కేంద్రం వరం.. ఆర్థిక కష్టాల నుంచి జగన్ సర్కారు గట్టెక్కినట్టేనా?

అన్ని రాష్ట్రాల మాదిరిగానే కరోనా ఎంట్రీ తర్వాత ఏపీ ఆర్థిక పరిస్థితి మరింతగా కుప్పకూలింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ముందే ఏపీ అప్పుల్లో కురుకుపోయింది. టీడీపీ హయాంలో అభివృద్ధి పేరిట చేసిన అప్పులు వేలకోట్లలో ఉన్నాయి. ఈ భారం మొత్తాన్ని కూడా జగన్ సర్కారే మోయాల్సి వస్తోంది. వీటి వడ్డీల భారమే ప్రతినెలా తడిచిమోపడు అవుతోంది. ఇక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ఏపీ సర్కారు సంక్షేమం కోసం ప్రతీ నెల వేలకోట్ల రూపాయాలను ఖర్చు చేయాల్సి వస్తోంది. మరోవైపు ఏపీ అభివృద్ధిపై దృష్టిసారించిన సర్కారు నిధులను సమీకరించే పనిలో పడింది.

అయితే కరోనా పిడుగు ఏపీ ఆర్థిక పరిస్థితిని మరింత దెబ్బతీసింది. అరకొరగా వస్తున్న ఏపీ ఆదాయం పూర్తిగా పడిపోవడంతో సర్కారు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా సంక్షేమ పథకాలను ఆపిన దాఖలాల్లేవు. ప్రభుత్వ పథకాలతో లక్షలాది మంది సామాన్య, పేద ప్రజలు లబ్ధిపొందుతుండటంతో వాటి అమలుకే ఆయన మొగ్గుచూపారు. ఈ పథకాలపై ఆర్థికభారం పడకుండా చర్యలు తీసుకున్నారు. ఏపీకి ఎక్కడి నుంచి నిధులు రావాల్సి ఉన్నాయో గుర్తించి వాటిని రాబట్టే పనిలో పడ్డారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, విభజన హామీల్లో ఏపీకి ఇచ్చిన హామీలపై ఏపీ సర్కారు ఫోకస్ పెట్టింది.

నిధులేమీతో కొట్టుమిట్టాడుతున్న ఏపీకి కేంద్రం నుంచి వరుసగా నిధుల వరద పారుతుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కేంద్రం నుంచి గత పదిరోజుల్లో మూడోసారి రుణ సేకరణకు అనుమతి లభించింది. ఏపీకి దాదాపుగా పదివేల కోట్లకుపైనా అదనంగా రుణం పొందటానికి ఇటీవలే కేంద్రం అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత రుణ పరిమితి అవకాశం అన్ని రాష్ట్రాలకు 0.5శాతం మేర పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం కూడా ఏపీకి బాగానే కలిసొచ్చింది. తాజాగా కేంద్రం ఏపీకి రూ 2,655 కోట్ల మేర రుణాల అనుమతి ఇచ్చింది.

మొత్తం 11 రాష్ట్రాలకు జీఎస్డీపీలో 0.25 శాతం మేర అదనపు రుణం సేకరించటానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. మొత్తంగా 11రాష్ట్రాలకు రూ 15,721 కోట్ల మేర రుణ సేకరణకు అనుమతి లభించింది. ఇందులో ఏపీకి 2,655 కోట్ల మేర వెసులుబాటు కలిగింది. వీటి ద్వారా మూల ధన వ్యయాన్ని పెంచటానికి అవసరమైన వనరులు రాష్ట్ర ప్రభుత్వాలకు అందుబాటులోకి వస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. కరోనాతో రాష్ట్రాలు దెబ్బతినగా ఆయా రాష్ట్రాలు కేంద్రానికి పలు వినతులను సమర్పించాయి. వీటి పరిగణలోకి తీసుకున్న కేంద్రం తొలి క్వార్టర్ లో మూల ధన వ్యయ మొత్తంలో 20 శాతం ఖర్చు చేయాలన్న షరతును 15శాతానికి తగ్గించింది. దీంతో అదనపు రుణ సౌలభ్యం దక్కింది.

ఏపీ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ 27,589 కోట్లు మూలధన వ్యవయంగా ఖర్చు చేయాలని తొలుత కేంద్రం షరతు విధించింది. అయితే ఆ తర్వాత ఆ పరిమితిని రూ. 26,262 కోట్లకు తగ్గించింది. మూలధన పరిమితిలో కొంత ఖర్చు చేయాల్సిన పరిమితిలో కొంత తగ్గించిన కారణంగా ఏపీకి డిసెంబర్ వరకు రూ.10,155 కోట్ల రుణ సౌలభ్యం లభించింది. కేంద్రం నుంచి క్రమంగా నిధులు అందుబాటులోకి వస్తుండటంలో క్రమంగా ఏపీ ఆర్థిక కష్టాల నుంచి క్రమంగా కోలుకుంటుందని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు తమ సొంత ఆదాయ వనరులను పెంచుకొనేందుకు ఏపీ సర్కారు గతంలో కంటే భిన్నంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళుతోంది.

Related Articles

Latest Articles

-Advertisement-