ఇంజినీర్‌ను కిడ్నాప్‌ చేసిన మావోయిస్టులు.. అడవికి వెళ్లి విడిపించుకున్న భార్య..!

కొన్ని సినిమాల్లో చూశాం.. అధికారిగా ఉన్న హీరోను ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేయడం.. అతడిని విడిపించడానికి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేసి విఫలం అవ్వడం.. ఇక, నేరుగా భార్యే రంగంలోకి దిగి.. ఉగ్రవాదుల నుంచి తన భర్తను విడిపించుకోవడం.. ఇలాంటి ఘటనే ఒకటి ఇప్పుడు వెలుగు చూసింది.. మావోయిస్టులు కిడ్నాప్‌ చేసిన తన భర్తను విడిపించడానికి అధికారులు, ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో.. తన కొడుకుతో అడవికి వెళ్లి.. తన భర్తను కాపాడుకుంది ఓ ఇల్లాలు.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్‌ లోని బీజాపూర్‌ జిల్లా మాంకేలీ సమీపంలోని ఘట్‌కేర్నీలో రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించేందుకు వెళ్లిన సబ్‌ ఇంజనీర్‌ అజయ్‌రోషన్, అటెండర్‌ లక్ష్మణ్‌ను ఈ నెల 11వ తేదీన కిడ్నాప్‌ చేశారు మావోయిస్టులు.. అయితే, మరుసటి రోజు లక్ష్మణ్‌ను వదిలిపెట్టినా.. సబ్‌ ఇంజనీర్‌ను తమ దగ్గరే పెట్టుకున్నారు.

Read Also: ఏపీలో సముద్ర తీరంలో బంగారం.. ఎగబడుతున్న జనం..!

మరోవైపు ఆ సబ్‌ ఇంజినీర్‌ను మావోయిస్టుల చెర నుంచి అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు… దీంతో.. ఆయన భార్యే రంగంలోకి దిగింది.. కొందరు మీడియా ప్రతినిధులతో కలిసి అడవి బాట పట్టింది.. రెండేళ్ల కుమారుడితోపాటు అడవిలో అన్నల వద్ద ఉన్న తన భర్త కొరకు బయల్దేరింది.. ప్రాణాలకు తెగించి భర్త కోసం అడవిని జల్లెడ పట్టింది.. ఈ నెల 13, 14, 15, 16వ తేదీల్లో మీడియా ప్రతినిధులతో కలిసి బైక్‌పై అటవీ ప్రాంతంలోని ఆదివాసీ గూడేల్లో భర్త కోసం వెతికింది.. రోజుకు 30-40 కిలోమీటర్లు ప్రయాణం సాగించారు.. చివరకు ఐదు రోజులకు మావోయిస్టుల శిబిరానికి చేరుకున్న సబ్‌ ఇంజినీర్‌ భార్య అంకిత.. మావోయిస్టులతో చర్చలు జరిపింది.. మీడియా సమక్షంలో జరిగిన ఈ చర్చలు సఫలం అయ్యాయి.. ఇక, ప్రజాకోర్టు నిర్వహించిన మావోయిస్టులు.. అనంతరం సబ్‌ ఇంజినీర్‌ అజయ్‌ను విడిచిపెట్టారు.. తన భర్త ప్రాణాలకు హాని తలపెట్టకుండా విడిచిపెట్టినందుకు మావోయిస్టులకు కృతజ్ఞతలు తెలిపింది అంకిత.. మావోయిస్టులతో చర్చలు జరపడంలో.. స్థానిక మీడియా ప్రతినిధులతో పాటు స్థానికులు కూడా కీలక పాత్ర పోషించారని చెబుతున్నారు. ఇక, తన భర్తను చూసి తీవ్ర ఉద్వేగానికి లోనై.. ఆయన కౌగిట్లో ఒదిగిపోయింది అంకిత.. అయితే, వారం రోజులుగా మావోయిస్టుల చెరలో ఉన్న అజయ్‌ రోషన్‌ అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు చెబుతున్నారు.

Related Articles

Latest Articles