ఇవాళ ఢిల్లీకి సీఎం కేసీఆర్..కేంద్రంతో ఢీ అంటే ఢీ !

ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో అమీతుమీకి సిద్ధమయ్యారు. ప్రధానంగా మూడు డిమాండ్లతో కేసీఆర్ బృందం హస్తిన వెళ్తోంది. చ‌నిపోయిన‌ ప్ర‌తి రైతు కుటుంబానికి 25 ల‌క్షల పరిహారం, రైతుల‌పై న‌మోదైన కేసుల‌ ఎత్తివేత, క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర చ‌ట్టం తీసుకురావాలని డిమాండ్ చేయనున్నారు. అలాగే రాష్ట్రంలో కుల గణన., తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీపై కూడా ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పోరుబాట పట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంతో సమరానికి సిద్ధమయ్యారు.

మంత్రులు, ఎమ్మెల్యేలతో కలసి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ధాన్యం కొనుగోళ్లపై ధర్నాలు చేసినా కేంద్రం నుంచి ఉలుకూ పలుకూ లేదని మండిపడ్డారు. దాన్యం కొనుగోళ్లపై ఇవాళ కేంద్ర పెద్దలతో మంత్రులు, అధికార బృందం చర్చలు జరపనున్నారు. సీఎం కేసీఆర్ కూడా కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. ప్రధాని అపాయింట్ మెంట్ దొరికితే పలు అంశాలను ప్రస్తావించే యోచనలో ఉన్నారు సీఎం కేసీఆర్. వ్యవసాయ చట్టాలను రద్దు చేసినట్టే రైతులపై పెట్టిన కేసులను కూడా ఎత్తివేయాలని సీఎం డిమాండ్ చేశారు.

రైతు పోరాటంలో మరణించిన 750 కుటుంబాలకు తెలంగాణ తరఫున 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ప్రకటించారు. కేంద్రం కూడా ఒక్కో కుటుంబానికి 25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ, గోదావరి, కృష్ణా నదుల నీటి పంపకాలపై ట్రిబ్యునల్ ఏర్పాటు, విద్యుత్ చట్టం రద్దు తదితర అంశాలపై కూడా ఢిల్లీతో చర్చించనున్నట్లు ఆయన చెప్పారు. ధర్నా చేసిన రోజున తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని అన్నారని… చివరి ప్రయత్నంగా ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నట్టు కేసీఆర్ చెప్పారు. మరి కేసీఆర్ డిమాండ్లపై కేంద్ర పెద్దలు ఎలా స్పందిస్తారన్నది చూడాలి.

Related Articles

Latest Articles