ఆర్జే కాజల్ ట్రాక్ తప్పుతోందా?

బిగ్ బాస్ సీజన్ 5 సెకండ్ వీక్ నామినేషన్స్ లో ఆర్జే కాజల్ పేరు ఉండటం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. మొదటి వారం అంటే ఓకే… కానీ రెండో వారం కూడా ఆమెను బిగ్ బాస్ సభ్యులు నామినేట్ చేయడానికి పెద్ద కారణమే ఉండి ఉంటుందనే భావన వారిలో కలిగింది. బేసికల్ గా కాజల్ రేడియో జాకీ… అంటే టాకిటివ్ పర్శన్! తన వృత్తిలో భాగంగా నోటిలో నాలుకలేని వారితో సైతం మాట్లాడించే గుణం కాజల్ కు అలవడింది. అలానే గత కొంతకాలంగా సినిమా రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కు యాంకరింగ్ కూడా చేస్తోంది. ఇక తన కూతురుతో కలిసి, కరోనా సమయంలో కాజల్ సోషల్ మీడియాలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ వీడియోలు ఇప్పటికీ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అలాంటి కాజల్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత మౌనంగా ఉండమంటే ఉంటుందా! తన అలవాట్లను ఠక్కున మార్చుకుంటుందా!? మార్చుకోలేదు!! అదే జరిగింది.

ఆర్జే కాజల్ లో స్వతహాగా ఉన్న యాక్టివ్ వెస్… తాను ఉన్నది బిగ్ బాస్ హౌస్ లో అనే ఆలోచన వచ్చే సరికీ అది ఓవర్ యాక్టివ్ నెస్ కు దారితీసింది. దాంతో కాజల్ తనకు తెలియకుండా ట్రాక్ తప్పుతూ వచ్చింది. అవసరం ఉన్న చోట, లేని చోట కూడా తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేయడం మొదలెట్టింది. డైరెక్ట్ గా ఆమెతో ఆ విషయం చెప్పడానికి మొహమాట పడిన వాళ్ళు బెస్ట్ – వరెస్ట్ అనే ఛాయిస్ వచ్చినప్పుడు, నామినేషన్ చేయాల్సి వచ్చినప్పుడు కాజల్ ను టార్గెట్ చేయడం మొదలెట్టారు. తన పట్ల తోటి సభ్యులలో ఇంత వ్యతిరేకత ఉంటుందని కాజల్ ఊహించని మాట వాస్తవం. ఆ బాధను తట్టుకోలేక కన్నీళ్ళు పెట్టుకుని కొన్నిసార్లు… వాటిని ఆపుకునే ప్రయత్నం చేస్తూ కొన్ని సార్లు… తన కుమార్తె ప్రసక్తిని కాజల్ తీసుకొచ్చింది. తానిలా ఏడవడం చూసి తన కూతురు తట్టుకోలేదని, అందుకనే ఏడుపును దిగ మింగుకుంటున్నానని చెప్పింది. నిజానికి కాజల్ మాదిరిగానే పిల్లలను ఇంటి దగ్గర వదిలి వచ్చిన వాళ్ళు బిగ్ బాస్ హౌస్ లో చాలామందే ఉన్నారు. కానీ వాళ్లెవరు తాము ఎదుటి వ్యక్తికి టార్గెట్ గా మారినప్పుడు… ఇలాంటి మాటలు మాట్లాడలేదు.

మరో ప్రధానమైన అంశం ఏమంటే…. ఆర్జే కాజల్ బిగ్ బాస్ షో కు వచ్చింది తన కూతురిని ఇంప్రస్ చేయడానికి కాదు, వ్యూవర్స్ ను ఇంప్రస్ చేసి విజేతగా నిలవడానికి. అది మానేసి… ‘కూతురి కోసం’ అంటూ కాజల్ చెప్పడాన్ని సైతం బిగ్ బాస్ లోని సభ్యులు మనసులోకి తీసుకోలేదు. అలానే కాజల్ ట్రాక్ తప్పుతోందనడానికి మరో కారణం ఏమిటంటే… తాను ఏడిస్తే… కూతురు చూసి తట్టుకోలేదని చెబుతున్న కాజల్… ఇతర సభ్యుల ప్రేమ వ్యవహారాలను గుచ్చి గుచ్చి అడుగుతూ, ఆరా తీస్తే.. ఆమె కూతురు దానిని ఎలా స్వీకరిస్తుందో ఆలోచించలేదా!? అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది. కాబట్టి ఆర్జే కాజల్… ఇక మీదట అయినా కూతురు ప్రస్తావన బిగ్ బాస్ హౌస్ లో తీసుకు రాకుండా, తన గేమ్ తాను ఆడితే బెటర్ అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-