అనంతపురం జిల్లా టీడీపీ నేతలకు బాబు క్లాస్‌..!

బాహుబలి సైన్యంలా వెళ్లారు. తీరా యుద్ధంలో చతికిల పడ్డారు. 20వార్డులకు రెండుచోట్లే గెలిచారు. ఈ ఫలితాలతో ఆ జిల్లా నేతలకు అధినేత నుంచి అక్షింతలు పడ్డాయట. డైలాగ్ కొంచెం తేడా కావొచ్చేమో కానీ.. తమ్ముళ్లకు సీరియస్‌గానే తలంటారట. టీడీపీలో చర్చగా మారిన ఆ పోస్టుమార్టం ఏంటి? లెట్స్‌ వాచ్‌..!

పెనుకొండ పురపోరులో పాతికమంది టీడీపీ నేతల ప్రచారం..!

రాష్ట్రంలో ఇటీవల జరిగిన మినీ మున్సిపల్ పోరు పొలిటికల్ హీట్ క్రియేట్ చేసింది. కుప్పం తరువాత అంత హైప్ తీసుకొచ్చింది పెనుకొండ మున్సిపాల్టీనే. పంచాయతీ నుంచి మున్సిపాల్టీగా మారిన తరువాత తొలిసారి జరిగిన ఎన్నికలు కావడంతో అందరూ ఇటే చూశారు. పైగా పెనుకొండ మొన్నటి వరకు టీడీపీ కంచుకోట. అలాంటి నియోజకవర్గంలో వైసీపీ నుంచి శంకర్‌ నారాయణ గెలిచారు. మంత్రిగా ఉన్నారు. అందుకే ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది టీడీపీ. దాదాపు పాతికమంది టీడీపీ నాయకులు ఎన్నికల్లో ఫీల్డ్‌ ఎంట్రీ ఇచ్చారు. ఈ జాబితాలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు ఉన్నారు. గతంలో ఎమ్మెల్యేలుగా పని చేసిన వారంతా ఒక్కో వార్డుకు ఒక్కొక్కరుగా ఇంఛార్జ్‌గా ఉండి దాదాపు 10రోజులు ప్రచారం చేశారు.

పెనుకొండలో టీడీపీకి దక్కింది రెండు వార్డులే..!
జిల్లా టీడీపీ నేతలకు చంద్రబాబు క్లాస్‌..!

ఓ విధంగా చెప్పాలంటే టీడీపీ భారీ సైన్యాన్ని పెనుకొండ కోటలో దింపింది. ఫలితాలు చూస్తే.. ఘోర పరాభవం. పెనుకొండలో 20వార్డులుంటే.. అందులో వైసీపీ 18చోట్ల గెలిచింది. టీడీపీకి దక్కింది రెండు వార్డులే. పెనుకొండలో టీడీపీ నాయకులు తమ ఓటమికి వైసీపీ దౌర్జన్యాలు, ప్రలోభాలే కారణమని చెప్పినా.. మరీ రెండు సీట్లకే పరిమితం కావడంపై ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి. అధినేత చంద్రబాబు జిల్లా నేతలందర్నీ విజయవాడకు పిలిపించి ఎన్నికలపై సమీక్షించారు. ఈ మీటింగ్‌లో జిల్లా నాయకులంతా పాల్గొన్నారు. మొదట సాఫ్ట్‌గా మొదలైన మీటింగ్ కాస్త.. కొద్ది సేపటికే బాగా వేడి పెరిగిందట. అధినేత చంద్రబాబు జిల్లా నేతలకు ఒక రేంజ్ లో క్లాస్ తీసుకున్నారట. నేతల సమన్వయ లోపం, అలసత్వంతోనే టీడీపీ ఓడిపోయిందని చంద్రబాబు కుండబద్దలు కొట్టారు.

ఎన్నికల్లో టీడీపీ నాయకులు సరిగా పనిచేయలేదా?

పెనుకొండలో టీడీపీ బలంగా ఉన్నప్పటికీ నాయకుల మధ్య ఐక్యత లేదని బాబు చెప్పారట. మాజీ ఎమ్మెల్యే, హిందూపురం పార్లమెంట్ ఇంఛార్జ్ పార్థసారథి సమన్వయంతో ముందుకు వెళ్లడంలేదని తలంటారట. ప్రచారం మొదలుకొని పోలింగ్ వరకు జరిగిన లోపాలను ప్రస్తావించారట.. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఇంత మంది ప్రచారానికెళ్లినా రెండు సీట్లతో తిరిగొచ్చారన్నారట. మొత్తానికి ఎన్నికల నిర్వహణలో టీడీపీ నాయకులు సరిగా పని చేయలేదనే అభిప్రాయానికి చంద్రబాబు వచ్చారట. భవిష్యత్‌లో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. అలసత్వం వహిస్తే ఎంతటి నేతలనైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారట. అమరావతిలో జరిగిన సమీక్షా సమావేశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు జిల్లా నేతల్లో కలవరం పుట్టించాయి. క్షేత్ర స్థాయిలో జరిగిన విషయాలు తన వద్దకు వస్తున్నాయని, రానున్న రోజుల్లో మార్పులకు సిద్ధంగా ఉండాలని నేతలను అప్రమత్తం చేయడంతో నాయకుల్లో కలవరం మొదలైందట.

Related Articles

Latest Articles