పెళ్లి కానుక రూపంలో కోటి రూపాయలు వసూలు…!

ఆ నియోజకవర్గంలో దోచుకున్నవాడికి దోచుకున్నంత.. దాచుకున్నంత..! ఆయనది ఆయనకు ఇచ్చేస్తే.. ఏం జరిగినా అంతా ఆయనే చూసుకుంటారట. ఇప్పటికే ఇసుక.. మట్టి.. సెటిల్మెంట్ల మాఫియాలను ఏర్పాటు చేసి ఎడాపెడా దోచేస్తున్నా ఆశ చావలేదో ఏమో.. ఇంట్లో జరిగిన పెళ్లికి కానుకల రూపంలో అక్షరాల కోటి రూపాయలు వసూలు చేశారట. అధికారపార్టీ నేతలే ఈ బాగోతాన్ని సోషల్‌ మీడియాలో వైరల్‌ చేయడంతో అంతా అవాక్కవుతున్న పరిస్థితి. ఇంతకీ ఎవరా నాయకుడు?

వైసీపీ నేత ఇంట్లో పెళ్లి.. ఉరంతా కానుకల చదివింపులు..!

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో అవినీతికి అంతే లేకుండా పోయింది. అధికారపార్టీకి చెందిన ఒక ముఖ్యనేత ఇంట జరిగిన పెళ్లి వేడుకలో నియోజకవర్గంలోని వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున చందాలు వసూలు చేశారనే ఆరోపణలతో ఒక వీడియో వైరల్‌ అవుతోంది. ఆ నాయకుడి ఇంట్లో పెళ్లి నిశ్చయమైనప్పటి నుంచీ నియోజకవర్గంలో కానుకల రూపంలో వసూళ్లకు శ్రీకారం చుట్టినట్టు ప్రచారం జరుగుతోంది.

రిసెప్షన్‌లో మండలాల వారీగా కౌంటర్లు ఏర్పాటు..!

గ్రామస్థాయిలో ఉన్న వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులు, వీఆర్వోలు, వాలంటీర్లు, డ్వాక్రా సంఘాల ప్రతినిధులతో సహా మండలస్థాయి అధికారులు నుంచి ప్రభుత్వ ఉద్యోగులు.. వివిధ వర్గాలు నుంచి పెళ్లి నిమిత్తం కానుకలు వసూలు చేశారట. ఇక మ్యారేజ్‌ రిసెప్షన్‌లో మండలాల వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి కట్నకానుకలు స్వీకరించినట్టు కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. పెళ్లికి తప్పక రావాలని ఆహ్వానిస్తూనే ఎవరెవరు ఎంత ఇవ్వాలో టార్గెట్లు పెట్టారట. చివరకు ఆ రోజు రాగానే ముక్కుపిండి వసూలు చేసినట్టు చెబుతున్నారు.

పెళ్లి కానుకల రూపంలో రూ.కోటి వసూలు..!?
కలెక్షన్లలో అయినవిల్లి మండలం టాప్‌..!

ఒక్కో వాలంటీర్ నుంచి వెయ్యి, డ్వాక్రా యానిమేటర్ నుంచి పదివేలు వంతున వసూలు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని అంబాజీపేట, అయినవిల్లి, పి. గన్నవరం, మామిడికుదురు 4 మండలాల నుంచి పెళ్లి కానుకల రూపంలో సుమారు కోటి రూపాయలు వసూలు చేసినట్టు టాక్‌. అంతేకాదు.. కానుకలు ఇవ్వడంలో మండలాలు మధ్య పోటీ రసవత్తరంగా సాగిందట. అయినవిల్లి మండలం నుంచి అత్యధికంగా డబ్బులు వసూళ్లు చేశామని ఆ నాయకుడి అనుచరులు గొప్పగా చెప్పుకుంటున్నారు. తర్వాత అంబాజీపేట మండలంలో వసూళ్లు ఎక్కువగా జరిగాయట.

ఇసుక, మట్టి, సెటిల్మెంట్స్‌కు ముగ్గురు అనుచరులు..!

నియోజకవర్గంలో ఆ నాయకుడికి ముగ్గురు ప్రధాన అనుచరులు ఉన్నారు. ఒకరు ఇసుక దందాను.. మరొకరు మట్టి దందాను పర్యవేక్షిస్తారట. మూడో వ్యక్తి పి.గన్నవరంలో సెటిల్‌మెంట్స్‌ ద్వారా గట్టిగానే వసూళ్లు చేస్తారని చెబుతారు. ఇదే విధంగా ఇప్పుడు పెళ్లి కానుకలను ఈ ముగ్గురి ద్వారా వసూలు చేసినట్టు సమాచారం. తమ నాయకుడి మెప్పు కోసం వసూళ్లలో అనుచరులు పోటీపడ్డారట. కానీ.. కానుకల పేర్లతో డబ్బులు ముట్టజెప్పిన వారే ఉసూరుమన్నారట. ఈ వసూళ్ల తీరును ప్రస్తావిస్తూ అధికారపార్టీకి చెందిన వాళ్లే విడుదల చేసిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వైసీపీ నేత తీరుపై సొంత పార్టీలోనే విమర్శలు..!

ఆర్థికంగా సెటిల్‌ అయిపోవాలనే ఉద్దేశంతో ఆ నాయకుడు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరు.. పాల్పడుతున్న అక్రమాలపై నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వైసీపీకి నష్టం కలిగించేలా తమవాళ్ల వైఖరి ఉందని సొంత నాయకులే విమర్శిస్తున్న పరిస్థితి. ఇవే అంశాలను ప్రస్తావిస్తూ సెల్‌ఫోన్లకు అదే పనిగా సందేశాలను ఫార్వర్డ్‌ చేస్తున్నారు. మొత్తానికి పైసా వసూల్‌లో ఆ నాయకుడు అ నుంచి అమ్‌ అహా వరకు.. క నుంచి బండిరా వరకు చదివేశారని చెవులు కొరుక్కుంటున్నాయి పిగన్నవరం వైసీపీ శ్రేణులు.

Related Articles

Latest Articles