అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన మరో స్టార్ క్రికెటర్

దక్షిణాఫ్రికా స్టార్ క్రికెట్ ఆల్​రౌండర్ క్రిస్ మోరిస్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 34 ఏళ్ల మోరిస్ 12 ఏళ్ల కెరీర్‌కు ముగింపు పలికాడు. మూడు ఫార్మాట్లలో సఫారీ జట్టు తరఫున 69 మ్యాచ్‌లు ఆడిన మోరిస్ బౌలింగ్‌లో 94 వికెట్లు పడగొట్టాడు. 2012 డిసెంబర్‌లో టీ20ల్లో అరంగ్రేటం చేశాడు. తర్వాత ఏడాది వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే అతడు టెస్టు అరంగ్రేటం కోసం చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది. 2016లో టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.

ఇప్పటివరకు నాలుగు టెస్టులు మాత్రమే ఆడి 173 పరుగులు చేశాడు. 12 వికెట్లు పడగొట్టాడు. 42 వన్డేల్లో 48 వికెట్లు, 467 పరుగులు… 23 టీ20ల్లో 133 పరుగులు, 34 వికెట్లు సాధించాడు. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే… రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, చెన్నై సూపర్‌కింగ్స్ జట్ల తరఫున ఆడాడు. గత ఐపీఎల్ మెగా వేలంలో మోరిస్‌ను రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ.16.5 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా త్వరలో తాను దేశవాళీ టీ20 జట్టు ‘టైటాన్స్’కు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు సోషల్ మీడియా​వేదికగా మోరిస్ వెల్లడించాడు.

Related Articles

Latest Articles