కోచ్ పదవికి రవిశాస్త్రి గుడ్ బై చెప్పబోతున్నారా?

టీంఇండియాకు కొత్త కోచ్ రాబోతున్నారా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తోంది. ప్రస్తుతం టీంఇండియా కోచ్ గా ఉన్న రవిశాస్త్రి పదవీకాలం త్వరలోనే ముగియనుంది. ఆ తర్వాత ఆయన తన పదవి నుంచి తప్పుకునే అవకాశం ఉంది. ఈమేరకు తన నిర్ణయాన్ని రవిశాస్త్రి తాజాగా బీసీసీఐకి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో బీసీసీఐ కొత్త కోచ్ వేటను మొదలు పెట్టిందనే టాక్ విన్పిస్తోంది. టీంఇండియా కోచ్ రేసులో పలువురు వెటరన్ ప్లేయర్స్ పేర్లు తెరపైకి వస్తున్నాయి. దీంతో ఎవరు టీంఇండియా కోచ్ పదవిని దక్కించుకుంటారనే చర్చ అభిమానుల్లో జోరుగా సాగుతోంది.

టీంఇండియా కోచ్ గా రవిశాస్త్రి 2017లో నియమితులయ్యారు. ఆయన పదవీకాలం 2019 ఆగస్టులో ముగిసింది. అయితే బీసీసీఐ అతడి పదవీకాలాన్ని మరో రెండేళ్లు పొడిగించింది. టీ20 ప్రపంచ కప్ అనంతరం రవిశాస్త్రి దిగిపోనున్నాడు. తన పదవికి రాజీనామా చేయనున్నారు. రవిశాస్త్రితోపాటు బౌలింగ్, ఫీల్డింగ్ కోచులు కూడా తప్పుకోనున్నారు. ప్రస్తుతం బ్యాటింగ్ కోచ్ గా ఉన్న విక్రమ్ రాథోడ్ మాత్రం ఆ పదవిలో కొనసాగనున్నారు.

టీ20 ప్రపంచ కప్ తర్వాత రవిశాస్త్రి కోచ్ పదవి నుంచి తప్పుకోనుండటంతో బీసీసీఐ కొత్త కోచ్ వేట మొదలుపెట్టింది. త్వరలోనే కోచ్ సెలక్షన్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అర్హులైన వారి నుంచి ధరఖాస్తులను ఆహ్వానించనుంది. అనంతరం ఇంటర్య్యూలు నిర్వహించి కొత్త కోచ్ ను బీసీసీఐ ప్రకటించనుంది. కాగా భారత కోచ్ రేసులో పలువురు మాజీ స్టార్ ఆటగాళ్ళ పేర్లు విన్పిస్తున్నాయి.

వీరిలో ముందుగా టీంఇండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ పేరు విన్పిస్తోంది. ఆయన ఇప్పటికే ఎన్సీఏ డైరెక్టర్ గా, జూనియర్ టీమ్ కోచ్ గా సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ద్రావిడ్ కు కోచ్ పదవి దక్కడం ఖాయమనే వార్తలు విన్పిస్తున్నాయి. అదేవిధంగా టీంఇండియా మాజీ ఓపెనర్, డాషింగ్ బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా టీంఇండియా కోచ్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు టీ20 ప్రపంచ కప్ జరుగనుంది. దీని తర్వాత కోచ్ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకుంటారు. ఆ తర్వాత అంటే డిసెంబర్ 16 నుంచి ప్రారంభమయ్యే సౌతాఫ్రికా టూర్ నాటికి కొత్త హెడ్ కోచ్, అసిస్టెంట్ కోచ్ లు బాధ్యతలు తీసుకుంటారని తెలుస్తోంది. దీన్నిబట్టి త్వరలోనే టీంఇండియాకు కొత్త కోచ్ రావడం ఖాయంగా కన్పిస్తోంది.

Related Articles

Latest Articles

-Advertisement-