జగన్ కు.. మోడీకి అడ్డుగా చంద్రబాబు నిలుస్తున్నారా?

40 ఇయర్స్ ఇండస్ట్రీ.. అపార చాణిక్యుడినంటూ చెప్పుకునే చంద్రబాబు చేసిన తప్పే మళ్లీ చేస్తుండటం విస్మయానికి గురిచేస్తోందని రాజకీయవర్గాల్లో హాట్ హాట్ చర్చ సాగుతోంది. గతంలో ఆయన నమ్ముకున్న రెండుకళ్ల సిద్ధాంతం బెడిసి కొట్టి చివరికి రాష్ట్ర విభజనకు దారితీసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. దాని నుంచి ఆయన ఏం గుణపాఠం నేర్చుకున్నారో ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆయన మళ్లీ మళ్లీ అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ అందరినీ కన్ఫ్యూజన్ చేస్తున్నారని అంటున్నారు. బాబుది వ్యూహామో.. మరేంటో తెలియదుగానీ ఆయన వల్ల ఏపీ రాజకీయాలు మాత్రం అస్తవ్యస్తంగా మారాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ పగ్గాలు చంద్రబాబు చేతికి వచ్చాక ఆయన ఏ ఎన్నికలోనూ ఒంటరిగా పోటీ చేసిన దాఖలాల్లేవు. ప్రతీ ఎన్నికల్లోనూ ఏదో ఒక పార్టీతో పొత్తుతో ముందుకెళుతున్నారు. చివరికీ ఏ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ పుట్టిందో ఆపార్టీతోనే గత ఎన్నికల్లో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. ఇది ఆయనకు కలిసిరాకపోగా దారుణంగా దెబ్బతీసింది. దీంతో ఎన్నికల తర్వాత నుంచి చంద్రబాబు ఆ కూటమికి దూరంగా ఉంటున్నారు. మరోవైపు బీజేపీకి దగ్గరయ్యేందుకు పావులు కదుపుతున్నారు. దీంతో ఆయన వచ్చే ఎన్నికల్లో ఏ కూటమితో వెళుతారనేది మాత్రం సందేహంగా మారింది.

గత ఎన్నికల ముందు బీజేపీకి హ్యండిచ్చి చంద్రబాబు కాంగ్రెస్ కూటమికి దగ్గరయ్యారు. జాతీయ స్థాయిలో విపక్షాలను ఏకంచేసి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అయితే ఆ ఎన్నికల్లో చంద్రబాబు మద్దతు ఇచ్చిన కూటమి అనుకున్న ఫలితాలు సాధించలేదు. బీజేపీ రెండోసారి అధికారంలోకి రావడంతో చంద్రబాబును దూరం పెడుతూ వచ్చింది. ఇదే సమయంలో వైసీపీకి దగ్గర అవుతూ వస్తోంది. జగన్ తో కలిసి నడిచేందుకే బీజేపీ మొగ్గుచూపుతోంది. జగన్ సైతం బీజేపీ విషయంలో సానుకూలంగానే ఉన్నారు. అయితే వీరిద్దరు కలువడం ఇష్టంలేని బాబు వీలుచిక్కినప్పుడల్లా బీజేపీకి కన్నుగొడుతున్నారు.

కొంతకాలంగా ఆయన బీజేపీ నిర్ణయాలకు వత్తాసు పలుకుతూ ఆపార్టీని ముగ్గులోకి లాగేందుకు యత్నిస్తున్నారు. వారు అడగకపోయినా కొన్ని ఆఫర్లు ఇస్తున్నారు. అయితే బాబు ఎఫ్పుడు, ఎవరివైపు ప్లేట్ ఫిరాయిస్తారో తెలియదని.. అందుకే ఆయనకు దూరంగా ఉంటేనే బెటరని మోదీ, అమిత్ షాలు భావిస్తున్నారట. దీంతో ఆయనతో కంటే వైసీపీతోనే వచ్చే ఎన్నికలకు వెళ్లడం మంచిదని బీజేపీ భావిస్తుందట. దీంతో బాబు ఎన్నిసార్లు కన్నుగొట్టిన బీజేపీ అటువైపు చూడటం లేదు. మరోవైపు మోదీ గ్రాఫ్ క్రమంగా పడిపోవడంతో బాబు జాతీయ స్థాయిలో విపక్ష పార్టీలతో అంతే సన్నిహితంగా ఉంటుండటం గమనార్హం.

చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఆయన ఏ పార్టీతో వెళుతారనే ఇప్పటికీ కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. కేంద్రంలో మోదీ అధికారంలో ఉండటంతోనే చంద్రబాబు ఇలా వ్యవహరిస్తున్నారనే టాక్ విన్పిస్తోంది. ఏదిఏమైనా చంద్రబాబు డేరింగ్ నిర్ణయాలు తీసుకోకుండా పక్కచూపులు చూస్తుండటమే టీడీపీ శ్రేణులకు పెద్దగా నచ్చడం లేదట. గతంలో చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతం ఏపీకి ఎంత నష్టం చేకూర్చిందో ఇప్పుడు చంద్రబాబు డ్యూయల్ రోల్ కూడా అదే స్థాయిలో పార్టీకి నష్టం చేకూరుస్తుందా? అని టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. మొత్తానికి బాబుగారి కన్ఫ్యూజన్ రాజకీయాలు చివరికీ ఎలాంటి మలుపు తిరుగుతాయో వేచిచూడాల్సిందే..!

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-