లోకేశ్ విషయంలో.. టీడీపీ తలచినదే జరుగుతోందా?

ఎంత బలం ఉన్నా.. ఎంతటి బలగం ఉన్నా.. ఉపాయాలు, వ్యూహాలు ఎన్ని ఉన్నా.. ఓ వ్యక్తి నాయకుడిగా ఎదగాలంటే.. ఎన్నో డక్కాముక్కీలు తినాల్సి ఉంటుంది. రాటుదేలాల్సి ఉంటుంది. అవసరమైతే ప్రజా పోరాటాల్లో అరెస్టూ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరిస్థితి ఇలాగే ఉన్నట్టు కనిపిస్తోంది. విషయం ఏదైనా సరే.. ఆయన జనాల్లోకి వెళ్తున్న తీరు చూసి.. పార్టీ అభిమానులు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో.. పోలవరం నిర్వాసితులను కలిసేందుకు వెళ్లినప్పుడు.. రమ్య అనే యువతి దారుణ హత్యకు గురైనప్పుడు.. ఇతర సందర్భాల్లోనూ.. లోకేశ్ ఆయా ప్రాంతాలకు వెళ్లారు. బాధితులను కలిశారు. ఇలాంటి తరుణాల్లో.. పదే పదే.. పోలీసులు అడ్డుకోవడమే కాకుండా.. అదుపులోకి తీసుకుంటూ.. అక్కడి నుంచి తరలిస్తూ.. టీడీపీ నేతలు ఆందోళనలు చేసి వార్తల్లో నిలిచేందుకు పరోక్షంగా అవకాశం కల్పిస్తున్నారనే చెప్పాలి.

ఈ క్రమంలో.. ఓ నాయకుడు తాను పోరాటం చేస్తున్నానని నిరూపించుకోవాలన్నా.. జనం కోసం నిలబడుతున్నాడని అందరితో అనిపించుకోవాలన్నా.. ఇలాంటి అరెస్టులు, ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు ఉపయోగపడతాయని పార్టీ నేతలు కొందరు భావిస్తున్నారట. లోకేశ్ ను నాయకుడిగా ఎదిగేలా చేసే ప్లాన్ లో భాగంగానే.. ప్రతి కీలక విషయంపై ఆయన్ను జనాల్లోకి పంపిస్తున్నారట. చివరికి.. తాము అనుకున్నదే జరిగి లోకేశ్ టాక్ ఆఫ్ న్యూస్ అవుతున్నారట.

అంతా చూస్తుంటే.. రాబోయే కాలానికి.. బలాబలాలతో సంబంధం లేకుండా.. టీడీపీకి నారా లోకేశ్ మాత్రమే పెద్ద దిక్కు అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. 70వ పడిలో ఉన్న చంద్రబాబు.. ఎంత త్వరగా లోకేశ్ ను రాటు దేలిస్తే.. టీడీపీకి అంత మంచిదని అనుకుంటున్నట్టుగా కూడా తాజా పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే.. జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయి నుంచి ఉపాధ్యక్షుడి స్థాయికి లోకేశ్ టీడీపీలో ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది.

మరోవైపు.. వయసు పైబడుతున్న కారణమో మరేదో తెలియదు కానీ.. చంద్రబాబు సైతం ఈ మధ్య రాజకీయంగా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. జూమ్ మీటింగులు, ట్వీట్లకే పరిమితం అవుతూ.. అతి ముఖ్యమైన కార్యక్రమాలైతే తప్ప ఆయన పెద్దగా మీడియా ముందుకు రావడం లేదు. ఆయన బదులు లోకేశ్ ను బయటికి పంపుతుండడం కూడా.. ఈ చర్చకు దారి తీస్తోంది. చూడాలి… లోకేశ్ ఎంతవరకూ ముందుకెళ్తారు.. టీడీపీ ని ఎలా ముందుకు తీసుకెళ్తారు ..!

Related Articles

Latest Articles

-Advertisement-