బీజేపీపై కేసీఆర్‌ రూటు మార్చారా?

తెలంగాణలో పొలిటికల్‌ ఈక్వేషన్స్‌ మారుతున్నాయా? కేసీఆర్‌ ఫోకస్‌ కాంగ్రెస్‌ నుంచి బీజేపీకి షిఫ్ట్‌ అయిందా? ఇప్పుడు ఆయన బీజేపీపై చేస్తున్నది ఉత్తుత్తి ఫైటేనా? లేదంటే మ్యాటర్‌ నిజంగానే సీరియస్సా? తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ప్రజల మదిలో మెదులుతున్న ప్రశ్నలు ఇవి.

హుజురాబాద్‌ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. ఉప ఎన్నిక తమకు లైట్‌ అని గులాబీ పార్టీ నేతలు అంటే అనొచ్చు. కానీ దాని తాలూకు ఓటమి అనేకల రకాలుగా ఆ పార్టీ శ్రేణులను ప్రభావితం చేస్తోంది. వారి ఆలోచన దోరణిని మార్చి వేసింది. మరోవైపు, గెలిచినప్పుడు బీజేపీలో పెల్లుబికే సహజ ఉత్సాహం రెట్టింపు అయింది. దూకుడు మరింత పెంచింది. ఈ గెలుపును 2023 ఎన్నికల సోసానంగా మార్చుకునే క్రమంలో ఉంది కాషాయ పార్టీ.

ఈటల గెలుపును బీజేపీ నూటికి నూరు శాతం ఉపయోగించుకుంటుంది. ఇందులో సందేహమే లేదు. హుజురాబాద్‌ విజయంతో వచ్చిన మైలేజీని 2023 ఎన్నికల వరకు కంటిన్యూ చేయాలనుకుంటోంది. తెలంగాణ ప్రజల ఫోకస్‌ తమ మీద ఉండేలా కార్యక్రమాలు రూపొందిస్తోంది. మొదట ఆ అధికార పార్టీపై మాటల యుద్ధానికి తెరతీసింది. ఫలితంగా రాష్ట్రంలో ఇప్పుడు ఏం జరుగుతుందో చూస్తున్నాం. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఐతే, ఇప్పటి వరకు మాటల యుద్ధమే జరిగింది. కాని పరిస్థితి ఇప్పుడు చేతల వరకు వెళ్లింది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ఉమ్మడి నల్లగొండ జిల్లా పర్యటన రణరంగాన్ని తలపిస్తోంది. టీఆర్‌ఎస్‌ శ్రేణులు అడుగడుగునా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. మిర్యాలగూడలో ఆయన కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది.ఆయనపై కూడా దాడికి యత్నించారు. బీజేపీ కార్యకర్తలు ఎదురుదాడికి దిగారు. దాంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది.

కేసీఆర్‌ ఆజ్ఞలతోనే తనపై దాడి జరిగిందని బండి సంజయ్‌ ఆరోపించారు. పంట కొనాలని అడిగితే కొట్టిస్తారా అని ప్రశ్నించారు. ఒక్క మిర్యాలగూడలోనే కాదు బండి సంజయ్‌ వెళ్లిన ప్రతి చోటా ఇదే పరిస్థితి. రెండు పార్టీల కార్యకర్తలు రాస్తారోకోలకు కూడా దిగుతున్నారు. పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వస్తోంది. దాంతో రెండు పార్టీల కార్యకర్తలు గాయలపాలవుతున్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించేందుకు బండి సంజయ్‌ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ విషయం ముందే ప్రకటించటంతో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పక్కాగా స్కెచ్‌ వేసినట్టు కనిపిస్తోంది. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు గ్రామాల్లో భారీగా మోహరించారు. నల్లజెండాలు, బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. సంజయ్‌ గోబ్యాక్, బీజేపీ నేతలు గోబ్యాక్‌’ అంటూ నినదిస్తున్నారు.

కొద్ది రోజులుగా తెలంగాణలో బీజేపీ-టీఆర్‌ఎస్‌ మధ్య పొలిటికల్‌ వార్‌ నడుస్తోంది. సీఎం కేసీఆర్‌-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఉప ఎన్నిక పరాజయం నుంచి జనం దృష్టిని మరల్చేందుకు కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నంగా విశ్లేషకులు దీనిని చూస్తున్నారు. అందుకే బండి సంజయ్‌ని టార్గెట్‌గా ఎంచుకున్నారనే వాదని వినిపిస్తోంది. ఐతే, కేసీఆర్‌ టార్గెట్‌ కాంగ్రెస్‌ కాదు..బీజేపీ. టీఆర్‌ఎస్‌ కన్నా అది ఎంతో బలమైనది. అందుకే ఆయన బీజేపీతో చాలా జాగ్రత్తగా యుద్ధం చేస్తున్నారు. అనేక అంశాలపై కేంద్రంపై విమర్శలు గుప్తిస్తున్నారు.

బీజేపీ అధి నాయకత్వాన్ని సీఎం కేసీఆర్‌ ఒక్క మాటా అనటం లేదు. పైగా ఢిల్లీ బీజేపీ . ..సిల్లీ బీజేపీ అంటూ రెండింటిని వేరు చేసి మాట్లాడుతున్నారు. దీనిని బట్టి లక్ష్యం పట్ల ఆయన చాలా స్పష్టంగా ఉన్నారని అర్థమవుతోంది. రాష్ట్ర బీజేపీ లక్ష్యంగా చేసుకుని వడ్ల కొనుగోలుపై కేంద్రాన్ని నిలదీస్తున్నారు. వడ్లు కొంటుందో లేదో దమ్ముంటే కేంద్రంతో చెప్పించండంటూ తెలంగాణ బీజేపీ నేతలకు ఛాలెంజ్‌ విసిరారు. దీనిపై కేంద్రం ఏదో ఒకటి స్పష్టం చేయాలంటూ ధర్నాలకు దిగారు.

తెలంగాణ బీజేపీ నేతలు చేతనైతే కేంద్రాన్ని ఒప్పించి యాసంగి వడ్లు కొనిపించాలంట గులాబీ క్యాడర్‌ ఎక్కడికక్కడ నిలదీస్తోంది. మరి దీనికి రాష్ట్ర బీజేపీ దగ్గర సమాధానం ఉందా? కేసీఆర్‌ కేంద్రాన్ని అడుతున్నది చాలా సింపుల్‌ ప్రశ్న. యాసంగిలో వడ్లు కొంటారా? కొనరా? దీనికి బీజేపీ దగ్గర సమాధానం లేదనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లేందుకు టీఆర్‌ఎస్‌ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బండి సంజయ్‌ పర్యటనను అడ్డుకుని జనం దృష్టిని తన వైపు తిప్పుకుంది.

బహుముఖ వ్యూహంతో బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు కేసీఆర్‌ పావులు కదుపుతున్నారు. బిజెపి కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వానికి మధ్య స్పష్టమైన గీత గీసి ముందుకు వెళుతున్నారు. హజురాబాద్‌ ఉప ఎన్నిక తరువాత బీజేపీ పట్ల కేసీఆర్ ఆలోచనలు మారాయి. ఇప్పుడు ఆయన తన ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ ను చూడట్లేదు. తనకు అసలు ముప్పు బీజేపీ నుంచి అని అర్థమైంది. దాంతో ఇప్పుడు ఆయన ఆ పార్టీపై ముప్పేట దాడి చేస్తున్నారు. తెలంగాణకు కేంద్రం చేస్తున్న అన్యాయంపై రాష్ట్ర బిజెపి నేతలను కడిగి పారేస్తున్నారు. 2014 నుంచి పెట్రోల్‌, డీజిల్‌పై విధించిన సెస్‌లను వెనక్కి తీసుకోవాలని కేసీఆర్‌ డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గళం విప్పారు. దీనిపై కేంద్రాన్ని నిలదీస్తున్నారు. అయితే ఇది ఎంత కాలం అన్నది ప్రశ్న. తనకు అవసరం వచ్చినప్పుడు మాత్రమే కేంద్రంపై ధాం ధూం అంటారనే అపవాదు కేసీఆర్‌పై ఉంది. ఇప్పుడు ఆయన బీజేపీతో రియల్‌ ఫైట్‌ చేస్తున్నా అంటే జనం విశ్వసిస్తారా ?

మరోవైపు, కేసీఆర్‌ తన పాత ప్రత్యర్థి కాంగ్రెస్ ని ఓ ప్రాధాన్యత లేని పార్టీగా రాష్ట్ర ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన త్రిముఖ పోటీ కోరుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తనకు లాభిస్తుందనేది ఇందులోని లాజిక్‌. ఇదంతా చూస్తుంటే ఆయన కావాలనే బీజేపీని లేపుతున్నారా.. అనే అనుమానాలకు తావిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్‌ రెండింటి బలం సమానంగా ఉంటేనే కేసీఆర్‌ వ్యూహం ఫలిస్తుంది. అందుకే బీజేపీని కావాలనే కవ్విస్తున్నట్టు కనిపిస్తోంది.

తెలంగాణలో కనీసం 70 నుంచి 80 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్‌ బలంగా ఉంది. 2018 ఎన్నికల్లో బీజేపీకి 107 స్థానాల్లో డిపాజిట్లు రాలేదు. మొత్తం 119 స్థానాల్లో కాంగ్రెస్‌ 88 చోట్ల గెలిచింది. కానీ, టీఆర్‌ఎస్‌కు ఈ ఆనందం ఎక్కువ రోజులు లేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 17 స్థానాలలో నాల్గింటిని బీజేపీ కైవసం చేసుకుంది.బండి సంజయ్‌ అధ్యక్ష పగ్గాల చేపట్టిన తరువాత పార్టీ దూకుడు బాగా పెరిగింది. టీఆర్‌ఎస్‌కు ప్రత్యర్థి బీజేపీయే అన్న భావనను జనానికి కల్పించగలిగారు. 2018 నుంచి ఇప్పటి వరకు ఉప ఎన్నికలు జరిగిన నాలుగు అసెంబ్లీ సీట్లలో టీఆర్‌ఎస్‌, బీజేపీ చెరో రెండు గెలిచాయి. అలాగే GHMC ఎన్నికల్లో 48 స్థానాలు గెలిచింది. దీంతో గులాబీ పార్టీ బలం 99 నుంచి 55కి పడిపోయింది.

మరోవైపు, రేవంత్ రెడ్డి పీసీసీ నాయకత్వ బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్‌ మెల్లగా పుంజుకుంటోంది. దీనిని అడ్డుకునేందుకు ఆయన బీజేపీని సీన్‌లోకి తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది. దానిని తన ప్రధాన ప్రత్యర్థిగా ఎంచుకోవటం ఆ దిశగా కేసీఆర్ వేసిన ఎత్తుగడగా కనిపిస్తోంది. ఎప్పుడూ ఇంటిపోరుతో సతమతమయ్యే కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టి బీజేపీని ముందుకు తెచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో ఆయన సక్సెస్‌ అయినట్టే కనిపిస్తోంది. తమపై టీఆర్‌ఎస్‌ ఫోకస్‌ పెరగడంతో సహజంగానే బీజేపీ రెచ్చిపోయింది. వచ్చే ఎన్నికల నాటికి కనీసం ఇప్పుడున్న పరిస్థితులు ఉన్నా అది టీఆర్‌ఎస్‌ అనుకూలంగా ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు.

ఇదిలా ఉంటే టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య పోరు కాంగ్రెస్‌ పార్టీని కప్పేసింది. రేవంత్ రెడ్డి టీ-పీసీసీ చీఫ్‌ అయిన తరువాత పార్టీలో కొత్త ఉత్సాహంతో కనిపించింది. కానీ, అది ఎంతో కాలం నిలవలేదు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీ-కాంగ్రెస్‌కు ఘోర పరాభవం ఎదురైంది. నియోజకవర్గంలో మంచి క్యాడర్ ఉన్నప్పటికీ టీ-కాంగ్రెస్ డిపాజిట్ దక్కించుకోలేకపోయింది. ఇది ఆ పార్టీ క్యాడర్ తో పాటు ప్రజల్లో దాని ప్రతిష్టను దెబ్బతీసింది.

ఉప ఎన్నికల అనంతరం జరిగిన కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో అన్ని వేళ్లు రేవంత్ వైపే చూశాయి. సీనియర్‌ నేతలు ఆయన ఏకపక్ష నిర్ణయాలను తప్పుబట్టారు. నిజానికి టీ-కాంగ్రెస్‌లో రేవంత్ ఇప్పుడు ఒంటరి పోరాటం చేస్తున్నారు. సీనియర్ల నుంచి సరైన సహకారం లేదు. ఈ సమయంలో హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో కనీసం డిపాజిట్‌ కూడా రాకపోవటం రేవంత్‌ని తీవ్ర ఇరకాటంలో పడేసింది. ఇకపై ఆయన దూకుడు తగ్గే అవకాశం ఉంది. టీ-పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న హనుమంతరావు తన నిర్ణయం మార్చుకున్నారు. కానీ కోమటిరెడ్డి సోదరులు, జగ్గా రెడ్డి వంటి వారు ఇప్పటికీ రేవంత్‌పై అసంతృప్తితోనే ఉన్నారు. ఆయనతో కలిసి పని చేసే పరిస్థితి లేదు.

ఇదిలా ఉంటే హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓటమి గురించి తెలుసుకున్న కాంగ్రెస్ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ నేతలను ఢిల్లీకి పిలిపించింది. టీ-పీసీసీ చీఫ్ రేవంత్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు, హుజూరాబాద్ అభ్యర్థి బల్మూర్ వెంకట్‌తో హైకమాండ్‌ మాట్లాడింది. కానీ అక్కడా వారి తీరు మారలేదు. దమ్ముంటే తనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని కాంగ్రెస్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ సవాలు విసిరారు. దీంతో హైకమాండ్‌ కూడా ఏమీ తేల్చకుండా వారిని తిరిగి పంపించి వేసింది. ఏదేమైనా హుజురాబాద్‌లో పెద్ద సంఖ్యలో సాంప్రదాయ ఓటు కలిగిన కాంగ్రెస్ రెండో స్థానం నుంచి మూడో స్థానానికి దిగజారటం ఆ పార్టీ అధి నాయకత్వానికి మింగుడు పడని విషయం. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోందా అనే భావనలోకి వెళ్లిపోయింది కాంగ్రెస్‌ హైకమాండ్‌.

ఓ వైపు, క్యాడర్‌ క్రమశిక్షణతో బీజేపీ నలు దిశలా విస్తరిస్తుంది. మరోవైపు, బలంగా ఉన్న చోట్ల కూడా కాంగ్రెస్‌ క్యాడర్‌ క్రమశిక్షణా రాహిత్యంతో చేజేతులా అవకాశాలను పాడు చేసుకుంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు గెలిచిన బీజేపీ ఇప్పుడు ప్రధాన ప్రత్యర్థి రేసులోకి వచ్చింది. ఈ స్పీడు ఇలాగే కొనసాగితే తెలంగాణలో అధికార పీఠం ఎక్కే రోజు ఎంతో దూరం లేదు. అలా జరిగితే అది కాంగ్రెస్‌ స్వయంకృతాపరాధమే తప్ప మరొకటి కాదు!!

-Dr.Ramesh Babu Bhonagiri

Related Articles

Latest Articles