ఆరు రోజుల్లో ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తి!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ సెక్రటేరియట్ నుండి గురువారం జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, సమీక్షించారు. వరి సేకరణ, సూపర్ స్ప్రెడర్ వర్గాలకు టీకాలు వేయడం, విత్తనాలు, ఎరువుల సరఫరా మరియు లభ్యత ఏర్పాట్లపై ఈ సమీక్ష నిర్వహించారు. త్వరలో రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించనున్నందున రాబోయే 6 రోజుల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. స్థానిక మార్కెట్ ల నుండి కార్మికులను సమీకరించుకోవాలని , గోనె సంచులు (గన్నీ బ్యాగ్స్) సేకరించాలని కలెక్టర్లను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నుండి సేకరించిన ధాన్యం రవాణాకు వాహనాలు తగినంతగా లభించేలా చూడాలని, మిల్లర్లు తూకాలలో విధిస్తున్న అనవసర కోతలను అరికట్టేందుకు తనిఖీలు చేయాలని వారికి సూచించారు. గోనె సంచుల సేకరణ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని పౌర సరఫరాల శాఖ కార్యదర్శిని ఆదేశించారు. విత్తనాలు మరియు ఎరువులు విక్రయాల సమయంలో తగినంత నిల్వలు అందుబాటులో ఉండాలని తెలిపారు. తదనుగుణంగా జిల్లా వ్యవసాయ అధికారులతో సవివరమైన సమీక్ష నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. సూపర్ స్ప్రెడర్ కేటగిరీల కోసం ప్రతిపాదించిన టీకా డ్రైవ్‌కు సంబంధించి, ప్రభుత్వం నిర్దేశించిన వర్గాలకు టీకాలు వేయాలని, లైన్ జాబితాను ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్లకు సూచించారు. అంతేకాకుండా, ఈ వర్గాలకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ మాత్రమే వేయడాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-