పార్టీపై సీఎం జగన్ ఫోకస్.. కథ వేరే లెవల్?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కేవలం ప్రభుత్వ కార్యక్రమాలపైనే ఫోకస్ పెట్టారు. గడిచిన రెండున్నరేళ్లుగా ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నది పెద్దగా లేదు. అనునిత్యం ఏపీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపైనే దృష్టిసారించారు. ఆయన పాలనపై ప్రజలు సంతృప్తి చేస్తుండగా పార్టీలో మాత్రం కొంత గ్యాప్ వచ్చినట్లు కన్పిస్తుంది. దీనిని దూరం చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. ఈమేరకు పార్టీలోని ఎమ్మెల్యేలు, ఎంపీలకు వరుసగా అపాయింట్మెంట్ ఇస్తూ నేతల మధ్య విబేధాలు దూరం చేసేలా కసరత్తులు చేస్తున్నారు.

త్వరలోనే కొత్త క్యాబినెట్ విస్తరణ చేపట్టనున్నారు. యంగ్ టీంతోనే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈమేరకు పార్టీ నేతలకు కీలక సంకేతాలు సైతం ఇచ్చేశారు. త్వరలోనే పీకేం టీం కూడా రంగంలోకి దిగనుంది. దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మూడ్లోకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈక్రమంలోనే పార్టీలోని నేతల మధ్య ఉన్న విబేధాలను దూరం చేసేందుకు రెడీ అవుతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు వరుసగా అపాయింట్మెంట్ ఇస్తున్నారు.

గడిచిన రెండున్నరేళ్లుగా సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీపై పెద్దగా దృష్టిసారించలేదు. ఆ బాధ్యతలను ఆయా నియోజకవర్గాల ఇన్ ఛార్జిలకే కట్టబెట్టారు. కొన్నిచోట్ల విబేధాలు చక్కబడగా మరికొన్ని చోట్ల అసంతృప్తులు ఎక్కువయ్యాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేలు అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. అయితే జగన్ పాలన మూడ్లో ఉండటంతో ఇన్నాళ్లు పట్టించుకోలేదు. ఇప్పుడు విభేదాలు రచ్చకెక్కుతుండడంతో మొదట పార్టీని సెట్ రైట్ చేసే పనిలో పడ్డారు. ఈమేరకు వారిని పిలిచి మాట్లాడేందుకు సీఎం జగన్ రెడీ అవుతున్నారు.

పలు జిల్లాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య పొసగడం లేదు. దీంతో ఒకరిపై ఒకరు అధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాలు కొన్ని జిల్లాల్లో పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయి. కొంతకాలంగా పార్లమెంట్ సభ్యులు యాక్టివ్ గా ఉండటం లేదు. కొంత మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గ పర్యటనలకు ఎంపీలను అనుమతించడం లేదు. దీంతో వీరిమధ్య విభేదాలు నెలకొంటున్నాయి. ఈ గ్యాప్ ను దూరం చేసేందుకే సీఎం జగన్మోహన్ కసరత్తులు చేస్తున్నారు. ఈ అవకాశమే కోసమే ఎంపీలు సైతం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో పార్లమెంట్ సమావేశాలకు ముందు సీఎం జగన్మోహన రెడ్డి నేతలతో అక్కడ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేవారు. అంతేగానీ వారి సాదకబాధలను తెలుసుకోలేదన్న విమర్శలున్నాయి. అయితే తాజాగా మూడురోజులు పాటు ఎంపీలతో సమీక్ష నిర్వహించేందుకు సీఎం రెడీ అయ్యారు. దీంతో తమ బాధలను చెప్పుకునేందుకు ఎంపీలకు అవకాశం దొరికినట్లయ్యింది. అలాగే నియోజకవర్గంలోని ఎంపీ ల్యాడ్స్ ఖర్చులపై సీఎం జగన్ ఆరా తీసే అవకాశం ఉందని సమాచారం. ఆ మేరకు నేతలు సైతం తమ జాబితాను సిద్ధం చేసుకుంటున్నారు.

పార్టీని గాడిలో పెట్టేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి వరుసగా నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వడం ఆసక్తిని రేపుతోంది. మరోవైపు ప్రభుత్వ కార్యక్రమాలతోపాటు పార్టీ కార్యక్రమాలపై కూడా ఆయన ఫోకస్ పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇదంతా చూస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మూడ్లోకి వెళ్లినట్లే కన్పిస్తోందని ఆపార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఏదిఏమైనా సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీలోని విబేధాలను దూరం చేసేందుకు సమయం కేటాయించడంతో ముఖ్యనేతలతోపాటు, శ్రేణుల్లో జోష్ నెలకొంది.

-Advertisement-పార్టీపై సీఎం జగన్ ఫోకస్.. కథ వేరే లెవల్?

Related Articles

Latest Articles