బాబు సొంత వ్యూహాలతోనే బరిలో దిగనున్నారా?

టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీలో ఎవరినీ నమ్మడం లేదా? అంటే అవుననే సంకేతాలే విన్పిస్తున్నాయి. టీడీపీ గత ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలవడం దగ్గరి నుంచి, పార్టీలోని సీనియర్లంతా వరుసబెట్టి బయటికి వెళుతుండటం చూస్తుంటే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. ఇక తాజాగా ఆపార్టీకి చెందిన ఎన్నికల వ్యూహకర్తకు సైతం చంద్రబాబు గుడ్ బై చెప్పినట్లు వార్తలు విన్పిస్తున్నాయి. దీంతో రాబోయే ఎన్నికల్లోనూ చంద్రబాబు వ్యూహాలే ఆపార్టీకి శరణ్యంగా మారనున్నాయనే టాక్ ఆపార్టీలో విన్పిస్తోంది. ఇప్పటికే ఈమేరకు సంకేతాలు పార్టీ శ్రేణులు, నేతలకు వెళ్లినట్లు తెలుస్తోంది.

గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్(పీకే)ను నియమించుకున్నారు. ఆ ఎన్నికల్లో పీకే టీమ్ వ్యూహాలు, ప్రతివ్యూహాలు టీడీపీని బాగా దెబ్బతీశాయి. దీనికితోడు జగన్ ఇమేజ్ కలిసి రావడంతో గత ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజార్టీ సాధించింది. ఈ ఎన్నికల తర్వాత తమకు కూడా ఎన్నికల వ్యూహకర్త అవసరమని టీడీపీ అధినేత భావించారు. ఈమేరకు ప్రశాంత్ కిషోర్ టీంలో పని చేసిన రాబిన్ శర్మను వ్యూహకర్తగా నియమించుకున్నారనే వార్తలు అప్పట్లో విన్పించాయి. ఈమేరకు గడిచిన తిరుపతి ఉప ఎన్నికల్లోనూ రాబిన్ శర్మ టీడీపీ కోసం పని చేసినట్లు తెలుస్తోంది.

తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ నియమించిన వలంటీర్ల తరహాలోనే టీడీపీ సైతం నియోజకవర్గంలో ప్రతీ 50మందికి ఒక కార్యకర్తను నియమించాలని భావించింది. అయితే క్షేత్రస్థాయిలో అది సాధ్యపడలేదు. వైసీపీ ఎదుర్కొనేందుకు పెద్దగా ఎవరు ముందుకు రాలేదు. దీంతో ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థినే అత్యధిక మెజార్టీతో గెలుపొందాడు. టీడీపీ కేవలం నామమాత్రంగా పోటీ ఇచ్చింది. అలాగే హిందూ దేవాలయాల విషయంలో రాబిన్ శర్మ తనకు తప్పుడు డైరెక్షన్ ఇచ్చారని చంద్రబాబు భావిస్తున్నారట. రామతీర్థంకు తనను నేరుగా వెళ్లాలని సూచించడం, ఆ తర్వాత జరిగిన ఘటనలను ఆయన లెక్కలోకి తీసుకొని చంద్రబాబు మనస్థాపానికి గురయ్యారట.

దీంతో రాబిన్ శర్మ సేవలు పార్టీకి పెద్దగా ఉపయోగం లేకుండా పోతున్నాయని ఆయన భావిస్తున్నారు. ఈమేరకు ఆయనతో గతంలో టీడీపీ కుదుర్చకున్న ఒప్పందాన్ని సైతం రద్దు చేసుకున్నట్లు వార్తలు విన్పిస్తున్నాయి. టీడీపీ నేతలు ఇటీవల తమకు ఎన్నికల వ్యూహాకర్తలు అవసరం లేదని మాట్లాడుతున్నారు. వైసీపీ మాదిరిగా మాకు పీకేలు అవసరం లేదని మేము చంద్రబాబు వ్యూహాలతోనే బరిలో దిగుతామంటూ స్పష్టం చేస్తున్నారు. పార్టీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలనే టీడీపీ నేతలు ఇలా వ్యక్తం చేస్తున్నట్లు కన్పిస్తోంది. ఏదిఏమైనా టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి తన సొంత వ్యూహాలను నమ్ముకొని ఎన్నికల బరిలో దిగనుండటం ఆసక్తిని రేపుతోంది. ఈసారైనా చంద్రబాబు వ్యూహాలు వైఎస్ జగన్ ముందు పని చేస్తాయో లేదో వేచిచూడాల్సిందే..!

-Advertisement-బాబు సొంత వ్యూహాలతోనే బరిలో దిగనున్నారా?

Related Articles

Latest Articles