శాంతి భద్రతలు ఫెయిల్.. మాకు మాట్లాడే స్వేచ్ఛ లేదా..?

ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు ఫెయిల్‌ అయ్యాయని విమర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. టీడీపీ నేత పట్టాభి ఇంటితో పాటు.. రాష్ట్రవ్యాప్తంగా పలు టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన.. రౌడీయిజం చేస్తే బెదురుతామని భావించవద్దు నఅ్నారు.. మాకు మాట్లాడే స్వేచ్ఛ లేదా..? అని ప్రశ్నించిన చంద్రబాబు.. ఇది నా కోసం చేసే పోరాటం కాదు.. వైసీపీ సృష్టించిన విధ్వంసానికి నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ నిర్వహిస్తున్నాం.. ఆ బంద్‌కు సహకరించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు.. ఇక, సీఎం వైఎస్‌ జగన్‌, డీజీపీ కుమ్మక్కై చేసిందే ఈ దాడి అని ఆరోపించారు చంద్రబాబు.. నేను ఫోన్ చేస్తే డీజీపీ ఫోన్ ఎత్తారా..? అని నిలదీసిన ఆయన.. గవర్నర్, కేంద్ర మంత్రి ఫోన్లు ఎత్తుతారు కానీ.. డీజీపీ ఫోన్ ఎత్తలేనంత బీజీనా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక, నేనెప్పుడూ రాష్ట్రపతి పాలనను సపోర్ట్ చేయలేదు.. కానీ, ఇంతకంటే దారుణం ఏముంటుంది..? రాష్ట్రపతి పాలన పెడితే తప్పేంటీ అని అనిపిస్తోందని వ్యాఖ్యానించారు చంద్రబాబు.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా పరిరక్షిస్తారనేదే ప్రధాన సమస్య.. అందుకే కేంద్ర మంత్రికి ఫోన్ చేశాను అన్నారు చంద్రబాబు.. నేనెప్పుడన్నా బూతులు తిట్టానా..? అని ప్రశ్నించిన ఆయన.. బూతుల ప్రయోగంపై డిబేటి చేయండి.. ఎవరు దీన్ని ముందుగా మొదలు పెట్టారు.. నన్ను, మా నేతలను ఎన్ని బండ బూతులు తిట్టినా మేం సహించాం అన్నారు.. మా పార్టీ కార్యాలయంపై దాడి చేసి ఒకరిద్దర్ని చంపేస్తే పార్టీ కార్యాలయాన్ని మూసేస్తారా..? అని మండిపడ్డ ఆయన.. ఇప్పుడు కూడా చాలా కోపం ఉంది.. బాధ ఉంది.. అయినా నిగ్రహంతో ఉన్నాను. నా ఇంటిని తాళ్లతో కట్టేసినప్పట్నుంచి ఈ విధానం మొదలైందన్నారు.

40 ఏళ్ల పాటు రాజకీయాలు చూశాను.. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఎప్పుడూ చూడలేదన్నారు చంద్రబాబు.. ప్రభుత్వం, పోలీసులు కుమ్మక్కై పార్టీ కార్యాలయంపై దాడి చేశారని ఆరోపించిన ఆయన.. ఆర్గనైజ్డుగా ఒకేసారి రాష్ట్రంలో వివిధ చోట్ల దాడులు చేశారని.. పార్టీ కార్యాలయలపైనా దాడులు ఎప్పుడూ జరగలేదన్నారు.. 100 మీటర్లలోపే డీజీపీ కార్యాలయం ఉన్నా.. దాడులు ఆపలేకపోయారని ఫైర్ అయ్యారు. మరోవైపు.. డ్రగ్ మాఫియాకు రాష్ట్రం అడ్డాగా మారిందని విమర్శించిన చంద్రబాబు.. రాష్ట్రాన్ని డ్రగ్స్ కోరల నుంచి బయటపడేయాలని కోరడం మా తప్పా..? ఏపీలో గంజాయి ఉత్పత్తి చేసి దేశం మొత్తం సరఫరా చేస్తుంటే మేం ప్రశ్నించకూడదా..? పార్టీ కార్యాలయాలపై దాడి చేసి చంపేయాలని చూస్తారా..? పులివెందుల రాజకీయాలు చేస్తారా..? డీజీపీ నేరస్తులతో లాలూచీ పడతారా..? పార్టీ కార్యాలయం పైనా.. నేతల పైనా దాడులు జరిగితే.. ప్రజాస్వామ్యం ఎక్కడిది..? డీజీపీ కార్యాలయం పక్కన దాడులు చేస్తే ఆర్టికల్ 356 ఎందుకు అమలు చేయకూడదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. స్టేట్ టెర్రరిజానికి వ్యతిరేకంగా రాష్ట్ర బంద్ కు పిలుపిస్తున్నాం.. ఇది నా కోసం చేసే పోరాటం కాదు.. అందరూ బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు చంద్రబాబు.

Related Articles

Latest Articles