రాష్ట్ర విభజన కంటే జగన్ చేసిన డ్యామేజే ఎక్కువ..!

ఏపీ సర్కార్, సీఎం వైఎస్‌ జగన్‌పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాష్ట్ర విభజన కంటే వైఎస్‌ జగన్ చేసిన డామేజ్ నుంచి రాష్ట్రం కోలుకోవడం చాలా కష్టం అన్నారు.. కరోనా వైరస్‌కి మందుందేమో కానీ.. జగన్ వైరస్‌కి మందు లేదని మండిపడ్డారు.. ఏపీ అప్పు రూ. 7 లక్షల కోట్లకు చేరిందన్న బాబు.. ఉద్యోగులకు చరిత్రలో ఎవ్వరూ ఇవ్వనంత ఫిట్‌మెంట్‌ టీడీపీనే ఇచ్చిందన్నారు.. చెత్త మీద పన్నేసిన చెత్త ప్రభుత్వం ఇది, చెత్త పన్ను కట్టకుంటే ఇంటి ముందు చెత్త వేయమని ఓ మహా నాయకుడు చెబుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. పేదలకు ఇళ్లే కాదు ఆస్తి కల్పించిన ఘనత టీడీపీదేనన్న బాబు.. టీడీపీ ఇచ్చిన రూ. 2 వేల పెన్షన్ను కూడా తామే ఇచ్చామని జగన్ సిగ్గు లేకుండా చెబుతున్నారని ఫైర్‌ అయ్యారు.. టీడీపీ అధికారంలోకి వచ్చుంటే ఇప్పుడు రూ. 3 వేల ఫించన్ ఇచ్చేవాళ్లం అన్నారు.

Read Also: తెలంగాణలో భూప్రకంపనలు.. ఆ 2 జిల్లాల్లో పరుగులు పెట్టిన ప్రజలు..!

విద్యా వ్యవస్థ విషయంలో జగన్ దూరదృష్టి లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు చంద్రబాబు.. టీచర్ల నియామకం చేయకుండా విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చేశారు.. ఇప్పుడు ఏపీలో పేదలకు విద్య అందని పరిస్థితి నెలకొంది.. వాళ్ల పిల్లలు విదేశాల్లో చదువుకోవాలా..? పేదలకు విద్య అందకూడదా..? అని నిలదీశారు. ఇక, ఒక్క రోజులోనే రూ. 124 కోట్ల మద్యం తాగేశారు.. మద్యం ముడుపులకు ఇబ్బంది రాకుండా ఉండేందుకే మద్యం దుకాణాల్లో ఆన్ లైన్ పేమెంట్ల వ్యవస్థని పెట్టలేదని ఆరోపించారు చంద్రబాబు.. కాంట్రాక్టర్లంతా రోడ్ల మీద పడిన పరిస్థితి నెలకొందన్న ఆయన.. కోవిడ్ ఇబ్బందితో పాటు.. వైసీపీ గ్రహణం కారణంగా రాష్ట్రం చాలా ఇబ్బందులు పడుతోందన్నారు.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బాధితులే.. వేదిక పైనున్న వారిలో షరీఫ్ మినహా ప్రతి ఒక్కరి పైనా కేసులున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. షరీఫ్ ఇటీవల వరకు మండలి ఛైర్మన్ పదవిలో ఉన్నారు కాబట్టి కేసుల్లేవనుకుంటా అని వ్యాఖ్యానించారు. పార్లమెంటైనా జరుగుతోంది కానీ.. అసెంబ్లీ జరగడం లేదని సెటైర్లు వేసిన చంద్రబాబు.. ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థలను భ్రష్టు పట్టించేశారని.. న్యాయ వ్యవస్థ పైనా గతంలో ఎవ్వరూ చేయని విధంగా విమర్శలు చేశారని మండిపడ్డారు. టీడీపీకి సమస్యలు కొత్త కాదు.. కానీ ఇప్పుడున్న సవాళ్లు మాత్రం గతంలో ఎన్నడూ ఎదురు కాలేదని.. ఎంతో మంది సీఎంలు వచ్చారు.. కానీ ఎవరూ డామేజ్ చేయని విధంగా జగన్ రాష్ట్రాన్ని డామేజ్ చేశారన్నారు.

Related Articles

Latest Articles