బిగ్ బ్రేకింగ్: ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూత

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ అనారోగ్యంతో ఆదివారం రాత్రి 8 గంటలకు కన్నుమూశారు. కొద్దిరోజుల కిందట ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. 75శాతం ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకడంతో డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఆయన ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఈరోజు తుదిశ్వాస విడిచారు. శివశంకర్ మాస్టర్ కుటుంబం ఆర్ధిక పరిస్థితి బాగోకపోవడంతో నటుడు సోనూసూద్, తమిళ హీరో ధనుష్, మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు సహాయం అందించారు. అయినా మాస్టర్‌ ప్రాణాలు దక్కలేదు. 

కాగా శివశంకర్‌ మాస్టర్‌ వయసు 72 ఏళ్లు. ఆయన కొరియోగ్రాఫర్‌గా దేశంలోని అన్ని భాషల్లో సుపరిచితుడు. తెలుగుతో పాటు 10 భాషలకు పైగానే కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ముఖ్యంగా దక్షిణాదిలో పలు చిత్రాలకు ఆయన నృత్యరీతులు సమకూర్చారు. ఇప్పటి వరకు ఆయన దాదాపు 800 చిత్రాలకుపైగానే డ్యాన్స్‌ మాస్టర్‌గా పనిచేశారు. పలుభాషల్లో ఉత్తమ అవార్డులు తీసుకున్నారు. తెలుగులో ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర చిత్రానికి ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా జాతీయ ఫిల్మ్‌ అవార్డు అందుకున్నారు. శివశంకర్ మాస్టర్ మరణవార్త విని పలువురు టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Latest Articles