బీజేపీ ఫార్ములా: పంజాబ్ లో అప్లై చేస్తోన్న కాంగ్రెస్.. సీఎం అతడే?

బీజేపీ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోందా? అంటే అంత అవుననే సమాధానం విన్పిస్తోంది. నిన్నటి వరకు బీజేపీ అధిష్టానం వరుసబెట్టి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను మార్చేసింది. నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఏకంగా ఆరుగురు సీఎంలను మార్చివేసింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో జరుగబోయే ఎన్నికలను బీజేపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థమవుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం పంజాబ్ లో బీజేపీ తరహా ఫార్మూలానే ఫాలో అవుతోంది. అక్కడి సీఎంగా ఉన్న కెప్టెన్ అమరీందర్ సింగ్‌పై వేటు వేసింది. శనివారం నాడే ఆయన తన పదవికి రాజీనామా చేయడంతో ఆయన వారసుడి వేటలో అధిష్టానం పడింది.

కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునే ప్రక్రియ మరికొద్ది సేపట్లో జరుగనుంది. ఈమేరకు కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశం కానుంది. కేంద్ర పరిశీలకులుగా పార్టీ సీనియర్ నాయకులు.. మాజీ కేంద్రమంత్రులు హాజరు కానున్నారు. ఈ మధ్యాహ్నం కల్లా కొత్త ముఖ్యమంత్రి ఎవరో ఖరారు కానుందని సమాచారం. వచ్చే ఏడాదిలో పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పంజాబ్ ను తిరిగి కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతుండటంతో పొలిటికల్ హైడ్రామాకు తెరలేచినట్లు కన్పిస్తోంది.

పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా తొలుత నవజ్యోత్ సింగ్ సిద్ధు పేరును అధిష్ఠానం ఖరారు చేసింది. నాటి నుంచే కాంగ్రెస్ భారీ మార్పులు వస్తాయనే సంకేతాలను పంపించింది. దీనిలో భాగంగానే ఏకంగా ముఖ్యమంత్రినే కాంగ్రెస్ మార్చివేసింది. తొలుత కెప్టెన్ అమరీందర్ సింగ్ సారథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ వెళుతుందనే వార్తలు వచ్చినా వాటిన్నింటిని పటాపంచాలు చేస్తూ ఆయన రాజీనామా చేసి వైదొలిగారు. దీంతో కొత్త సీఎం సారథ్యంలో కాంగ్రెస్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలను వెళ్లేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. సీఎం రేసులో చాలామంది పేర్లు తెరపైకి వస్తున్నాయి.

అనూహ్యంగా పంజాబ్ సీఎం రేసులో గాంధీ కుటుంబ రైట్ హ్యాండ్ అయిన అంబికా సోని పేరు తెరపైకి వచ్చింది. అంబికా సోని స్వస్థలం హోషియాపూర్. ఆమె తండ్రి ఐఏఎస్ అధికారిగా పని చేశారు. ఆమెను 1969లో ఇందిరాగాంధీ రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. నాటి నుంచి ఆమె గాంధీ కుటుంబానికి వీరవిధేయురాలిగా ఉంటున్నారు. ఏనాడూ ఆమె కాంగ్రెస్ పార్టీని ధిక్కరించిన దాఖలాలు లేవు. అంబికా సోని యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా పని చేశారు.

ప్రత్యక్ష ఎన్నికల్లో ఆమె పోటీ చేసిన గెలువలేకపోయారు. దీంతో ఆమె వరుసగా రాజ్యసభకు నామినేట్ అవుతూ వస్తున్నాయి. దేశ రాజకీయాల్లో అపారమైన అనుభవం ఉండటం, గాంధీ కుటుంబానికి విధేయురాలిగా ఉండటంతో ఆమెకు ముఖ్యమంత్రి పదవి ఖాయమనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు పీసీసీ చీఫ్ గా కొనసాగుతున్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ పేరు కూడా సీఎం రేసులో ప్రముఖంగా విన్పిస్తోంది. వీరితోపాటు ఒకరిద్దరు కేంద్ర మంత్రులుగా పని చేసిన వారి పేర్లను సైతం అధిష్టానం పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏదిఏమైనా నేటి మధ్యాహ్నం వరకు పంజాబ్ కొత్త సీఎంగా ఎవరనేది క్లారిటీ రానుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠత నెలకొంది.

-Advertisement-బీజేపీ ఫార్ములా: పంజాబ్ లో అప్లై చేస్తోన్న కాంగ్రెస్.. సీఎం అతడే?

Related Articles

Latest Articles