అది రాదని తెలుసు.. కానీ..!

ప్రత్యేక హోదా. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల తీరని కలే అని చెప్పుకోవాలి. అది ఇచ్చేది లేదని.. ఇచ్చే అవకాశమూ లేదని మోడీ ప్రభుత్వం వీలు దొరికినప్పుడల్లా చెబుతూనే ఉంది. ప్రజలు కూడా ఈ విషయంలో హోప్స్ వదిలేసుకున్నారు. కానీ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మాత్రం హోదాపై అవకాశాలు కల్పించుకుని మరీ కేంద్రం దృష్టికి తీసుకుపోతున్నారు. ఏపీకి హోదా ఇవ్వాల్సిందే అని అడుగుతున్నారు.

తాజాగా.. పార్లమెంటరీ స్థాయీ సంఘానికి నేతృత్వం వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి.. మళ్లీ ఈ విషయాన్ని లేవనెత్తారు. ఈ సారి.. ఆంధ్రప్రదేశ్ కు తోడు.. ఛత్తీస్ గఢ్, జార్ఖంఢ్ నూ లైన్ లోకి తెచ్చారు. పదేళ్ల పాటు ఈ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించాలని అన్నారు. అంతే కాదు.. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపైనా అభ్యంతరం తెలియజేస్తూ.. త్వరగా సంబంధిత పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.

అంతా బానే ఉంది. అక్కడ కేంద్రం.. హోదా ఇచ్చేందుకు ఏ మాత్రం సుముఖంగా లేదు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం.. ప్రజలకు హామీ ఇచ్చింది.. 20కి పైగా ఎంపీ సీట్లను ఇస్తే హోదా తెస్తామని చెప్పింది. ఆ మాట కోసమైనా పోరాటాన్ని చేస్తున్నట్టుగా.. ఇలాంటి సందర్భాలను వినియోగించుకుంటోంది. ఈ క్రమంలో మధ్యలో జనాలే.. ప్రేక్షకులుగా మిగలాల్సి వస్తోంది. కేంద్రమే.. ఈ విషయమై పూర్తి స్థాయి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.

గతంలో తెలుగుదేశం.. బీజేపీతో కలిసి పని చేసినప్పుడు కూడా.. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ విషయాల్లో అయోమయం నెలకొంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నా.. కేంద్రం అదే అయోమయ వైఖరి కొనసాగిస్తోంది. ప్రజలకు ఏదైనా విషయాన్ని దాగుడుమూతలు లేకుండా చెబితే.. వాళ్లు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇలా.. అయోమయ స్థితిని కొనసాగిస్తే.. భవిష్యత్తుపై ప్రజలు గందరగోళంలో పడాల్సి వస్తుంది.

ఈ విషయంలో.. కేంద్రమే స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇక హోదా రాదు.. మేం ఇచ్చేది లేదు.. ఎవరూ అడగొద్దు.. అడిగినా ఫలితం ఉండదు.. అన్నంత స్థాయిలో స్పష్టమైన ప్రకటన చేస్తే తప్ప.. ఈ గందరగోళానికి తెర పడే అవకాశం కనిపించడం లేదు.

Related Articles

Latest Articles

-Advertisement-