ఇలాంటి సీఎం మనకు అవసరమా?… కిషన్ రెడ్డి ఫైర్

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారం తుది అంకానికి చేరుకుంది. ఈనెల 30న అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పోటీ బీజేపీ-టీఆర్‌ఎస్ మధ్యే వుంది. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం బుజునూరు గ్రామంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈటల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ఆత్మ గౌరవానికి, కేసీఆర్ అహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నిక హుజురాబాద్ అన్నారు. ఏడేళ్ళుగా తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారు. కేసీఆర్ డబ్బులను నమ్ముకొని ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నారన్నారు.

రాష్ట్రంలో జరిగే ప్రతి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని, కరోనా కారణం గా ప్రతి పేదింటికి ఉచితంగా బియ్యం ఇస్తున్నామన్నారు. ధర్మం వైపు ఉన్న ఈటల రాజేందర్ ను గెలిపించాల్సిన అవసరం హుజురాబాద్ ప్రజల మీద ఉందన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బులతో హుజురాబాద్ లో గెలవాలని కేసీఆర్ చూస్తున్నారు. మనకు ఫామ్ హౌస్ పాలన కావాలా…? సంక్షేమ పాలన కావాలా…? ఒకసారి ఆలోచించండి.

ఒక్కరోజు కూడా సచివాలయానికి రాని ముఖ్యమంత్రి మనకు అవసరమా…? అబద్ధం ముందు పుట్టి కేసీఆర్ తర్వాత పుట్టినట్టున్నారు. కేసీఆర్ వచ్చిందే కాంగ్రెస్ పార్టీ నుండి. దళిత బంధు పై కేసీఆర్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. దళితులకు ఇస్తామన్న 3 ఎకరాల భూమి హామీ ఏమైంది…?

దళిత బంధు రావడానికి కారణం ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి దళితునికి దళితబంధు పథకం అమలు చేయాలన్నారు. కేసీఆర్ నియంతృత్వ పాలనకు ప్రజలు చరమ గీతం పాడాలంటే హుజురాబాద్ లో ఈటల రాజేందర్ ను గెలిపించాలన్నారు. ప్రజలను అవహేళన చేసే విధంగా ముఖ్యమంత్రి కుర్చీ నా ఎడమ కాలి చెప్పుతో సమానం అన్న కేసీఆర్ కు ఓటు అడిగే హక్కు లేదని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు.

Related Articles

Latest Articles