నేడు కూడా ఢిల్లీలోనే సీఎం కేసీఆర్ !

ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు సీఎం కేసీఆర్‌. సోమవారం సాయంత్రం మరోసారి కేంద్ర హోం అమిత్ షా తో భేటీ అయ్యారు . తెలంగాణ లో తీవ్రవాద ప్రభావం, అభివృధ్దిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తోనూ.. సోమవారం మరో దఫా చర్చలు జరిపారు సీఎం కేసీఆర్‌. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో వరిధాన్యం దిగుబడి ఐదు రెట్లు పెరిగిందనీ.. కేంద్రం దగ్గర గోడౌన్లు ఖాళీలేకపోతే.. విదేశాలకు ఎగుమతి చేసే అంశాన్ని పరిశీలించాలని కేంద్రమంత్రిని కోరారు సీఎం కేసీఆర్‌.

గత శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌… బిజీబిజీగా గడుపుతున్నారు. శనివారం, కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సాగునీటి ప్రాజెక్టులు, పలురకాల అనుమతుల మంజూరుపై నెలకున్న సందిగ్ధత.. తదితర అంశాలపై వినతిపత్రం సమర్పించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును తొందరగా పూర్తి చేసేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు కేసీఆర్‌. ఆదివారం, వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలతో కేంద్రహోంశాఖ నిర్వహించిన భేటీలో పాల్గొన్న కేసీఆర్‌… హోమ్ మంత్రి అమిత్ షాతో గంట 45 నిముషాల పాటు సమావేశమయ్యారు.

కీలక అంశాలపై చాలాసేపే చర్చించారు ఇద్దరునేతలు. అంతకుముందు, కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహరాల మంత్రి పీయూష్ గోయల్ తో తొలి విడతగా భేటీ అయ్యారు కేసీఆర్‌. ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వనప్పటికీ.. మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని సీఎంకు కేంద్రమంత్రి చెప్పినట్టు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో పరిష్కారం లభిస్తుందనే ఆశాభావంతో ఉన్నారు ముఖ్యమంత్రి. ఇవాళ కూడా కేసీఆర్‌.. ఢిల్లీలోనే ఉంటారని తెలుస్తోంది.

-Advertisement-నేడు కూడా ఢిల్లీలోనే సీఎం కేసీఆర్ !

Related Articles

Latest Articles