హుజురాబాద్‌లో కాంగ్రెస్‌ వ్యూహం ఏంటి?

హుజురాబాద్ అభ్యర్ధి ఎంపికపై కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా వ్యవహారం నడిపిస్తోందా? సీరియస్‌ ఫైట్‌ ఇస్తుందా.. ఇంకెవరికైనా సాయపడాలని చూస్తోందా? మాజీ మంత్రి కొండా సురేఖ ఎందుకు బరి నుంచి తప్పుకొన్నారు?

పార్టీ ముందు డిమాండ్ల చిట్టా పెట్టిన కొండా సురేఖ?
చివరకు పోటీకి విముఖత వ్యక్తం చేసిన సురేఖ..!

హజురాబాద్‌లో నామినేషన్ల ఘట్టం మొదలైనా.. కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరో తెలియదు. అభ్యర్ధి ఎంపిక కసరత్తును కొలిక్కి తెచ్చే పనిలో పడింది పార్టీ. మొదటి నుంచీ మాజీ మంత్రి కొండా సురేఖను బరిలో దించాలని పీసీసీ భావించింది. అయితే ఆమె పార్టీ ముందు డిమాండ్ల చిట్టా పెట్టారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఆర్ధిక వెసులుబాటు కల్పించడంతోపాటు వచ్చే ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు.. పరకాల సీటును కూడా తమకు ఇవ్వాలని డిమాండ్‌ పెట్టినట్టు సమాచారం. దీనికితోడు భూపాపల్లిలో గండ్ర సత్యనారాయణ కాంగ్రెస్‌లో చేరడంపై సురేఖ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. వీటికి పీసీసీ అంగీకరించే పరిస్థితి లేదట. కాకపోతే హుజురాబాద్‌తోపాటు వరంగల్‌ ఈస్ట్‌ సీట్లపై హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ చేసిన సూచనకు కొండా దంపతులు అంగీకారం చెప్పలేదు.. పైగా పోటీ చేయడానికి విముఖత వ్యక్తం చేశారు.

బరిలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌?

షెడ్యూల్‌ విడుదలయ్యాక కొండా సురేఖ హ్యాండివ్వడంతో పీసీసీ వ్యూహం మార్చేసిందట. కొత్త ఎత్తుగడకు పదును పెట్టినట్టు సమాచారం. టీఆర్‌ఎస్‌ ఉద్యమ నాయకుడు, ఉస్మానియా వర్సిటీ నుంచి వచ్చిన గెల్లు శ్రీనివాసయాదవ్‌ను అధికారపార్టీ బరిలో దించింది. దీనికి కౌంటర్‌గా అక్టోబర్‌ 2 నుంచి నిరుద్యోగ సైరన్‌ పేరుతో ఆందోళన మొదలుపెడుతోంది కాంగ్రెస్‌. హుజురాబాద్‌ ఉపఎన్నికలో ఇదే అంశాన్ని చర్చకు పెట్టాలని భావిస్తోంది పార్టీ. అక్కడితో ఆగకుండా NSUI రాష్ట్ర అధ్యక్షుడు బలుమూరి వెంకట్‌ను బరిలో దించుతున్నట్టు సమాచారం.

నిరుద్యోగ అంశాన్ని జోడించి గట్టి వాయిస్‌..!

వెంకట్‌.. పెద్దపల్లి జిల్లా వాసి. గతంలోనే పెద్దపల్లి నుంచి పోటీ చేయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు హుజురాబాద్‌లో పోటీ చేయించడం వల్ల యువతను ఆకర్షించొచ్చని కాంగ్రెస్‌ ఆలోచన. పైగా నిరుద్యోగ అంశం చర్చకు వచ్చి పార్టీకి కలిసి వస్తుందని అనుకుంటున్నారట. వాస్తవానికి హుజురాబాద్‌లో ఉపఎన్నికలో గెలుస్తామన్న ఆలోచన కాంగ్రెస్‌ నాయకుల్లో లేదు. కేడర్‌ను కాపాడుకోవాలనే లక్ష్యంతో బరిలో నిలుస్తున్నట్టు చెబుతున్నారు. దీనికి నిరుద్యోగ అంశాన్ని జోడిస్తే పార్టీ వాయిస్‌ గట్టిగా వినిపిస్తుందని గాంధీభవన్‌ వర్గాలు లెక్కలేసుకుంటున్నాయి.

ఇంకెవరికైనా ఉపయోగపడుతోందా..?

ఒక డమ్మీ అభ్యర్థిని బరిలో దింపి ఇంకెవరికైనా కాంగ్రెస్‌ ఉపయోగపడుతోందా అనే అనుమానాలు రాజకీయవర్గాల్లో ఉందట. ఈ ఆరోపణలను కాంగ్రెస్ వర్గాలు కొట్టి పారేస్తున్నా.. చర్చ మాత్రం ఆగడం లేదు. మరి.. హుజురాబాద్‌లో కాంగ్రెస్ వ్యూహం ఏంటో.. ఎంత వరకు ఆ పార్టీ ఆలోచన వర్కవుట్‌ అవుతుందో చూడాలి.

-Advertisement-హుజురాబాద్‌లో కాంగ్రెస్‌ వ్యూహం ఏంటి?

Related Articles

Latest Articles