రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి.. టీ కాంగ్రెస్ చీలిక..!

టీపీసీసీ కొత్త చీఫ్ నియామకం కోసం కాంగ్రెస్ అధిష్టానం గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీ కసరత్తులు చేసింది. చాలా టైం తీసుకొని మరీ కొత్త పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని ప్రకటించింది. అయితే టీపీసీసీ పదవి తనకే దక్కుతుందని మొదటి నుంచి ఆశపడి భంగపడ్డ కోమటిరెడ్డి మాత్రం రేవంత్ నాయకత్వాన్ని ఒప్పుకునే సమస్యే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో వీలుచిక్కినప్పుడల్లా రేవంత్ పై విమర్శలు చేయడంతోపాటు టీపీసీసీ నిర్ణయాలను ధిక్కరిస్తూ కాంగ్రెస్ అధిష్టానానికి సవాల్ విసురుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది.

రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి తొలినాళ్లలోనే తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్యం ఠాకూర్ డబ్బులకు అమ్ముడుపోయాడంటూ కోమటిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయి షోకాజ్ నోటీసు సైతం జారీ చేసింది. కొన్నిరోజులకు ఈ ఇష్యూ సద్దుమణిగింది. మరోవైపు టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. తనకంటూ ఓ టీంను రెడీ చేసుకొని ప్రత్యర్థి పార్టీలపై దూకుడుగా వెళుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటన చేస్తూ కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి దూకుడుతో నిస్తేజంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులు మళ్లీ పట్టాలెక్కినట్లే కన్పిస్తున్నాయి. రేవంత్ రెడ్డికి కార్యకర్తల నుంచి ఫుల్ సపోర్టు లభిస్తుండగా కాంగ్రెస్ సీనియర్ల నుంచి పెద్దగా సహకారం లభించడం లేదనే టాక్ విన్పిస్తుంది. రేవంత్ రెడ్డి మాత్రం క్రమంగా ఒక్కో సీనియర్ నాయకుడిని మెల్లిగా తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే హైదరాబాద్లో వైఎస్ విజయమ్మ వైఎస్ఆర్ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె వైఎస్ఆర్ క్యాబినెట్లో పనిచేసిన మంత్రులు, ఇతర ఎమ్మెల్సేలను, ఆప్తులను ఆహ్వానించారు.

వైఎస్ విజయమ్మ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనం తన కూతురు షర్మిల రాజకీయ పార్టీ కోసమే చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి ఆయన తీసుకెళ్లారు. దీంతో వైఎస్ఆర్ సమ్మేళనానికి కాంగ్రెస్ నేతలు ఎవరూ వెళ్లకూడదని అధిష్టానం డైరెక్షన్లో టీపీసీసీ నిర్ణయించింది. దీనిని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధిక్కరిస్తూ వైఎస్ఆర్ ఆత్మీయ సమ్మేళానికి వెళ్లారు. అంతేకాకుండా మూడురోజుల ముందు నుంచి వైఎస్ విజయమ్మ ఆహ్వానాలు పంపుతుంటే పీసీసీ నిద్రపోయిందా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడిని ఆయన సంస్మరణ సభకు వెళ్లొద్దు అని చెప్పడానికి మీరేవరు? అన్న రేంజులో రేవంత్ పై ఫైరయ్యారు. కోమటిరెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో రేవంత్ రెడ్డి వర్గం ఆయనపై ఎదురుదాడికి దిగింది.

టీపీసీసీ ఆదేశాలను కోమటిరెడ్డి ధిక్కరించడంపై టీ పీసీసీ ఢిల్లీకి ఫిర్యాదు చేసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు. మరోవైపు ప్రచార కమిటీ అధ్యక్షుడిగా ఉన్న మధు యాష్కీ కూడా కోమటిరెడ్డిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన బయటికి వెళ్లాలనుకుంటే వెళ్లిపోవచ్చని.. వెన్నుపోటు పొడవొద్దంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం వివాదానికి ఆజ్యం పోసింది. తాజా పరిణామాల నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒంటరి వాడయ్యాడని అందరూ భావించారు. ఈ తరుణంలోనే కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి పార్టీలో కోమటిరెడ్డి ఒంటరివాడు కాదని చెప్పే ప్రయత్నం చేశారు.

కోమటిరెడ్డి చేసింది తప్పుకాదని ఆయనకు మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీలో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉందన్నారు. కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య నెలకొన్న గ్యాప్ ను పూడ్చే ప్రయత్నం చేస్తున్నామని ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా చంద్రబాబుకు ఎమ్మెల్యే సీతక్క రాఖీ కట్టడం కూడా తప్పుకాదని ఇరువర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే కాంగ్రెస్ సీనియర్లే కోమటిరెడ్డి కేంద్రంగా రాజకీయాలకు పాల్పడుతున్నారనే విమర్శలు సైతం విన్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ రెండుగా చీలిపోయిందా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఏదిఏమైనా వైఎస్ విజయమ్మ నిర్వహించిన వైఎస్ఆర్ సమ్మేళనం కాంగ్రెస్ పార్టీలో పెద్ద దుమారాన్నే రేపినట్లు కన్పిస్తుంది.

Related Articles

Latest Articles

-Advertisement-