పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పంలో రెండోరోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఒక్క ఛాన్స్ ఇస్తే… జగన్ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆయన మండిపడ్డారు. ఓటీఎస్‌లాగా జగన్‌కు ప్రజలు వన్ టైం పాలనను అందించారన్నారు. వైసీపీ వాళ్లు కొత్త బిచ్చగాళ్లు అని.. వాళ్లకు చరిత్ర తెలియదని ఎద్దేవా చేశారు. పొత్తులపై వైసీపీ నేతలవి పనికిమాలిన వ్యాఖ్యలు అని ఆరోపించారు. తాము గతంలో పొత్తులతో గెలిచామని.. పొత్తులు లేకుండా కూడా గెలిచామని గుర్తుచేశారు. ఒక్కోసారి పొత్తులు ఉన్నా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయన్నారు. పొత్తులు అనేవి రాష్ట్రంలోని పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటాయని చంద్రబాబు వివరించారు. ఇప్పుడు ఏపీ ఉన్న పరిస్థితి దృష్ట్యా అందరూ కలవాల్సిన అవసరం ఉందన్నారు.

Read Also: స్మశానవాటికలో హెల్త్ క్లినిక్… టీడీపీ నేతల వరుస అరెస్టులు

జగన్ విధ్వంసక పాలన పోవాలంటే ధర్మపోరాటం చేయక తప్పదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీపీ చేసే ధర్మపోరాటానికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. కుప్పం ప్రజలకు తనకు ఎంతో మంచి అవినాభావ సంబంధం ఉందని, అలాంటి బంధాన్ని వైసీపీ వచ్చి చెడగొట్టిందని, అందుకే ఇప్పుడు ఎమోషనల్‌గా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ద్వారా ఆరోగ్యపరంగా, విద్యాపరంగా అనేక సేవా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. వైసీపీ నేతలకు ప్రజలు త్వరలో చెవులు పూలు పెట్టే రోజులు వస్తాయన్నారు. తమిళనాడులో అమ్మ క్యాంటీన్‌లను స్టాలిన్ సర్కారు కొనసాగిస్తుంటే.. ఏపీలో మాత్రం అన్న క్యాంటీన్‌లను జగన్ ప్రభుత్వం మూసివేసిందని విమర్శించారు. రాష్ట్రం జగన్ జాగీరు కాదని గుర్తుపెట్టుకోవాలన్నారు. కరోనా వల్ల ఏపీ ఆదాయం తగ్గలేదని… జగన్ పరిపాలన వల్లే ఆదాయం తగ్గిపోయిన పరిస్థితి వచ్చిందన్నారు. ఈసారి పుంగనూరులో పెద్దిరెడ్డి ఎలా గెలుస్తాడో చూస్తానని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Related Articles

Latest Articles