రివ్యూ : సినిమా బండి

ఆ మ‌ధ్య ఆహా ఓటీటీ కోసం స్వ‌ప్న సినిమా సంస్థ మెయిల్ అనే చిత్రాన్ని నిర్మించింది. కంప్యూట‌ర్స్ కొత్త‌గా వ‌చ్చిన కాలంలో ఓ ప‌ల్లెటూరి పిల్ల‌గాడు దానితో ఎలాంటి ఇబ్బందులు ప‌డ్డాడు అనే అంశాన్ని చ‌క్క‌ని ప్రేమ‌క‌థ‌తో మిళితం చేసి తీశారు. అలానే ఇప్పుడు ప్ర‌వీణ్ కాండ్రేగుల‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం చేస్తూ ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత‌లు రాజ్, డి.కె. సినిమా బండి చిత్రం నిర్మించారు. ప‌ల్లెటూరిలో ఆటో న‌డుపుకునే ఓ వ్య‌క్తికి కెమెరా దొరికితే దానితో ఎలాంటి పాట్లు ప‌డ్డాడ‌న్న‌దే ఈ సినిమా క‌థ‌. మే 14వ తేదీ నుండి ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఆంధ్ర‌, క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దులోని గొల్ల‌ప‌ల్లి అనే ప‌ల్లెటూరిలో ఈ క‌థ సాగుతుంది. వీర‌బాబు (వికాస్ విశిష్ట‌) ఓ ఆటో డ్రైవ‌ర్. భార్య గంగోత్రి (సిరివెన్నెల య‌న‌మద‌ల‌), ఓ పాప ఉంటారు. ఓ రోజు అత‌ని ఆటోలో ఎవ‌రో కాస్ట్లీ కెమెరా మ‌ర్చిపోతారు. దానిని అద్దెకు తిప్పాల‌ని మొద‌ట్లో అనుకున్నా, ఊరిలోనే ఉన్న త‌న ఫ్రెండ్, స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్ గ‌ణ‌ప‌తి (సందీప్ వార‌ణాసి) సాయంతో సినిమా తీస్తే ఎలా ఉంటుంద‌నే ఆలోచ‌న వీర‌బాబుకు క‌లుగుతుంది. ప‌ల్లెటూరి నేప‌థ్యంలో తీసే సినిమాలు సైతం వంద కోట్లు వ‌సూలు చేస్తున్నాయ‌ని సినిమా న్యూస్ లో చూసి, అందుకు ఫిక్స్ అయిపోతాడు వీర‌బాబు. అదే ఊరిలో సెలూన్ న‌డిపే మ‌రిడేష్ (రాగ మ‌యూర్)ను హీరోగా, కూర‌గాయ‌లు అమ్మే అత‌ని ప్రియురాలు మంగ (ఉమా)ను హీరోయిన్ గా పెట్టి సినిమా మొద‌లెట్టేస్తారు. నాడా దొరికింద‌ని గుర్రం కొన‌డానికి వెళ్లిన సామెత త‌ర‌హాలో కెమెరా దొరికింద‌ని సినిమా మొద‌లెట్టిన వీర‌బాబు, గ‌ణ‌ప‌తికి నిజంగానే బోలెడ‌న్ని సినిమా క‌ష్టాలు ఎదుర‌వుతాయి. వాటిని ఎదుర్కొని వీళ్ళు సినిమా పూర్తి చేశారా లేదా? పోగొట్టుకున్న కెమెరాను వెతుక్కుంటూ వ‌చ్చిన వాళ్ళ‌కు అది దొరికిందా? లేదా? అనేది మిగ‌తా క‌థ‌.

సినిమా మేకింగ్ మేడ్ సింపుల్ అని చాలామంది భావిస్తుంటారు. డ‌బ్బులుంటే సినిమా తీయొచ్చ‌నేది కొంద‌రి న‌మ్మ‌కం. ఇక కొంద‌రైతే చేతిలో చిల్లిగ‌వ్వ‌లేక‌పోయినా, మాట‌లు జాస్తిగా చెప్పేసి, ఎక్క‌డ నుండో డ‌బ్బు పుట్టించి, సినిమాలు తీసేస్తుంటారు. నిజానికి సినిమాకు తీయ‌డానికి డ‌బ్బులు, మాట‌కారి త‌నంతో పాటు పేష‌న్ అనేది ఉండాలి. అప్పుడే ఆ తీసే సినిమాలో జీవం ఉంటుంది. అది ఉండి సినిమా మొదలు పెడితే, ఎన్ని క‌ష్టాలు వ‌చ్చినా త‌ట్టుకునే ఆత్మ‌స్థైర్యం ఆటోమెటిగ్గా క‌లుగుతుంది. ఇందులో వీర‌బాబుకు ఫిల్మ్ మేకింగ్ గురించి ఏమీ తెలియ‌క‌పోయినా, ఏదో చేయాల‌నే త‌పన అత‌న్ని ల‌క్ష్యం వైపు న‌డిపించింది. ప్ర‌కృతి కొన్ని సమ‌యాల్లో స‌హ‌క‌రించ‌కపోయినా, అత‌ని మ‌నోబ‌లం చూసి గ్రామ‌మంతా అత‌ని వెనుక నిలిచింది. సినిమా తీసి తాను బాగుప‌డాల‌ని కాకుండా… త‌న ఊరిని బాగుచేయాల‌నే అతని ల‌క్ష్యం అత‌నంటే గిట్ట‌ని వాళ్లు సైతం మ‌న‌సు మార్చుకుని స‌హాయ‌ప‌డేలా చేసింది. మ‌రి ఇంత చేస్తే… ఆ సినిమా ఎలా తీసినా… జ‌నాద‌ర‌ణ పొంద‌కుండా ఎలా ఉంటుంది!?

సినిమా బండి మూవీ విష‌యంలోనూ అదే జ‌రిగింది. ద‌ర్శ‌కుడిలోని పేష‌న్ ను గ‌మ‌నించి నిర్మాత‌లు రాజ్, డీకే స‌హ‌క‌రించ‌డంతో ఓ చ‌క్క‌ని గ్రామీణ క‌థా చిత్రం రూపుదిద్దుకుంది. న‌టీన‌టుల ఎంపిక చాలా బాగుంది. అంతే కాదు… వారంతా స‌హ‌జంగా న‌టించారు. సంభాష‌ణ‌లూ అలానే ఉన్నాయి. స‌త్య‌వోలు శిరీష్ ఈ సినిమా కోసం ఓ పాట రాసి, త‌నే స్వ‌రాలు స‌మ‌కూర్చి, పాడాడు. మ‌రో పాట‌ను వరుణ్ రెడ్డి స్వ‌ర‌ప‌ర‌చ‌గా రోల్ రైడాతో క‌లిసి త‌రుణ్ భాస్క‌ర్ పాడ‌టం విశేషం. ఈ పాటలు సినిమాలో స‌న్నివేశాల‌కు ద‌న్నుగా నిలుస్తూ అక్క‌డ‌క్క‌డా వ‌చ్చివెళ‌తాయి. ఇక ప‌ల్లెటూరి అందాల‌ను, అమాయ‌క జీవుల హావ‌భావాల‌ను కె. అపూర్వ సాలిగ్రామ్, వైవివి సాగ‌ర్ చ‌క్క‌గా క్యాప్చ‌ర్ చేశారు. కాక‌ర్ల ధ‌ర్మేంద్ర‌, గ‌రిజాల ర‌వితేజ ఎడిటింగ్ కూడా షార్ప్ గా ఉంది. అనవ‌స‌ర‌మైన సన్నివేశాలు లేకుండా సినిమా చక‌చ‌కా సాగిపోయేలా చేశారు. కేవ‌లం 98 నిమిషాలు నిడివి ఉన్న ఈ సినిమా మ‌న‌ల్ని ఓ ప‌ల్లెటూరిలోకి తీసుకెళ్ళి మ‌ధ్య‌లో నిలిచో పెడుతుంది. తెలిసీ తెలియ‌ని త‌నంతో వీర‌బాబు, గణ‌ప‌తి సినిమా తీయ‌డానికి నానా క‌ష్టాలు ప‌డుతుంటే ఓ వైపు న‌వ్వు వ‌స్తుంది, మ‌రోవైపు మ‌న‌సులో తెలియ‌ని బాధా క‌లుగుతుంది. సినిమా పూర్తి అయిపోయిన త‌ర్వాత ఈ గొల్ల‌ప‌ల్లి వారి చిత్రం చూసి తృప్తి చెందుతాం. కాక‌పోతే… ఇంకాస్తంత వినోదాన్ని ఆ యా పాత్ర‌ల ద్వారా రాబ‌ట్టొచ్చు కానీ ద‌ర్శ‌క ర‌చ‌యిత‌లు ఎందుకో ఆ ప‌ని చేయ‌లేదు.

నిజానికి ఈ సినిమాను థియేట్రిక‌ల్ రిలీజ్ కోసం రాజ్ అండ్ డీకే నిర్మించార‌ట‌. కానీ అలా చేయ‌కుండా ఓటీటీలో విడుద‌ల చేయ‌డ‌మే స‌రైనా నిర్ణ‌యంగా అనిపిస్తోంది. ఇదే థియేట‌ర్ల‌లో విడుద‌లై ఉంటే… క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ విష‌యంలో సందేహ ప‌డాల్సి వ‌చ్చేది. ఇలాంటి సినిమాలు ఓటీటీకే క‌రెక్ట్! ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ కాండ్రేగుల నుండి రాబోయే రోజుల్లో మ‌రిన్ని సెన్సిబుల్ సినిమాల‌ను ఆశించొచ్చు.

రేటింగ్: 2.75 / 5

ప్ల‌స్ పాయింట్స్
న‌టీన‌టుల స‌హ‌జ న‌ట‌న‌
సినిమాటోగ్ర‌ఫీ, సంగీతం
ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌
సినిమా నేప‌థ్యం

మైనెస్ పాయింట్స్
యాస‌ను ప‌ట్టుకోవ‌డం క‌ష్టం
వినోదానికి ప‌రిమితులు పెట్టుకోవ‌డం

ట్యాగ్ లైన్: న‌వ్వులు పంచే సినిమా బండి!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-