మెగాభిమానుల‌కు చిరంజీవి స్పెషల్ థ్యాంక్స్

క‌రోనా క్రైసిస్ సెకండ్ వేవ్ స‌మ‌యంలో ఆక్సిజ‌న్ బ్యాంకుల్ని స్థాపించి మెగాస్టార్ చిరంజీవి ఇరు తెలుగు రాష్ట్రాల్లో సేవ‌లందించిన సంగ‌తి తెలిసిందే. ఈ సేవ‌ల్లో అన్ని జిల్లాల నుంచి మెగాభిమాన సంఘాల ప్ర‌తినిధులు పాలుపంచుకున్నారు. అందుకే ఆదివారం రోజు తెలంగాణ జిల్లాల నుంచి ఆక్సిజ‌న్ సేవ‌ల్లో పాల్గొన్న ప్ర‌తినిధుల్ని పిలిచి మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. హైద‌రాబాద్ లోని చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ వేదిక‌గా ఈ కార్య‌క్ర‌మం జరిగింది.

ఈ వేదిక‌పై అఖిల భార‌త చిరంజీవి యువ‌త అధ్య‌క్షుడు మహేష్ చింతామణి మరియు ర‌మ‌ణం స్వామినాయుడు చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ లో చిరంజీవి ఆక్సిజ‌న్ బ్యాంకుల నిర్వాహ‌కులు స‌మావేశ‌మ‌య్యారు. ఈ సందర్బంగా అఖిల భార‌త చిరంజీవి యువ‌త అధ్య‌క్షుడు మహేష్ చింతామణి మాట్లాడుతూ “క‌రోనా క‌ష్ట కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌జ‌ల్ని కాపాడేందుకు చిరంజీవి గారు ఆక్సిజ‌న్ సిలిండ‌ర్స్ స‌ర‌ఫ‌రా కార్య‌క్ర‌మం చేశారు. అభిమానుల ద్వారానే ఇవి స‌ర‌ఫ‌రా అయ్యాయి.

తాజాగా తెలంగాణ‌ జిల్లాల నుంచి అభిమానులంద‌రినీ పిలిచి చిరంజీవి గారు అభినందించారు. వీరు చేసిన సేవ‌ల్ని కొనియాడి సైనికులుగా అభివ‌ర్ణించారు. నా కోసం ప్రాణాలిస్తాన‌ని అనే అభిమానులు మీరే ప్రాణాల్ని కాపాడినందుకు అభినందిస్తున్నానని రాబోవు కాలంలో పేద‌ల‌ను ఆదుకునేందుకు అభిమానుల స‌హ‌కారం కావాల‌ని చిరంజీవి గారు కోరారు. అభిమానులంతా మెగాస్టార్ కు అండ‌గా నిలుస్తామ‌ని ప్ర‌మాణం చేశారు. తెలంగాణ అన్ని జిల్లాల నుంచి క‌ర్నాట‌క – ఒరిస్సా నుంచి చిరంజీవి అభిమాన సంఘాల ప్ర‌తినిధులు విచ్చేశారు“ అని తెలిపారు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ-క‌రోనా క‌ష్ట‌కాలంలో నా అభిమానుల్ని కోల్పోయి చాలా ఆవేద‌న చెందాను. క‌రోనా భారిన ప‌డి దుర‌దృష్ట వ‌శాత్తు.. ప్ర‌సాద్ - హిందూపురం.. ఎర్రా నాగ‌బాబు- అంబాజీపేట. ర‌వి - క‌డ‌ప వీరంద‌రినీ కోల్పోయాను. క‌రోనా పొట్ట‌న పెట్టుకుని విషాదాన్ని మిగిల్చింది. వారి ఆత్మ‌కు శాంతి చేకూరాలి అని అన్నారు. క‌రోనా విల‌యం ఎంతో మార్చేసింది. ఇక ఈ క‌ష్ట కాలంలో తాను అండ‌గా నిలుస్తాన‌ని నా స్నేహితుడు శేఖ‌ర్ ముందుకొచ్చారు. త‌న విరామ స‌మ‌యాన్ని సేవా కార్య‌క్ర‌మాల‌కు అంకిత‌మిస్తాన‌ని అన్నారు. అత‌డిని చిరంజీవి ఐ అండ్ బ్ల‌డ్ బ్యాంక్ ఛీఫ్ ఫైనాన్షియ‌ల్ ఆఫీస‌ర్ గా నియ‌మించాం. స్వామినాయుడు కూడా అతనితో క‌లిసి ప‌ని చేస్తాడు. చెన్నైలో త‌న కెరీర్ సాగుతున్న‌ప్ప‌టి నుంచి శేఖ‌ర్ త‌న‌కు స్నేహితుడు అని ఒక అభిమానిగా వెన్నుద‌న్నుగా నిలిచాడ‌ని చిరంజీవి తెలిపారు.

Related Articles

Latest Articles