇంత స్పష్టంగా చెప్పిన తరువాత ఆయన “మా” సభ్యునిగా కొనసాగితే ఆశ్చర్యం. “మా” నుంచి వెళ్లి పోతే ఆశ్చర్యం ఏముంది?
మంచు విష్ణు చేతిలో ఓడిపోయిన ప్రకాష్ రాజ్ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామా చేవారు. సోమవారం “మా”తో సంబంధాలు తెంచుకుంటున్నట్టు ప్రకటించారు. దానికి కారణాలేమిటో స్పష్టమైన వివరణ కూడా ఇచ్చారు. ఓటమి బాధతో రాజీనామా చేయలేదని ..ఇది తన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని చెప్పారు. స్థానికత అంశాన్ని తెరమీదకు తెచ్చి ..తనను స్థానికేతరుడిని చేసి ఓడించినందుకు ఆయనను తీవ్రంగా కలచివేసింది. తెలుగు వాడు కాకపోవడం నా తల్లిదండ్రుల తప్పుగా పరిగణించాలా అని వాపోయాడు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటనను కూడా ప్రకాష్‌ రాజ్ ప్రస్తావించారు. తుకుడే తుకుడే గ్యాంగును ఓడించిన సినీ కళాకారులను బండి సంజయ్‌ అభినందించిన విషయం తెలిసిందే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తరువాత ప్రకాష్‌ రాజ్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అయినా రాజకీయాలకు దూరం కాలేదన్న సంగతిని ఆయన గుర్తు చేశారు. కానీ మా కు సంబంధించినంతవరకు తన అవసరం లేదని స్పష్టంగా చెప్పేసిన తరువాత ఎంత మాత్రం అసోసియేషన్ లో ఉండలేను అని చెప్పారు. అలాంటి భావజాలం ఉన్న అసోసియేషన్‌లో పని చేయను అని తేల్చి చెప్పారు. మాలో భాగం కాకపోయినా పాత్రలు వస్తే తెలుగు సినిమాల్లో నటించటానికి నిరాకరించనని అన్నారు. “మా”కు సంబంధించినంత వరకు ఇంతటితో ప్రకాశ్‌ రాజ్‌ పాత్ర ముగిసినట్టయింది.

మరోవైపు, ప్రకాష్‌ రాజ్ ను ఓడించిన తీరును నాగబాబు తీవ్రంగా తీసుకున్నారు. అందుకే ప్రకాష్‌ రాజ్‌ కన్నా ముందే “మా” సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రాంతీయ వాదం, సంకుచిత మనస్తత్వం కలిగిన “మా”లో ఇక కొనసాగలేకే ఈ రాజీనామా అన్నారు. అయితే “మా”లో రాజీనామాలు ఈ ఇద్దిరితోనే ఆగుతాయా? అంటే ఆగవంటున్నారు టాలీవుడ్‌ పరిశీలకులు. త్వరలో మరికొందరు “మా”ను వీడిపోయే అవకాశం ఉంది. తరువాత వికెట్‌ శ్రీకాంత్ అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్‌ తో పాటు అసోసియేషన్ మెంబర్‌షిప్ కూ రాజీనామా చేస్తారని టాక్‌. కొందరైతే ఏకంగా “మా”లో చీలిక అనివార్యం అనే వరకు వెళ్లారు.

ప్రస్తుతం పరిణామాలు చూస్తుంటే “మా” నుంచి మెగా వర్గం మొత్తం తప్పుకుంటుందా అనిపిస్తుంది. అదే జరిగితే దేశ సినీ పరిశ్రమలో టాలీవుడ్ ప్రతిష్ట తీవ్రంగా దెబ్బతింటుంది. మాయని మచ్చగా మిగిలిపోతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు వేర్వేరు అసోసియేషన్ డిమాండు ముందుకొస్తుంది. వాటిపై తప్పకుండా రాజకీయ ప్రభావం పడుతుంది. ఈ పరిస్థితుల్లో మంచు విష్ణు రెండేళ్ల పాటు కొనసాగటం కత్తిమీద సామే. అలాగే హామీలను సమర్ధవంతంగా నెరవేర్చటం ఆయనకు అతి పెద్ద సవాలు!!
-Dr.Ramesh Babu Bhonagiri

-Advertisement-"మా"లో  మంటలు ఇప్పట్లో ఆరవా?

Related Articles

Latest Articles