కొత్త రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు గ్రీన్‌ సిగ్నల్.. ఇక ఇలా..!

త్వరలోనే వాహనదారులు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోనున్నాయి.. దేశవ్యాప్తంగా కొత్తగా వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ ప్రక్రియతో.. రాష్ట్రాల మధ్య వాహనాల బదిలీ సులభతరం కానుంది.. ఇది అందుబాటులోకి వస్తే దేశవ్యాప్తంగా కొత్త వాహనాలకు భారత్‌ సిరీస్‌ (బీహెచ్‌ సిరీస్‌)తో రిజిస్ట్రేషన్లు చేస్తారు.. ఈ ప్రక్రియతో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఉద్యోగ రీత్యా బదిలీ అయ్యే ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది.. మరో రాష్ట్రానికి బదిలీ అయి వెళ్లగానే వారి వాహనాలకు అక్కడ మళ్లీ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.. బీహెచ్‌ సిరీస్‌తో రిజిస్ట్రేషన్‌ అయ్యే వాహనాలకు.. నేషనల్‌పర్మిట్‌ లభించనుంది.. సెంట్రల్ మోటార్ వాహనాల చట్టంలోని 20వ సవరణ, 2021 చట్టం.. ఈ ఏడాది సెప్టెంబర్ 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొంది ప్రభుత్వం..

కాగా, భారత్‌ సిరీస్‌ ప్రక్రియపై ఈ వారమే ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం… ఈ నోటిఫికేషన్‌ ప్రకారం ఇకపై రిజిస్ట్రేషన్‌ చేసే వాహనాలు అన్నింటికీ బీహెచ్‌ సిరీస్‌ వర్తిస్తుంది.. అయితే, ఇప్పటివరకు అందుబాటులో ఉన్న మోటార్‌ వెహికిల్‌ చట్టం 1988 ప్రకారం, ఒక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌ చేసిన వాహనాన్ని మరో రాష్ట్రానికి తీసుకెళ్లిన తర్వాత ఏడాదిలోగా అక్కడ కూడా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంది.. దీనికి కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి.. ఎందుకంటే.. వాహనం యజమానికి ఎన్‌వోసీ తీసుకోవడం, రిజిస్ట్రేషన్‌ ఆఫీసు చుట్టూ తిరగడం, పన్నులు చెల్లించడం వంటి తలనొప్పులు తప్పేవి కావు.. కానీ, కొత్త విధానంతో.. రాష్ట్రం మారేవారు వారి వాహనానికి స్థానికంగా తిరిగి రిజిస్ట్రేషన్‌ చేయించాల్సిన అవసరం ఇక ఉండదు.. ఈ కొత్త ప్రక్రియలో వాహనానికి ‘YY BH 1234 XX’ మాదిరిగా రిజిస్ట్రేషన్‌ ఉంటుంది. దీనిలో తొలి రెండు అక్షరాలు రిజిస్ట్రేషన్‌ చేసిన సంవత్సరాన్ని, తర్వాత బీహెచ్‌ అంటే భారత్‌ సిరీస్‌ను.. తర్వాత నాలుగు అంకెలతో వాహనం రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఉంటుంది. చివరన ఉండే రెండు అక్షరాలు రిజిస్ట్రేషన్‌ చేసిన రాష్ట్రాన్ని సూచించనుంది.. భారత్ సిరీస్‌లో వాహనాల రిజిస్ట్రేషన్ సౌకర్యం రక్షణ సిబ్బంది, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర, రాష్ట్ర పీఎస్‌యూలు, ప్రైవేట్ రంగ కంపెనీలు, సంస్థలకు స్వచ్ఛందంగా ఇవ్వనున్నారు. నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కార్యాలయాలు ఉన్న ప్రైవేట్ రంగ సంస్థలు, ఆయా సంస్థల ఉద్యోగులు ఈ సదుపాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. అయితే, బీహెచ్‌ సిరీస్ వాహనాలు ఒకేసారి రెండేండ్ల పాటు రోడ్డు పన్నును చెల్లించాల్సి ఉంటుంది.

-Advertisement-కొత్త రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు గ్రీన్‌ సిగ్నల్.. ఇక ఇలా..!

Related Articles

Latest Articles