రాహుల్.. ఇంకా ఎన్నాళ్లు.. త్వరగా వచ్చేయండి..!

ఇతర పార్టీలన్నీ జనాల్లో దూసుకుపోతుంటే.. రాబోయే ఎన్నికలకు ఇప్పటినుంచే కసరత్తు చేస్తుంటే.. కాంగ్రెస్ నేతలు మాత్రం రోజు రోజుకూ డీలా పడిపోతున్నారు. సోనియాగాంధీకి వయోభారం.. ఆమె స్థాయిలో పార్టీని రాహుల్ నడిపించడానికి ముందుకు రాకపోతుండడం.. ఇతర సీనియర్లు సైతం పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఆసక్తి చూపని వైనం.. ఈ కారణాలతో పార్టీ శ్రేణుల్లో రోజురోజుకీ ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతోంది.

వాస్తవానికి కాంగ్రెస్ కు బలమైన ప్రజామద్దతు ఇప్పటికీ ఉంది. బీసీలు, మైనారిటీలు చాలా ప్రాంతాల్లో నేటికీ ఆ పార్టీని అభిమానిస్తారు. కానీ.. నాయకత్వ నిర్ణయాల తీరుతో.. ఆ ఓటు బ్యాంకు పూర్తిగా వేరే పార్టీలకు వెళ్లిపోతోంది. అయితే.. ప్రాంతీయ పార్టీలు.. కాదంటే బీజేపీ.. ఆ ఓట్లను పంచుకుంటున్నాయి. ఇంత స్పష్టమైన వాతావరణం ఉన్నా.. కాంగ్రెస్ నాయకత్వంలో మాత్రం చలనం రాకపోతుండడం.. శ్రేణులను అయోమయానికి గురి చేస్తోంది.

త్వరగా.. రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు తీసుకుంటే మంచిదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇతర పార్టీల నేతలు సైతం.. ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండడం గమనార్హం. తాజాగా.. కాంగ్రెస్ విద్యార్థి విభాగం.. ఎన్ఎస్ యూఐ సైతం.. కీలక తీర్మానం చేసింది. రాహుల్.. కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని అందుకోవాలని మనోగతాన్ని చాటింది. యూనియన్ జాతీయ కార్యవర్గ సమావేశం.. ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ఆమోదించింది.

పొలిటికల్ గ్లామర్ పరంగా.. రాహుల్ గాంధీ ఏ మాత్రం తక్కువ కాదు. మోడీ, ఇతర అగ్ర నేతలకు సైతం దీటుగా ప్రజాదరణ కలిగి ఉన్నారు. కానీ.. స్వయంగా తీసుకుంటున్న నిర్ణయాలే.. రాహుల్ కు, కాంగ్రెస్ కు మైనస్ గా మారుతున్నాయి. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాల్సిన దశలో.. నాయకత్వ పీఠానికి దూరంగా ఉంటుండడం అయోమయానికి అసలు కారణంగా నిలుస్తోంది.

అందుకే.. రాహుల్.. ఇంకెన్నాళ్లు.. త్వరగా వచ్చేయండి.. అని సాధారణ కార్యకర్త నుంచి.. ఇతర సీనియర్ల వరకూ.. అంతా స్వాగతిస్తున్నారు. మరికొందరు పార్టీ విధానాల్లో మార్పులు రావాలని కోరుతున్నారు. వీటిల్లో ఏది జరగాలన్నా.. అధ్యక్ష పీఠంపై సరైన నేత కూర్చోవాల్సిందే. అది రాహుల్ అయితేనే బాగుంటుందని మెజారిటీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇందులో.. స్పష్టత ఎప్పటికి వచ్చేనే.. కాంగ్రెస్ తీరు ఎప్పటికి మారేనో. మనమూ వేచి చూద్దాం.

Related Articles

Latest Articles

-Advertisement-