టీఆర్ఎస్ కోవర్టు అంటూ చిల్లర బ్యాచ్ తప్పుడు ప్రచారం: జగ్గారెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. తాను టీఆర్ఎస్ ఏజెంట్‌గా పనిచేస్తున్నారని ఇటీవల కొన్ని సోషల్ మీడియా ఛానళ్లు ప్రచారం చేస్తుండటంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. సదరు ఛానళ్లు రేవంత్‌రెడ్డికి అభిమానులుగా పనిచేస్తున్నాయని… రేవంత్‌కు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వకముందు మూడేళ్ల కిందటి నుంచే రాజు వస్తున్నాడంటూ తెగ హడావిడి చేసినట్లు గుర్తుచేశారు. ఇటీవల సంగారెడ్డి నియోజకవర్గంలో జరిగిన అధికారిక కార్యక్రమంలో తాను ఎమ్మెల్యే హోదాలో పాల్గొన్నానని… కేటీఆర్ ఎదురుపడితే పలకరించానని జగ్గారెడ్డి తెలిపారు. పార్టీలు వేరైనా ఎదురుపడినప్పుడు మాట్లాడుకోవడం సంస్కారం అని స్పష్టం చేశారు. కేటీఆర్‌ను గతంలో కాంగ్రెస్ నేతలు ఎవరూ కలవలేదా అని ప్రశ్నించారు. తాను టీఆర్ఎస్ కోవర్టు అంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత పంచాయతీలు లేవని… కానీ పార్టీలోని చిల్లర బ్యాచ్ తనను మీడియా ముందుకు వచ్చేలా చేస్తోందని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెగిటివ్ వార్తలు రాసే వారికి ఆత్మసాక్షి లేదా అని నిలదీశారు. పీసీసీ చీఫ్ అనే వాడు పార్టీకి డ్రైవర్ లాంటి వాడని… తాము ప్యాసింజర్లు మాత్రమే అని అభిప్రాయపడ్డారు. డ్రైవర్ సరిగ్గా బస్సును నడపకపోతే యాక్సిడెంట్ అవుతుందని.. అప్పుడు డ్రైవర్‌తో పాటు ప్యాసింజర్లు కూడా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందన్నారు. గతంలో కేటీఆర్‌ను రేవంత్‌రెడ్డి కలిశారని… దాని గురించి సదరు యూట్యూబ్ ఛానళ్లు ఏం రాస్తాయని ప్రశ్నించారు. పార్టీని నాశనం చేస్తుంది తానా? రేవంత్ అభిమాన సంఘాలా అంటూ మండిపడ్డారు. తాను పార్టీ నుంచి బయటకు వెళ్లాలనుకుంటే ఆపేది ఎవరని నిలదీశారు. టీఆర్ఎస్ పార్టీకి తాను వెళ్లాలనుకుంటే డైరెక్టుగానే పోతానని… కోవర్టుగా పనిచేయాల్సిన అవసరం లేదన్నారు. రేవంత్‌రెడ్డి డైరెక్షన్‌లోనే చిన్నారెడ్డి పనిచేస్తున్నాడని జగ్గారెడ్డి ఆరోపించారు. అందుకే కోదండరెడ్డిని కాకుండా చిన్నారెడ్డిని కమిటీ ఛైర్మన్‌గా రేవంత్‌రెడ్డి నియమించాడని జగ్గారెడ్డి వివరించారు. తాను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని 100 శాతం కోరుకుంటున్నానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

Related Articles

Latest Articles