రాహుల్ వర్సెస్ సీనియర్లు.. తెరపైకి పంజాబ్ ఎపిసోడ్?

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. చిన్నస్థాయి నేతలనే ఆ పార్టీలో కంట్రోల్ చేయడం కష్టం. అలాంటిది సీనియర్లను కట్టడి చేయాలంటే అధిష్టానానికి తలప్రాణం తోకలోకి వస్తుంది. ఆపార్టీకి సుప్రీం సోనియాగాంధీనే. ఆమె నిర్ణయాలే పార్టీలో ఫైనల్. పార్టీలోని సీనియర్ల సలహాలను పరిగణలోకి తీసుకొని ఆమె ఏ నిర్ణయమైన ఆచితూచి అమలు చేస్తుంటారు. అయితే అనారోగ్య కారణాల రీత్య సోనియాగాంధీ తన బాధ్యతలను రాహుల్ గాంధీకి అప్పగించాలని చూస్తున్నారు. దీనిపై పార్టీలో గత కొంతకాలంగా చర్చ నడుస్తూనే ఉంది.

రాహుల్ గాంధీ గతంలో ఓసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓటమి పాలవడంతో ఆయన ఆ పదవి నుంచి తప్పుకున్నారు. అయితే ఆయన అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడానికి మరో కారణం కూడా ఉందని తెలుస్తోంది. పార్టీలో తన నిర్ణయాలను సీనియర్లు అమలు కాకుండా చూస్తుండటంతో కినుక వహించిన రాహుల్ నాడు అధ్యక్ష పదవికి రాజీనామా చేశారట. తనకంటూ ఓ సొంత టీం ఉంటేనే అధ్యక్ష పదవి చేపడుతానని రాహుల్ గాంధీ సోనియాకు చెప్పినట్లు తెలుస్తోంది.

కొద్దిరోజులుగా రాహుల్ గాంధీ మళ్లీ యాక్టివ్ రాజకీయాలు చేస్తున్నారు. ఈక్రమంలోనే తిరిగే ఆయన కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపడుతారనే టాక్ విన్పిస్తోంది. ప్రస్తుతం సోనియాగాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. అయితే నిర్ణయాలు మాత్రం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీనే తీసుకుంటున్నారని తెలుస్తోంది. సీనియర్ల సలహాలను పాటించకుండా రాహుల్ నిర్ణయాలను పార్టీలో అమలు చేయడంపై కాంగ్రెస్ లోని సీనియర్లు తప్పుబడుతున్నారు.

పంజాబ్ సర్కారు సంక్షోభంలో వెళ్లడానికి రాహుల్ గాంధీనే కారణమని సీనియర్లు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ కు శాశ్వత అధ్యక్షుడు లేకపోవడం కారణంగానే పంజాబ్ ఎపిసోడ్ అట్టర్ ఫ్లాప్ అయిందని చెబుతున్నారు. ఇక్కడ మరోసారి అధికారంలోకి రావాలనే ప్రయత్నంలో కాంగ్రెస్ వరుస తప్పిదాలు చేసిందని మండిపడుతున్నారు. పీసీసీగా సిద్ధూ నియామకం, సీఎం అమరీందర్ సింగ్ తొలగింపు విషయాలను సీనియర్లు కార్నర్ చేస్తున్నారు. ఎన్నికల ముందు ఎవరైనా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? అంటూ ప్రశ్నలవర్షం కురిపిస్తున్నారు.

పంజాబ్ లో నెలకొన్న సంక్షోభం పార్టీని అధికారానికి దూరం చేసే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్లు పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. పంజాబ్ సీఎంను అధిష్టానం మార్చడంతో ఛత్తీస్ గడ్ సర్కారులోనూ అసంతృప్తి బయలు దేరింది. ఇక్కడ నాయకత్వాన్ని మార్చాలంటూ ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి ఉండి నిర్ణయాలు తీసుకోకుండా పరోక్షంగా సొంత నిర్ణయాలు అమలు చేయడం వల్లే ఇలా జరిగిందని అంటున్నారు.

కొంతకాలంగా స్తబ్ధుగా ఉంటున్న సీనియర్లు మరోసారి పార్టీలో గళం విప్పేందుకు రెడీ అవుతున్నారు. వెంటనే అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ అధ్యక్ష పదవి చేపట్టకుంటే సీనియర్లలో ఒకరు ఆ పదవిని చేపడుతారని స్పష్టం చేస్తున్నారు. సమష్టిగా ముందుకెళితే వచ్చే ఎన్నికల్లో పార్టీ బతికి బట్టకడుతుందని సూచిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యం చెందితే అదంతా రాహుల్ పైనే పడనుంది. అదే జరిగితే సీనియర్లు మరోసారి అధిష్టానానికి వ్యతిరేకంగా గళం విప్పే అవకాశం కన్పిస్తుంది. మొత్తానికి కాంగ్రెస్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది.

-Advertisement-రాహుల్ వర్సెస్ సీనియర్లు.. తెరపైకి పంజాబ్ ఎపిసోడ్?

Related Articles

Latest Articles