సీనియర్‌ నేత వీహెచ్‌ రాయబారం ఎంతవరకు వచ్చింది…?

తెలంగాణ కాంగ్రెస్‌లో వారిని దారిలోకి తేవడం ఎవరి వల్లా కావడం లేదా? సీనియర్ నాయకుడు చేపట్టిన రాయబారం ఎంత వరకు వచ్చింది? రావాలని ఉన్నా.. పార్టీ అగ్రనాయకులు ఆయన్ని లైట్ తీసుకున్నారా..? తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.

కోమటిరెడ్డి సోదరులతో వీహెచ్‌ రాయబారం..!

కొన్ని రోజులుగా తెలంగాణ కాంగ్రెస్‌లో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఎంపీ వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి. కాంగ్రెస్ వాళ్లను వదులుకోలేదు.. అలాగని వాళ్ల గుమ్మం వరకు వెళ్లి పార్టీ నేతలు పిలిచే పరిస్థితి కనిపించడం లేదు. కాకపోతే.. కోమటిరెడ్డి సోదరులను బుజ్జగించి పార్టీ కార్యక్రమాలకు వచ్చేలా రాయబారం నెరిపే బాధ్యతను సీనియర్ కాంగ్రెస్‌ నేత వి హన్మంతరావుకు అప్పగించింది పీసీసీ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సమావేశం. ఆ తర్వాత కోమటిరెడ్డి సోదరులు, VH మధ్య చర్చలు జరిగాయి. అవి కొనసాగుతూనే ఉన్నాయి. ఈ చర్చలు ఎంత వరకు వచ్చాయో? కోమటిరెడ్డి బ్రదర్స్‌ పార్టీదారిలోకి వస్తున్నారో లేదో ఎవరికీ తెలియదు. గాంధీభవన్‌ వర్గాలకు.. పార్టీ నేతలకు అదో మిస్టరీ.

రైతు ప్రదర్శనల్లో కనిపించని కోమటిరెడ్డి సోదరులు.. జగ్గారెడ్డి..!

తెలంగాణ కాంగ్రెస్‌కి అసలు సమస్య.. నాయకులు ఏకతాటిపై లేకపోవడమే. ఇదే అంశం ఇటీవల ఢిల్లీలో పార్టీ నేత కేసీ వేణుగోపాల్ సమక్షంలో జరిగిన సమావేశంలో ఓపెన్ గానే చర్చకు వచ్చింది. హైకమాండ్‌ సీరియస్‌ కావడంతో.. ఆ ఎఫెక్ట్‌ పనిచేసిందో ఏమో.. ఇటీవల జరిగిన రైతు యాత్రలో నాయకులు సెట్‌రైట్‌ అయినట్టు కనిపించారు. ఢిల్లీ భేటీలో ఉత్తమ్, రేవంత్, భట్టి… ఇలా ఎవరికి వారు తమ వ్యూహాలు అమలు పరిచినా.. రైతు ప్రదర్శనలో ముగ్గురూ కలిసే నడిచారు. సీనియర్ నేతల్లో కలిసి రానిది మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రమే.

తనకేం చెప్పడం లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారా?

సమయం ఉన్నప్పుడు వచ్చి వెళ్తానని గతంలోనే జానారెడ్డి చెప్పేశారు. సమస్య అంతా జగ్గారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్సే. తనను ఏ కార్యక్రమానికి పిలవడం లేదని.. పార్టీ ముఖ్య నాయకులు కనీసం సంప్రదించడం లేదని VHకు కోమటిరెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌ కలిసి మాట్లాడే ప్రయత్నం చేయలేదని కూడా చెప్పారట. అయితే ఇంఛార్జ్‌ ఠాగూర్‌ వెళ్లాక కూడా కోమటిరెడ్డి పార్టీ కార్యక్రమాలకు రాకపోతే .. మిగతావాళ్లూ అదే పంథాను అనుసరిస్తారని ఇంఛార్జ్‌కు సన్నిహితులుగా ఉండేవారి వాదన. ఒకవేళ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌ రోల్‌ పోషించాలనే అనుకుంటే.. వెళ్లడానికి ఇంఛార్జ్‌ ఠాగూర్ సిద్ధమన్నది వారు చెబుతున్నారు. ఈ ఎపిసోడ్‌లో సమన్వయం లోపమో లేక.. మనసులో ఒకటి పెట్టుకుని.. బయటకు ఇంకొకటి చెబుతున్నారో కానీ.. సమస్య అలాగే ఉండిపోయింది.

ఢిల్లీ భేటీకి పిలవకపోవడంపై జగ్గారెడ్డి కినుక..!

ఇక జగ్గారెడ్డి వ్యవహారం కూడా అంతే. హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత.. పీసీసీ లక్ష్యంగా ఆయన కొన్ని కామెంట్స్‌ చేశారు. ఆ తర్వాత PAC సమావేశంలో తన వైఖరి స్పష్టం చేశారు. అయితే ఢిల్లీలో పార్టీ నిర్వహించిన సమావేశానికి తనను పిలవలేదని రాహుల్, సోనియాగాంధీలకు లేఖ రాశారు జగ్గారెడ్డి. పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయబోనని చెప్పిన ఆయన కాంగ్రెస్‌ నిర్వహించిన రైతు సదస్సులకు హాజరు కాలేదు. ఢిల్లీ సమీక్షకు పిలవకపోవడంతో.. పార్టీ కార్యక్రమాలకు ఎందుకు వెళ్లాలని అనుకున్నారో.. సమాచార లోపమో కానీ జగ్గారెడ్డి తీరు ఎవరికీ అంతుచిక్కడం లేదు. అటు కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఇటు జగ్గారెడ్డిలను ట్రాక్‌లోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి.

Related Articles

Latest Articles