హుజురాబాద్‌ ఉపఎన్నికపై కాంగ్రెస్‌ ఫోకస్‌

హుజురాబాద్‌ ఉపఎన్నికపై కాంగ్రెస్‌ ఫోకస్‌ పెట్టింది. సీనియర్‌ నేతకు ఇంఛార్జ్‌గా బాధ్యతలు అప్పగించింది. దుబ్బాక ఉపఎన్నికలోనూ ఆయనే పార్టీ ఇంచార్జ్‌. దీంతో ఆ నేతకు ఇది పరీక్షా కాలమా.. ఇంకేదైనా వ్యూహం ఉందా అని చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరా నాయకుడు?

హుజురాబాద్‌లో కాంగ్రెస్‌కు చావో రేవా?

తెలంగాణ ఏర్పాటైన తర్వాత జరిగిన ఉపఎన్నికలేవీ కాంగ్రెస్‌ పార్టీకి కలిసి రాలేదు. సిట్టింగ్‌ స్థానాలనే కోల్పోయిన పరిస్థితి. అధికారపార్టీ ముందు పేలవమైన ప్రదర్శన చేస్తూ వచ్చింది. నాయకత్వం లోపమని కాంగ్రెస్‌లో చర్చ జరిగింది. ఇప్పుడు కొత్త చీఫ్‌తోపాటు పీసీసీకి న్యూ టీమ్‌ కూడా వచ్చేసింది. హుజురాబాద్‌ ఉపఎన్నిక కొత్త బృందానికి పరీక్ష పెట్టబోతోంది. గెలుపోటములు ఎలా ఉన్నా.. కనీసం రెండోప్లేస్‌లో అయినా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. పైగా రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఇది చావో రేవో లాంటి సమస్య.

హుజురాబాద్‌ కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌గా రాజనర్సింహ

హుజురాబాద్‌లో బీజేపీ బలంగా ఉందా లేదా అనే దానికంటే ఈటలకు స్ట్రాంగ్‌ హోల్డ్‌ ఉంది. వ్యక్తిగతంగా ఈటల పరపతి ముఖ్యమే అయినా.. దానిని రాజకీయంగా బీజేపీ క్లైమ్ చేసుకునే అవకాశం ఉంది. వీటికి చెక్ పెట్టడానికి కాంగ్రెస్‌లో కొంత దూకుడుగా ఉండే దామోదర రాజనర్సింహ బెటర్ అనుకుందో ఏమో.. హుజురాబాద్‌ ఉపఎన్నిక బాధ్యతలను ఆయనకు అప్పగించింది. ఇక్కడి ఉపపోరులో టీఆర్‌ఎస్‌, బీజేపీలను ఎదుర్కోవడం కాంగ్రెస్‌కు అంత ఈజీ కాదు. కాకపోతే దామోదర్‌ ఇంఛార్జ్‌గా ఉంటే.. అధికార దుర్వినియోగం కట్టడికి.. కార్యకర్తలకు అండగా ఉండేందుకు ఆయన నాయకత్వం ఉపయోగపడుతుందని లెక్కలు వేసిందట కాంగ్రెస్‌.

read also : టీటీడీ మాజీ ఛైర్మన్‌ మంత్రి పదవిపై దృష్టి పెట్టారా ?

దుబ్బాక ఉపఎన్నిక కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌గానూ పనిచేశారు
హుజురాబాద్‌లో ఏ మేరకు వర్కవుట్‌ చేస్తారు?

దుబ్బాక ఉపఎన్నికలోనూ దామోదర్‌ రాజనర్సింహే ఇంఛార్జ్‌. స్థానిక నాయకుడు కావడంతో ఆయనకు బాధ్యతలు ఇచ్చారు. మల్లన్నసాగర్ నిర్వాసితుల కోసం ఆయన ఆందోళన చేసినందున కలిసి వస్తుందని భావించారు. కానీ.. దుబ్బాకలో పార్టీ పేలవమైన పనితీరును ప్రదర్శించింది. అభ్యర్ధిగా చెరుకు శ్రీనివాస్‌రెడ్డిని బరిలో దించే వరకు దామోదర్‌ వ్యూహం కొంత ఫలించింది. ఆయన్ని బరిలో దించకపోతే.. ఆ కాస్త పరువు కూడా దక్కేది కాదనే చర్చ సాగింది. ఇప్పుడు హుజురాబాద్‌లో ఎలా? పార్టీ పరువు నిలబడుతుందా? ఈ సీనియర్‌ కాంగ్రెస్‌ నేత ఎంత వరకు వర్కవుట్‌ చేస్తారన్నది ఆసక్తి కలిగిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రులు శ్రీధర్ బాబు.. జీవన్‌రెడ్డిలు కూడా దామోదర్‌ టీమ్‌లో ఉంటారు.

కాంగ్రెస్‌ కేడర్‌ను కాపాడుకోవడం పెద్ద సవాల్‌!

కొత్త పీసీసీ చీఫ్‌తోపాటు దామోదర్‌ రాజనర్సింహకు కూడా హుజురాబాద్‌ ఉపఎన్నిక పరీక్షాకాలంగా చర్చ జరుగుతోంది. గడిచిన ఎన్నికల్లో హుజురాబాద్‌లో కాంగ్రెస్‌కు 60 వేల ఓట్లు వచ్చాయి. టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌కు ఓటు బ్యాంక్‌ తేడా 40 వేలు. జరగబోయే ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ నుంచి కొత్త అభ్యర్థి, బీజేపీ నుంచి ఈటల రాజేందర్‌ బరిలో ఉండబోతున్నారు. టీఆర్‌ఎస్‌ ఓటు బ్యాంక్‌ చీలుతుందా? ఈటలకు ఏ మాత్రం మద్దతు లభిస్తుంది అన్నది ప్రశ్నగా ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి బరిలో దిగిన కౌశిక్‌రెడ్డే మళ్లీ పోటీలో పోటీ ఉంటారని తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌ కేడర్‌పై టీఆర్‌ఎస్‌ కన్నేసింది. కొందరిని లాగేసింది కూడా. ఒకవైపు పార్టీ కేడర్‌ను కాపాడుకుంటూనే.. ఓటు బ్యాంక్‌ను నిలుపుకోవడం కాంగ్రెస్‌కు పెద్ద సవాల్‌.

రాజనర్సింహకు స్వాగతం పలికే సమస్యలపై చర్చ!

ఇవన్నీ చూసిన తర్వాత హుజురాబాద్‌లో దామోదర రాజనర్సింహకు ఇంఛార్జ్‌గా స్వాగతం పలికే సమస్యల గురించి పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీని మెరుగైన స్థానంలో నిలబెట్టడం.. కేడర్‌ను కాపాడుకోవడం కత్తిమీద సాముగా భావిస్తున్నారు. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-