నిన్న విజయ్ సేతుపతి, నేడు సూర్య టార్గెట్… ఎందుకు ?

సినిమాపై కొందరు బెదిరింపు రాజకీయాలు చేయాలనీ చూస్తున్నారా ? అంటే… కోలీవుడ్ లో తాజా పరిస్థితులు చూస్తుంటే అవుననే అన్పిస్తోంది. చిన్న చిన్న కారణాలతో సినిమాలను బ్యాన్ చేయాలని డిమాండ్ చేయడం, నటులను కొడితే రివార్డులు అంటూ బహిరంగ ప్రకటనలు చేయడం, దాడులు చేస్తామంటూ బెదిరించడం ఆందోళనకరంగా మారింది. సినిమాను సినిమాలాగే చూడకుండా ఇందులో కూడా రాజకీయాలు చేస్తున్న కొందరు వ్యక్తులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడడం, ప్రభుత్వాలు ఈ తతంగాన్ని అంతా కళ్లప్పగించి చూస్తూ ఉండిపోవడం దారుణం.

నిన్న విజయ్ సేతుపతి, నేడు సూర్య
నిన్న విజయ్ సేతుపతిని, నేడు సూర్యను టార్గెట్ చేశారు. ఇటీవల విజయ్ సేతుపతికి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో ఓ వ్యక్తి విమానాశ్రయంలో వెళ్తున్న విజయ్ సేతుపతి మేనేజర్ ను తన్నాడు. అయితే ఆ వ్యక్తి విజయ్ సేతుపతినే టార్గెట్ చేశాడని వార్తలు రాగా, సేతుపతి స్పందిస్తూ చిన్న వివాదమని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ వెంటనే నటుడు విజయ్ సేతుపతిని తన్నిన వారికి, ఎన్నిసార్లు తంతే అన్ని వెయ్యి రూపాయలు ఇస్తానని హిందూ పీపుల్స్ పార్టీ నాయకుడు అర్జున్ సంపత్ ప్రకటించడం సంచలనంగా మారింది. విజయ్ సేతుపతి స్వాతంత్ర్య సమరయోధుడు దైవతిరు పసుంపోన్ ముత్తురామలింగ తేవర్ అయ్యను, దేశాన్ని అవమానించాడని ఆరోపించిన అర్జున్ సంపత్ ఓ ప్రముఖ నటుడిని తన్నమని ఆయన బహిరంగంగా ప్రేరేపించడం గమనార్హం.

Read Also : సూర్యకు బెదిరింపులు… దాడి చేస్తే లక్ష రివార్డు

ఇప్పుడు స్టార్ హీరో సూర్య వంతు వచ్చింది. కుల వర్గాలను రెచ్చగొట్టి, అల్లర్లను సృష్టిస్తున్న ‘జై భీమ్’ నిర్మాత, దర్శకుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పిఎంకె మైలాడుతురై జిల్లా కార్యదర్శి పన్నీర్‌ సెల్వం నేతృత్వంలోని బృందం అక్కడి పోలీసు సూపరింటెండెంట్‌కు వినతిపత్రం సమర్పించింది. కుల అల్లర్లను రెచ్చగొట్టి వన్నీ వర్గాలను అవమానించిన నటుడు సూర్య మైలాడుతురై జిల్లాకు వస్తే అతనిపై దాడి చేయాలని, దాడికి పాల్పడిన యువకులకు పార్టీ తరపున లక్ష రూపాయల బహుమతి ఇస్తామని పన్నీర్‌ సెల్వం బహిరంగంగానే చెప్పడం గమనార్హం.

ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ?
తాజా పరిణామాలన్నీ చూస్తున్న ప్రజలు ఇలా ప్రముఖ తమిళ నటులను టార్గెట్ చేయడం వెనుక కారణం ఏమై ఉంటుందా? అని ఆలోచిస్తున్నారు. సినిమాలో ఒక చిన్న సన్నివేశంలో తమకు సంబంధించింది ఏదో కన్పించింది అని, తమ వర్గాన్ని కించపరిచారని, సినిమాని బ్యాన్ చెయ్యాలని డిమాండ్ చేయడం, ఆ సినిమాకు సంబంధించిన నటులను కొట్టాలని ప్రేరేపించడం ఎంత వరకు సబబు ? హీరోలపై దాడి చేయమని చెప్పి యువతను ఎలాంటి దారిలో నడిపిద్దాం అనుకుంటున్నారు ? అని ఆయా హీరోల అభిమానులు ప్రశ్నిస్తున్నారు. దీని వెనుక రాజకీయ కారణాలేమైనా ఉన్నాయా ? అనే చర్చ కూడా నడుస్తోంది. ఏదేమైనా సినిమాల విషయంలో రాజకీయాలు వేలు పెట్టడం కరెక్ట్ కాదు. ఇలా ప్రముఖ నటులను కొట్టమంటూ ప్రోత్సహించడం నేరమనే చెప్పాలి.

Related Articles

Latest Articles