సీఎం కేసీఆర్‌ వదిలిన బీసీ బాణం.. !

సీఎం కేసీఆర్ వదిలిన బీసీ బాణం.. బీజేపీని ఇరుకున పడేసిందా? బీసీ కుల గణనకు అసెంబ్లీలో తీర్మానం చేయడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచారా? ఈ అంశం హుజురాబాద్‌లో అధికారపార్టీకి కలిసి వస్తుందా? రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి?

దేశ రాజకీయాలలో బీసీ కుల గణనకు డిమాండ్స్‌..!

బీసీ కుల గణన ఇప్పుడు దేశమంతా ఇదే హాట్ టాపిక్. బీజేపీ మిత్రపక్షాల డిమాండ్‌ కూడా ఇదే. వెనకబడిన వర్గాలకు చెందిన పలు సంఘాలు కూడా ఇదే శ్రుతి అందుకున్నాయి. ఇలాంటి సమయంలోనే తెలంగాణ శాసనసభ కుల గణన చేపట్టాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఇంత చర్చ జరుగుతున్నా.. కేంద్ర సర్కార్‌ మౌనం రాజకీయ పక్షాలకు అంతుచిక్కడం లేదు. పైగా కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో బీసీ కుల గణన సాధ్యం కాదని చెప్పేసింది మోడీ ప్రభుత్వం.

రాష్ట్రాల వారీగా కుల గణన చేసుకోవచ్చన్నది బీజేపీ వాదన?

ఈ వ్యవహారం బీజేపీని ఇరకాటంలో పడేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలు వెళ్లకుండా.. తాము బీసీ కుల గణనకు వ్యతిరేకం కాదని చెబుతున్నా.. ఇందుకు కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయని వెల్లడిస్తోంది. న్యాయ, సాంకేతిక, పాలనా పరమైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే కేంద్రం ఆచితూచి స్పందిస్తుందన్నది బీజేపీ వాదన. ఒక కులం ఒక రాష్ట్రంలో ఓసీ అయితే.. అదే కులం మరో రాష్ట్రంలో బీసీగా ఉందని.. ఇలా దేశవ్యాప్తంగా లక్షల కులాలు ఉన్నాయని.. అందుకే రాష్ట్రాల వారీగా బీసీ కుల గణన చేసుకోవచ్చని బీజేపీ వాదనగా ఉంది.

హిందూ ఐక్యత సాధ్యంకాదని ఆర్‌ఎస్‌ఎస్‌ ఆందోళన?

కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో సుముఖత వ్యక్తం చేయకపోవడానికి బలమైన కారణం ఉందని ప్రచారం జరుగుతోంది. బీసీ కుల గణన చేపడితే తేనె తుట్టెను కదిపినట్టేనని బీజేపీ భయపడుతోందట. సంఘ పరివార క్షేత్రాలు, ప్రధానంగా RSS కుల గణనను వ్యతిరేకిస్తున్నట్టు టాక్‌. ఇప్పటికే హిందు సమాజం కులాల పేరుతో చీలి పోయిందని.. బీసీ కుల గణన జరిగితే కులాల మధ్య దూరం పెరుగుతుందని ఆందోళన చెందుతున్నాయట ఆ సంస్థలు. హిందు ఐక్యత సాధ్యం కాదని చెప్పేసిందట. అందుకే కేంద్రం ఈ అంశంపై వెనకంజ వేస్తున్నట్టు సమాచారం.

అసెంబ్లీ తీర్మానం హుజురాబాద్‌ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌కు కలిసి వస్తుందా?

అసెంబ్లీలో తీర్మానం చేయడం ద్వారా హుజురాబాద్‌ ఉపఎన్నికలోనూ పైచెయ్యి సాధించేలా సీఎం కేసీఆర్ రాజకీయ ఎత్తుగడ వేసినట్టు తెలంగాణ బీజేపీ అనుమానిస్తోంది. హుజురాబాద్‌లో బీసీ అభ్యర్థిని బరిలో దించడం.. అక్కడ లక్షకు పైగా బీసీ ఓటర్లు ఉండటంతో.. ఈ ఎత్తుగడ కలిసి వస్తుందనే ఆలోచన అధికార పార్టీలో ఉందట. కేంద్రం వైఖరి ఎలా ఉన్నా.. ఇప్పుడు హుజురాబాద్‌లో ఈ అంశం చూపించే ప్రభావంపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది.


-Advertisement-సీఎం కేసీఆర్‌ వదిలిన బీసీ బాణం.. !

Related Articles

Latest Articles