ఆర్టీసీ, విద్యుత్ చార్జీలతో ప్రజలపై ఎంత భారం?

కరోనా కష్టకాలంలో ప్రజలపై మరో పిడుగును వేసేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమవుతోంది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను సాకుగా చూపుతూ ఆర్టీసీ ఛార్జీలను.. డిస్కం నష్టాలను చూపుతూ విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు కేసీఆర్ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. కరోనాతో ఇప్పటికే ప్రజలంతా ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతుంటే పులిమీద పుట్రలా మరో భారాన్ని మోపడానికి ప్రభుత్వం సిద్ధమవుతుండటం శోచనీయంగా మారింది. ఈ పెంపు త్వరలోనే అమల్లోకి రానుందని తెలుస్తోంది.

కరోనా మహమ్మరి దెబ్బకు అన్నిరంగాల మాదిరిగానే ఆర్టీసీ సైతం కుదేలైంది. కరోనా సమయంలో చాలారోజులపాటు బస్సులు షెడ్డులకే పరిమితమయ్యాయి. బస్సుల రవాణా తిరిగి పునరుద్దరించినప్పటికీ కరోనా ఆంక్షల మధ్యే సాగాయి. ఈ కారణంగా ఆర్టీసీకి భారీగా నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. దీనికితోడు పెరిగిన పెట్రోల్, డిజీల్ ధరలు సైతం ఆర్టీసీ మనుగడను ప్రశార్థకంగా మార్చివేశాయి. ఆర్టీసీ ఉద్యోగాలకు జీతాలు ఇవ్వడం కూడా కష్టంగా మారింది. దీంతో ఆర్టీసీని గట్టెక్కించేందుకు ప్రభుత్వం ఛార్జీల పెంపుకే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల ఆర్టీసీకీ ఎండీగా నియామకమైన సజ్జనార్ సైతం ఛార్జీల పెంపు ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వం సూత్రపాయంగా అంగీకరించిందని సమాచారం. అయితే ఏమేరకు ప్రజలపై భారం మోపాలి? అనే విషయాన్ని క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విద్యుత్ ఛార్జీల పెంపునకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు కనబడుతోంది. ఎప్పటి నుంచి విద్యుత్ ఛార్జీలను పెంచాలని డిస్కంలు పట్టుబడుతున్నాయి.

గడిచిన ఆరేళ్లుగా విద్యుత్ చార్జీలను ప్రభుత్వం సవరించలేదని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నారు. గత మార్చిలోనే ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచుతామని హామీ ఇచ్చిందని అయితే కరోనా కారణంగా వాయిదా వేసిందనే విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం విద్యుత్ సంస్థలు గట్టెక్కాలంటే చార్జీలను పెంచాల్సిందేనని అధికారులు పట్టుబడుతున్నారు. దీనిపై త్వరలోనే క్యాబినెట్లో చర్చించి ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే టీఆర్ఎస్ ప్రస్తుతం హుజూరాబాద్ ఎన్నికల మూడ్ లో ఉంది. ఇక్కడ గెలుపును సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలను పెంచితే అది ఖచ్చితంగా ఎన్నికలపై ప్రభావం చూపుతుంది. దీంతో ప్రభుత్వం హుజూరాబాద్ ఎన్నికల తర్వాతే విద్యుత్, ఆర్టీసీ ఛార్జీల పెంచే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తోంది. ఏదిఏమైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నింటికి విరుగుడు మంత్రంగా ప్రజలపై భారం మోపుతూ వెళుతుండటం మాత్రం ఆందోళనకు గురిచేస్తోంది. కష్టకాలంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వాలే సామాన్యులపై భారం మోపుతుండటంతో వాళ్ల గోడు ఎవరికీ చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది.

-Advertisement-ఆర్టీసీ, విద్యుత్ చార్జీలతో ప్రజలపై ఎంత భారం?

Related Articles

Latest Articles