ఎంబీబీఎస్ విద్యార్థుల విషయంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం?

దేశంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చాక ప్రతీఒక్కరికి ఆరోగ్యం గురించిన అవశ్యకత తెలిసొచ్చింది. సీఎం జగన్మోహన్ రెడ్డి తొలి నుంచి కూడా ప్రజా ఆరోగ్యం విషయంలో శ్రద్ధ కనబరుస్తూనే ఉన్నారు. గతంలో ఒకేరోజు వెయ్యి అంబులెన్సులను ప్రారంభించి జగన్మోహన్ రెడ్డి సర్కార్ రికార్డు సృష్టించింది. వెయ్యి రూపాయాల కంటే ఎక్కువ ఖర్చు చేసే వ్యాధులన్నింటిని ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో చేర్చి పేద, సామాన్య ప్రజలకు బాసటగా నిలిచింది. ఆఖరికి కరోనా ట్రీట్మెంట్ ను సైతం సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీలో చేర్చారంటే ఆయనకు ప్రజల ఆరోగ్యంపై ఎంతటి చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఖజానాపై భారం పడుతున్నా ప్రజారోగ్యం విషయంలో ఆయన ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు.

తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరం వైద్యసేవలు అందబాటులోకి రానున్నాయి. ప్రతీ ఎంబీబీఎస్ విద్యార్థి ఏడాదిపాటు గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించేలా ఏపీ సర్కారు త్వరలోనే ఉత్వర్వులు జారీ చేయనుంది. ఈ మేరకు సీఎం జగన్మోహన్ రెడ్డి తాజాగా వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు సమీక్షించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం ఆదేశాలతో దీనిని అమలు చేసేందుకు అవసరమైన జీవోలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి జీవో విడుదలైతే మాత్రం ప్రతీ ఏడాది 5,300 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు అందించాల్సి ఉంటుంది.

వీరంతా కూడా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక, ఆరోగ్య కేంద్రాల్లోని ఆస్పత్రుల్లో పని చేయాల్సి ఉంటుంది. వీరితోపాటు 2,300 మంది పీజీ విద్యార్థులు సైతం ప్రాంతీయ, జిల్లా బోధనాస్పత్రుల్లో సీనియర్ రెసిడెంట్లుగా పని చేయాల్సి ఉంటుంది. నిజానికి ఈ నిర్ణయంలో 2010లోనే నాటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నా అమల్లోకి రాలేదు. 2016లో అధికారంలో ఉన్నా టీడీపీ ప్రభుత్వం ఈ జీవోను ఉపసంహరించుకుంది. దీంతో పీజీ విద్యార్థులకు రెసిడెన్సీ విధానాన్ని ఒక ఆప్షనల్ గా చేశారు. దీంతో అత్యధిక మంది వైద్య విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదని తెలుస్తోంది.

మరోవైపు కేరళ, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు రూరల్ ప్రాక్టీస్ విధానాన్ని తీసుకొచ్చాయి. కేరళలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదివే విద్యార్థులను ఈ నిబంధనలను తప్పనిసరి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదిపాటు సేవలు చేసిన విద్యార్ధులు పీజీలో రెసిడెన్సీ చేయాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక విలేజ్ క్లినిక్కులను తీసుకొచ్చారు. వీటికి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది.

దీంతో ప్రజల అవసరాలకు తగ్గట్టుగా విలేజ్ క్లినిక్కులు నాణ్యమైన సేవలందించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ఏపీ సర్కారు కసరత్తులు చేస్తోంది. దీనిలో భాగంగానే ఎంబీబీఎస్ చివరి సంవత్సరం విద్యార్థుల సేవలను ప్రభుత్వం వినియోగించుకోవాలని భావిస్తుంది. ఏదిఏమైనా సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకోబోయే ఈ నిర్ణయం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరం వైద్యసేవలు అందుబాటులో రావడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

-Advertisement-ఎంబీబీఎస్ విద్యార్థుల విషయంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం?

Related Articles

Latest Articles