పవన్ ను ఓడించిన ఎమ్మెల్యేలకు జగన్ గిఫ్ట్…?

వైసీపీ అధికారంలోకి వచ్చి అప్పుడే దాదాపు రెండున్నరేళ్లు కావస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రమాణ స్వీకారానికి ముందుగానే రెండున్నరేళ్ల తర్వాత మరోసారి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని హింట్ ఇచ్చారు. అందుకనుగుణంగా మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ రిపోర్టు తెప్పించుకొని కొత్త క్యాబినెట్ కూర్పుపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

పరిస్థితులన్నీ అనుకూలిస్తే దసరా లేదంటే దీపావళి నాటికి ఏపీలో కొత్త క్యాబినెట్ కొలువుదీరడం ఖాయమనే టాక్ విన్పిస్తుంది. ఈనేపథ్యంలో ఆశావహులంతా జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్నవారికి తమ పదవి ఎక్కడ పోతుందననే బెంగపట్టుకున్నట్లు తెలుస్తోంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రెండుచోట్ల పోటీ చేయగా ఒక్కచోట కూడా గెలువలేదు. గాజువాక, భీమవరం రెండుస్థానాల్లో పవన్ కల్యాణ్ ను వైసీపీ అభ్యర్థులు ఓడించారు. విశాఖ జిల్లా గాజువాకలో పవన్ కల్యాణ్ కు 30,905 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి నాగిరెడ్డికి 34,712 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పవన్ కల్యాణ్ పై వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ 3,900ఓట్లతో విజయం సాధించాడు.

ఈ నేపథ్యంలోనే వీరిద్దరిలో ఒకరికి మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీకి కంచుకోటగా ఉన్న పశ్చిమగోదావరిలో వైసీపీ గత ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది. జిల్లాలోని 15స్థానాల్లో 13 స్థానాల్లో వైసీపీ కైవసం చేసుకుంది. ఈక్రమంలోనే ఈ జిల్లా నుంచి జగన్ క్యాబినెట్లో ముగ్గురికి చోటుదక్కింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆళ్ల నానికి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా తానేటి వనితకు, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా శ్రీరంగనాథరాజుకు ఛాన్స్ దక్కింది. త్వరలోనే కొత్త మంత్రివర్గం కొలువు దీరనుండటంతో ఈ మంత్రుల పనితీరును సీఎం జగన్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

వీరి పనితీరు ఆధారంగా ఒకరిద్దరికి ఉద్వాసన పలుకుతారని తెలుస్తోంది. ఈ స్థానంలో గ్రంథి శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం సమంజసమేనని పార్టీ పెద్దలు సైతం ఒప్పుకుంటున్నారట. దీనికితోడు జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ను ఓడిస్తే మంత్రి పదవి ఇస్తానని గ్రంథి శ్రీనివాస్ కు హామీ ఇచ్చారనే టాక్ విన్పిస్తుంది.

ఈ నేపథ్యంలోనే జగన్ క్యాబినెట్లో గ్రంథి శ్రీనివాస్ కు చోటుదక్కుతుందనే ప్రచారం సాగుతోంది. ఇందుకు తగ్గట్టుగా గ్రంథి శ్రీనివాస్ సైతం జనసేన కార్యకర్తలపై తరుచూ విరుచుకుపడుతున్నారు. తాజాగా జన సైనికులను ఆయన తాలిబన్లతో పోల్చడం దుమారం రేపింది. సీఎం జగన్ దృష్టిలో పడేందుకు ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.

పవన్ కల్యాణ్ ను ఓడించడం కంటే పెద్ద అచివ్మెంట్ ఏం ఉంటుందని గ్రంథి వర్గం అధిష్టానం ముందు తమ వాదనలు విన్పిస్తోంది. భీమవరంలో జన సైనికులను ఎదుర్కోవాలంటే మంత్రి పదవి ఉండాల్సిందేనని ఆయన వర్గం భావిస్తుందట. ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రంథి శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇస్తారా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

Related Articles

Latest Articles

-Advertisement-