షర్మిలకు షాకిచ్చిన కేసీఆర్.. ఆమె పోరాటం వృథానేనా?

ఒకే దెబ్బకు చాలా పిట్టలు.. కేసీఆర్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. ఏకంగా 50వేల ఉద్యోగాల ప్రకటన.. జాబ్ క్యాలెండర్ ను దసరాకు రిలీజ్ చేసి అటు వైఎస్ షర్మిలకు ఎజెండా లేకుండా చేయడం.. ఇటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నోరు మూయించడమే ధ్యేయంగా ముందుకెళుతున్నట్టు సమాచారం. ఇదే జరిగితే తెలంగాణ నిరుద్యోగుల ఆశలు నెరవేరడంతోపాటు వైఎస్ఆర్ టీపీ, కాంగ్రెస్ లను దెబ్బతీయవచ్చని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారట..

హుజూరాబాద్ ఉప ఎన్నికల సాక్షిగా సీఎం కేసీఆర్ ప్రత్యర్థి పార్టీలకు గట్టి షాక్ ఇవ్వబోతున్నారా? అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. సీఎం కేసీఆర్ ఈ ఉప ఎన్నికను ఛాలెంజ్ గా తీసుకున్న నేపథ్యంలో అన్నివర్గాలను ఆకట్టుకునేలా పావులు కదుపుతున్నారు. ఈక్రమంలోనే దళితబంధు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, పెన్షన్లు, గొర్రెల పంపిణీ వంటి కార్యక్రమాలను మరోసారి షూరు చేశారు. ఇక టీఆర్ఎస్ పై అగ్గి మీద గుగ్గిలం అవుతున్న నిరుద్యోగులను తనవైపు తిప్పుకునేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే బైపోల్ నోటిఫికేషన్ కంటే ముందే 50వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయినట్లు టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది.

నిరుద్యోగ సమస్యలపై తెలంగాణలో అన్ని పార్టీలు కొట్లాడుతున్నాయి. ఈ విషయంలో అన్ని పార్టీలది ఒక ఎత్తయితే వైఎస్ షర్మిల పార్టీది మరో ఎత్తు. ఆమె పార్టీ పెట్టిన తొలి నుంచి నిరుద్యోగ సమస్యలపైనే ప్రధానంగా గళం విప్పుతున్నారు. కేసీఆర్ ను టార్గెట్ చేసుకొని విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. నిరుద్యోగ దీక్ష, పరామర్శల పేరుతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా యూనివర్శిటీ వద్ద దీక్షలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆమెకు నిరుద్యోగుల నుంచి భారీ మద్దతు లభిస్తోంది.

ఈక్రమంలోనే తెలంగాణలోని నిరుద్యోగులపై షర్మిల ప్రభావం ఉండకుండా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. తొలి విడతగా 50వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. గతంలోనే దీనిపై ప్రభుత్వం యంత్రాంగం భారీ కసరత్తులు చేసింది. జోన్లలోని కేడర్ల వారీగా ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉండటంతో కొంత ఆలస్యం అవుతూ వస్తోంది. తాజాగా రాష్ట్రపతి ఉత్తర్వులు రావటంతో వాటి ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సర్కారు సిద్ధమవుతుందని సమాచారం.

కొద్దిరోజుల క్రితమే తెలంగాణ కేబినెట్ సమావేశమై అన్ని శాఖలు తమ పరిధిలోని ఖాళీల వివరాలను తెలుపాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు ప్రభుత్వంలో ఖాళీలు 50వేల నుంచి 65 వేలకుపైగా ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు. నేడు మరోసారి కేబినెట్ సమావేశం అవుతున్న తరుణంలో దీనిపై తుదినిర్ణయం ఉండబోతుందని తెలుస్తోంది. దసరా కానుకగా సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారనే టాక్ విన్పిస్తుంది. జాబ్ క్యాలెండర్ పై కూడా ఈ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

అయితే ఉద్యోగాల నోటిఫికేషన్ ఇప్పుడు అప్పుడు అని ప్రతీసారి దాటవేస్తుండటంతో నిరుద్యోగుల్లో నిరుత్సాహం నెలకొంది. అయితే ఈసారి హూజూరాబాద్ నోటిఫికేషన్ కంటే ముందే ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తుందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈసారి భారీ సంఖ్యలో నోటిఫికేషన్ వెలువడం ఖాయమనే టాక్ నడుస్తోంది. తెలంగాణలో షర్మిలా పార్టీని దెబ్బకొట్టడంతోపాటు ప్రత్యర్థులకు ఈ ఎన్నికల్లో ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఏదిఏమైనా గత కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఆశలు ఎట్టకేలకు తీరనుండటంతో వాళ్లు సైతం టీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related Articles

Latest Articles

-Advertisement-