కరోనాపై రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్.. ఇకపై రాత్రి 10 గంటల వరకు టీకాలు

దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితి అస్థిరంగా ఉందని…. కరోనాతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య సైతం మారొచ్చని అప్రమత్తం చేశారు. వైద్య సిబ్బంది సేవలను జాగ్రత్తగా వినియోగించుకోవాలని ప్రభుత్వాలకు సూచించారు. జంబో వైద్య కేంద్రాలు, ఫీల్డ్ ఆస్పత్రులను ఏర్పాటు చేసిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ప్రశంసించారు. దేశ వ్యాప్తంగా కరోనా సోకిన వారిలో కేవ‌లం 5 నుంచి 10 శాతం మంది బాధితుల‌కే ఆస్పత్రిలో చికిత్స అవ‌స‌రం అవుతుంద‌ని తెలిపారు. మిగితా వారికి హోం ఐసోలేష‌న్ ఉంటే స‌రిపోతుంద‌ని తెలిపారు.

కరోనా సోకిన రోగులను ఆస్పత్రులను తరలించేందుకు ఇబ్బందులు కలగకుండా అదనపు అంబులెన్సులను సిద్ధం చేసుకోవాలి. అన్ని జిల్లా ఆస్పత్రులు, బోధనాస్పత్రులను ఈ-సంజీవని టెలీకన్సల్టేషన్ హబ్‌లుగా ఉపయోగించుకోవాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచనలు జారీ చేసింది. కరోనా రోగుల కోసం ప్రైవేట్ ఆస్పత్రుల్లో వివిధ రకాల పడకలు అందుబాటులో ఉండాలని… ఆయా ఆస్పత్రులు, క్లినిక్స్‌లలో వసూలు చేసే ఫీజులు ప్రజలకు అందుబాటులో ఉండాలని.. ఒకవేళ అధిక రుసుములు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు కరోనా వ్యాక్సిన్‌ సమయాన్ని రాత్రి 10 గంటల వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వ్యాక్సిన్ కోసం ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

Related Articles

Latest Articles