కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అలకబూనారా?

ఆయనకు ఆశ పెట్టారు. ఆ ఆశను మొగ్గలోనే తుంచేశారు. నిద్రలేపి.. సినిమా చూపించారు. వాస్తవానికి… ‘నాకు ఇది కావాలి..!’ అని ఆయన అడిగింది లేదు. ఇప్పుడు సీన్‌ రివర్స్‌ కావడంతో తీవ్ర ఆవేదనలో ఉన్నారట ఆ సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు. ఇంతకీ ఎవరాయన? ఏంటా ఆశ?

ఇంకా గాంధీభవన్‌ మెట్లెక్కని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి!

తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌గా రేవంత్‌రెడ్డిని ప్రకటించిన వెంటనే మాజీ ఎమ్మెల్యే KLR, తర్వాత ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు. కీలక పదవుల్లో ఉన్న నాయకులు మాత్రం సైలెంట్‌గా ఉన్నారు. హైకమాండ్‌ రాయబారంతో.. ఇప్పుడు అంతా సర్దుకున్నట్టు కనిపిస్తుంది. సీనియర్‌ నాయకుడు.. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాత్రం ఇంకా మౌనం వీడలేదు. ఇప్పటి వరకు గాంధీ భవన్ మెట్లెక్కలేదు. రేవంత్ ప్రమాణ స్వీకారానికి కూడా రాలేదు. రాజకీయ వివాదాలకు దూరంగా ఉండే జీవన్‌రెడ్డి ఇలా ఎందుకు మారిపోయారు? ఆయన్ని ఇబ్బంది పెట్టిన అంశం ఏంటి? రేవంత్‌ లేదా ఇంకెవరిపైనైనా పెద్దాయన అలిగారా? కొత్త పీసీసీ చీఫ్‌ ప్రమాణ స్వీకారానికి అభినందన లేఖతో సరిపెట్టిన జీవన్‌రెడ్డి మనసు నొచ్చుకుందనే ప్రచారం కాంగ్రెస్‌ వర్గాల్లో జోరుగా ఉంది.

పీసీసీ చీఫ్‌ను చేస్తానంటే వద్దన్నారట!
పార్టీ పెద్దలు ఒప్పించడంతో ఓకే చెప్పారట

మాజీ మంత్రి.. సీనియర్‌ నాయకుడైనా.. కాంగ్రెస్‌లో తన పనేదో చేసుకుపోతారు జీవన్‌రెడ్డి. సాగర్‌ ఉపఎన్నిక ముందు పీసీసీ నియామక ప్రక్రియ మొదలైనప్పుడు ఆయనే పీసీసీ చీఫ్‌ అని ప్రచారం జరిగింది. మేడమ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని ఢిల్లీ పెద్దలు కబురందించారట. ‘నాకు వద్దు బాబు’ అని జీవన్‌రెడ్డి అన్నా.. ‘మేడమ్‌ ఆదేశాలు పాటించండి’ అని కూడా చెప్పారట. కానీ ఇంతలో రాజకీయ చక్రం తిరగబడింది. సీనియర్ నాయకులు అప్పట్లో పీసీసీ నియామక ప్రక్రియ ఆపేయాలని చెప్పడంతో బ్రేక్ పడింది. పీసీసీ చీఫ్‌ అయిపోయినట్టే అని అనుకుంటే తాజా పరిణామాలతో ఆయన మనసు చివుక్కుమందట.

ఫోన్‌లోనే ఠాగూర్‌కు తలంటేశారట!

జీవన్‌రెడ్డి పేరు ఖరారవుతుందని అనుకున్న సమయంలో పీసీసీ ఎంపిక ప్రక్రియను మళ్లీ మొదలుపెట్టారు AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌. ఆ సమయంలో జీవన్‌రెడ్డికి కాల్‌ చేశారట ఠాగూర్‌. సాధారణంగా కూల్‌గా ఉండే మాజీ మంత్రి.. ఆ ఫోన్‌లో ఠాగూర్‌పై ఒంటికాలిపై లేచారట. అంతా మీ ఇష్టమేనా? అప్పట్లో నన్ను ఇబ్బంది పెట్టి మరీ ఒప్పించారు. ఎందుకు ఆ ప్రక్రియ ఆపేశారో తెలియదు. ఇప్పుడు మళ్లీ ఎందుకు మొదలు పెడుతున్నారో అర్థం కావడం లేదు. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. మళ్లీ నన్ను అడగటం ఎందుకు? అని ఓ రేంజ్‌లో ఫైర్‌ అయినట్టు పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఆ ప్రశ్నలకు ఠాగూర్‌ దగ్గర సమాధానం లేదని చెబుతున్నారు. రిప్లయ్‌ ఏమీ ఇవ్వకుండానే ఆయన ఫోన్‌ పెట్టేశారట.

జీవన్‌రెడ్డి చెప్పేదాంట్లో లాజిక్‌ ఉందా?

ఆ తర్వాత పార్టీ అంశాలేవైనా జీవన్‌రెడ్డికి చెప్పాలంటే ఇంఛార్జ్‌ కార్యదర్శి బోసురాజును రంగంలోకి దించుతున్నారట. కొత్త కమిటీపై అసంతృప్తితో ఉన్న సీనియర్లను కూల్‌ చేస్తున్నా.. ఈ మాజీ మంత్రి దగ్గరకు వచ్చే సరికి అవేమీ వర్కవుట్‌ కావడం లేదట. పైగా జీవన్‌రెడ్డి చెప్పేదాంట్లో లాజిక్‌ ఉందని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. పీసీసీ చీఫ్‌ కాకపోయినా.. ఇంకేదైనా కీలక అవకాశం ఇచ్చిఉంటే ఇప్పుడీ సమస్య వచ్చేది కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి జీవన్‌రెడ్డి ఎపిసోడ్‌ పార్టీలో ఆసక్తిగా మారింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-