ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా రోగులకు ధైర్యం చెప్పిన సిఎం కెసిఆర్

వరంగల్ పర్యటనలో భాగంగా ఇవాళ ఎంజీఎం ఆస్పత్రికి చేరుకున్న సిఎం కెసిఆర్ నేరుగా కోవిడ్ పేషంట్లు ఉన్న ఐసీయూ వార్డులోకి వెళ్లి రోగులను పరామర్శించారు. కోవిడ్ పేషంట్లకు అందుతున్న చికిత్స గురించి తెలుసుకున్నారు. కరోనాకు భయపడవద్దంటూ వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వరంగల్ మట్టెవాడకు చెందిన కరోనా పేషంట్ వెంకటాచారి తనకు వైద్య చికిత్స బాగానే అందుతున్నదని సీఎంకు వివరించారు. కేసీఆర్ జిందాబాద్.. కేసీఆరే నా నిండు ప్రాణం అని ఆయన అన్నారు. ప్రతీ బెడ్ దగ్గరకూ వెళ్లి కరోనా రోగులకు అందుతున్న వైద్య సేవలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ జనరల్ వార్డును సందర్శించి రోగులను పరామర్శించారు. ఎంజీఎం ఆస్పత్రి అంతా కలియతిరిగి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. ఎంజీఎం ఆస్పత్రిలో ఉన్న వైద్య సౌకర్యాలు, రోగులకు అందుతున్న వైద్య సేవలపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో సిబ్బందికి ఎదురవుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఎంత ఖర్చయినా సరే.. రోగులకు కావాలసిన అన్ని సౌకర్యాలను సమకూర్చాలని అక్కడే ఉన్న వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

Related Articles

Latest Articles

-Advertisement-