ముఖ్యమంత్రి తండ్రి అరెస్ట్.. సమర్థించిన సీఎం, ఎవరూ అతీతులు కాదు..

ఓ సీఎం తండ్రిపై కేసు నమోదు కావడమే సంచలనంగా మారగా.. ఇప్పుడు ఏకంగా అరెస్ట్ చేయడం చర్చగా మారింది.. ఇక, ఆ అరెస్ట్‌ను సీఎం సమర్థించారు.. చట్టం ముందు సమానులేనని స్పష్టం చేశారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘెల్‌ తండ్రి నంద్‌కుమార్‌ బఘెల్‌ను ఇవాళ పోలీసులు అరెస్ట్‌ చేయడం సంచలనం రేపింది. బ్రహ్మణులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ.. చత్తీస్‌గఢ్‌ పోలీసులు.. ఆయనను అరెస్ట్‌ చేశారు. బ్రహ్మణ సంఘం నేతల ఫిర్యాదుతో నంద్‌కుమార్‌ ను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు రాయ్‌పూర్ కోర్టు 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

కాగా, నంద్‌ కుమార్ బఘెల్‌ తమను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ.. బ్రాహ్మణులు రాయ్‌పూర్‌లోని డీడీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బ్రాహ్మణులు బయటివారనీ.. విదేశీయులనీ.. వారు తమను తాము సంస్కరించుకోవాలని… లేదంటే గంగ నుంచి వోల్గాకు వెళ్లడానికి సిద్ధం కావాలని నంద కుమార్ వ్యాఖ్యానించినట్టు బ్రాహ్మణ సమాజం నేతలు ఆరోపించారు. దీంతో, రాయ్‌పూర్ పోలీసులు నంద కుమార్ బాఘెల్‌‌పై కేసు నమోదు చేసి.. అరెస్టు చేశారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది. సమాజంలో నందకుమార్‌ విద్వేషాలను వ్యాపింపజేస్తున్నారని.. ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని బ్రాహ్మణులు.. తమకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఇక, తండ్రి నంద కుమార్ అరెస్టుపై స్పందించారు ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌.. తన తండ్రి అంటే గౌరవం ఉందన్న సీఎం.. తన ప్రభుత్వంలో ఎవరూ చట్టానికి అతీతులు కాదని స్పష్టం చేశారు. ఓ కుమారునిగా తన తండ్రిని గౌరవిస్తాననీ… కానీ, ప్రజా భద్రతకు భంగం కలిగించేలా ఉన్న ఆయన పొరపాట్లు ఉపేక్షించరానివని చెప్పారు.

Related Articles

Latest Articles

-Advertisement-