అప్పుడు ఆహారం కోసం అల‌మ‌టించాం.. నేడు దేశానికే అన్న‌పూర్ణ‌గా మారాం..!

ఉమ్మడి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో ఆహారం కోసం అలమటించిన తెలంగాణ.. నేడు దేశానికే అన్నపూర్ణగా మారడం వెనక రాష్ట్ర ప్రభుత్వ కృషిని గుర్తు చేసుకున్నారు సీఎం కేసీఆర్.. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయ‌న‌.. అనతికాలంలో రెండు పంటలకు రెండుకోట్ల ఎకరాల మాగాణాగా తెలంగాణను తీర్చిదిద్దుకున్నామ‌న్నారు.. దాదాపు మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యం ఉత్పత్తితో, దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలోకి ఎదుగుతున్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం, ఆహార భద్రతను దాటి దేశానికి ఆహార భరోసాను కల్పించే స్థితికి చేరుకుంద‌న్న సీఎం.. ‘‘రైస్ బౌల్ ఆఫ్ ఇండియా’’గా తెలంగాణ వ్యవసాయం రూపుదిద్దుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోని పాలకులు తెలంగాణ వ్యవసాయాన్ని, నీటిపారుదల రంగాన్ని నిర్లక్ష్యం చేయడం మూలంగా.. సాగునీరు, తాగునీరు లేక, తెలంగాణ అల్లాడిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న అనంతరం మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పటిష్టం చేసుకుని, కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులను యుద్దప్రాతిపదికన నిర్మించుకుని నేడు ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదుగుతుండడం, తెలంగాణ సమాజం గర్వపడే సందర్భమన్నారు.

ఏ రాష్ట్రంలో లేనివిధంగా ప్రతి ఏటా రూ.45 వేల కోట్లతో వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, ప్రజలకు ఆహార భద్రతతోపాటు సామాజిక జీవన భద్రత కూడా ప్రభుత్వం కల్పిస్తుంద‌న్నారు సీఎం కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రంలో తిండికి లోటు ఉండకూడదనే లక్ష్యంతో, ఆహార భద్రతను కల్పించడంలో భాగంగా, ఒక వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున, కుటుంబంలోని ప్రతి ఒక్కరికి కిలో రూపాయి చొప్పున ‘‘ ఆహార భద్రతా కార్డు (రేషన్ కార్డు)’’ ద్వారా నాణ్యమైన బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంద‌ని గుర్తుచేశారు.. రేషన్ కార్డు కలిగిన మొత్తం 87,41,000 కుటుంబాల్లోని 2,79,27,000 ( రాష్ట్ర జనాభాలో 72శాతం) మందికి కేవలం 1 రూపాయికి కిలో చొప్పున 20 లక్షల మెట్రిక్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నదని సిఎం తెలిపారు. ఇందుకు గాను కిలో ఒక్కంటికి రూ.28.24 పైసల చొప్పున ప్రతి ఏటా రూ.2,088 కోట్ల సబ్సిడీని భరిస్తున్నదన్నారు. రాష్ట్రం వ్యాప్తంగా విద్యార్ధులకు సన్నబియ్యాన్ని అందిస్తూ ఆహార భద్రతను ప్రభుత్వం కల్పిస్తున్నదని సిఎం కెసిఆర్ వివరించారు. రేషన్ కార్డుదారులు ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పోర్టబిలిటీ రూపొందించిందన్నారు. తద్వారా తెలంగాణ పౌరులు రాష్ట్రంలో ఎక్కడున్నా ఆహార భద్రత లభించే ఏర్పాటును ప్రభుత్వం చేసిందని ఈ సంద‌ర్భంగా గుర్తుచేశారు సీఎం కేసీఆర్.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-