కాంగ్రెస్ నాయకత్వం.. దక్షిణానికి దండం పెట్టేస్తోంది..!

చుక్కాని లేని నావ… అన్న వాడకానికి కాంగ్రెస్ పార్టీ అచ్చమైన రూపంగా నిలుస్తోంది. ఆ పార్టీ జాతీయ నాయకత్వంలో కొరవడుతున్న రాజకీయ వ్యూహ చతురత.. రోజురోజుకూ కాంగ్రెస్ ను తీసికట్టుగా మార్చేస్తోంది. ఉత్తర భారతం సంగతి పక్కనబెడితే.. దక్షిణ భారతంలో అయితే.. మరీ దారుణంగా ఉంది. కనుమరుగు కానున్న జీవుల జాబితా మాదిరిగా.. అంతరించిపోనున్న భాషల మాదిరిగా.. ఆ పార్టీ వ్యవహారశైలి నడుస్తోంది. దక్షిణ భారత దేశంలో కర్ణాటకలో ఉన్న బలాన్ని.. బీజేపీ రాజకీయ చతురత ముందు పూర్తిగా కరగదీసుకుంది కాంగ్రెస్. అక్కడ.. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వంటి ఉద్ధండులు ఉన్నా.. ఏ మాత్రం ఫలితం లేకుండా పోతోంది. కనీసం బలం పుంజుకుంటుందా.. లేదా.. అన్నది కూడా ఆ పార్టీలో సందేహాస్పదంగా కనిపిస్తోంది. బీజేపీకి కేంద్రం నుంచి ఉన్న బలం, రాష్ట్రంలో పట్టు పెరగడం.. వాటిని సమర్థంగా తిప్పికొట్టే వ్యూహం లేకపోవడం.. ఈ పరిస్థితికి కారణమైంది.

తెలుగు రాష్ట్రాల సంగతి. తెలంగాణ ఇచ్చిన పేరున్నా కూడా.. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాస్త దూకుడు ప్రదర్శిస్తున్నా.. అడ్డు తగులుతున్న నేతలు.. సహాయ నిరాకరణ చేస్తున్న నేతలు ఎంతో మంది ఉన్నారు. అందుకే.. రేవంత్ సభలకు జనాలు వస్తున్నా.. అగ్ర నేతలు రాకపోతుండడం.. పార్టీలో పరిస్థితిని చెప్పకనే చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ లో అయితే.. ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగిన తెల్లారే.. కాంగ్రెస్ ను ప్రజలు వదిలేసుకున్నారని చెప్పొచ్చు. తర్వాత 2 సార్లు ఎన్నికలు జరిగినా.. ఒక్కరంటే ఒక్కరిని గెలిపించుకోలేని స్థితికి పార్టీ దిగజారింది. నాయకత్వ లోపాలు, శ్రేణుల్లో సన్నగిల్లిన స్థైర్యం, విభజన ముద్ర.. ఇవన్నీ పార్టీని జనానికి దూరం చేశాయి. జాతీయ నాయకత్వం సైతం పెద్దగా దృష్టి పెట్టకపోవడం.. ప్రజల్లో కాంగ్రెస్ పై నమ్మకాన్ని పెంచే ప్రయత్నం చేయకపోవడం.. ఇందుకు కారణమైంది.

తమిళనాడు.. కేరళ సంగతి.. కాంగ్రెస్ రాజకీయ ఉద్ధండులకు కేరాఫ్ ఈ రాష్ట్రాలు. స్వయానా అగ్రనేత రాహుల్ గాంధీ సైతం కేరళలోని వయనాడ్ నుంచి చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చిదంబరం వంటి వ్యూహకర్తలు తమిళనాడు నుంచి ఉన్నారు. అయినా.. గతంలోని స్ఫూర్తిని, రాజకీయ వ్యూహాలను ఆ పార్టీ రచించలేకపోతోంది. ఓవరాల్ గా.. దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూసినా.. కాంగ్రెస్ భవిష్యత్తుపై అనుమానపు మేఘాలే కమ్ముకుపోతున్నాయి. ఇదే.. పార్టీ శ్రేణుల్లో అంతర్మథనానికి దారి తీస్తూ.. మరో పార్టీవైపు చూసేలా చేస్తోంది. కాంగ్రెస్ కు మాత్రమే సొంతమైన రాజకీయ చతురతపై అభిమానం ఉన్న వాళ్లకు.. ఆవేదనను మిగులుస్తోంది.

Related Articles

Latest Articles

-Advertisement-